ఆమె చేస్తున్న పాత్రలన్నీ భిన్నమైనవే !

శ్రద్ధా కపూర్‌ ప్రస్తుతం ఒక పక్క తెలుగు చిత్రం ‘సాహో’, మరో పక్క బాలీవుడ్‌ సినిమా ‘స్ట్రీట్‌ డాన్సర్‌ 3డీ’ షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాల్లో ఆమె చేస్తున్న పాత్రలు భిన్నమైనవే. ఒకదానితో మరోదానికి పొంతన లేనివే. ‘స్ట్రీట్‌ డాన్సర్‌ 3డీ’ తనని తాను మరోసారి కొత్తగా ఆవిష్కరించుకునేందుకు ఉపయోగపడే పాత్ర. డాన్స్‌ నేపథ్యంలో రూపొందే ఈ సినిమా… శ్రద్ధా ఎటువంటి వెరైటీని కోరుకుంటుందో అటువంటిదే ఈ చిత్రం ద్వారా లభిస్తుందట. శ్రద్ధా మాట్లాడుతూ…. ‘ నాకైతే ఈ సినిమా ఎంతో ముఖ్యమైంది. విభిన్నమైన పాత్రలోనూ, విభిన్నమైన వ్యక్తులతో పని చేయాలన్న తపన ఈ చిత్రం ద్వారా నెరవేరుతుంది. ఈ సినిమా చాలా పెద్దది. నేను కూడా తీవ్రంగా కష్టపడాలి. ఈ సినిమా చేసేందుకు నాకు అవకాశం రావడం ఎంత ముఖ్యమైందో, ప్రేక్షకులకూ అంతే వెరైటీగా ఉంటుంది” అని చెబుతోంది శ్రద్ధా. ఈమె ఇంతకుముందు చేసిన సినిమాలన్నీ కొత్తగానే ఉంటాయి. ఒకసారి చేసిన పాత్రలాంటిది మరోసారి చేసేందుకు ఈమె ఇష్టపడరు. అలా చూసుకుంటే.. ‘హైదర్‌’, ‘ఏబీసీడీ 2’, ‘హసీనా పార్కర్‌’, ‘స్ట్రీ’ చిత్రాలే దీనికి సాక్ష్యం.
మూడో భాగానికి మరోసారి శ్రద్ధా
బాలీవుడ్‌ సూపర్‌ హిట్ యాక్షన్ సిరీస్‌ ‘బాఘీ’. ఇప్పటికే రెండు భాగాలుగా రిలీజ్‌ అయిన ఈ సిరీస్‌లో ఇప్పుడు మూడో భాగం రెడీ అవుతోంది. తెలుగు సూపర్‌ హిట్ ‘వర్షం’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిన ‘బాఘీ’లో టైగర్‌ ష్రాఫ్‌, శ్రద్ధా కపూర్‌లు జంటగా నటించారు. తరువాత మరో తెలుగు సూపర్‌ హిట్‌ ‘క్షణం’కు రీమేక్‌గా తెరకెక్కిన ‘బాఘీ 2’లో టైగర్‌కు జోడిగా దిశాపటాని అలరించారు.త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న మూడో భాగానికి మరోసారి శ్రద్ధానే హీరోయిన్‌గా తీసుకున్నారు దర్శక నిర్మాతలు. ఈ విషయాన్ని నిర్మాత సాజిద్‌ నడియావాలా సోషల్‌ మీడియా ద్వారా కన్ఫామ్ చేశారు.అహ్మద్‌ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా 2020లో రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ప్రస్తుతం సాహోతో పాటు ‘స్ట్రీట్‌ డ్యాన్సర్‌’, ‘చిచోరే’ సినిమాల్లో నటిస్తున్న శ్రద్ధా త్వరలోనే ‘బాఘీ’ టీంతో జాయిన్‌ కానున్నారు.