ఆ మాత్రం కష్టం లేకపోతే థ్రిల్‌ ఏముంటుంది?

శ్రద్ధా కపూర్‌ ముంబాయి నుంచి హైదరాబాద్‌కు, హైదరాబాద్‌ నుంచి దుబాయ్‌కి, దుబాయ్‌ నుంచి ఇస్తాంబుల్‌..అక్కడ నుంచి అనటియా..మళ్లీ ఇస్తాంబుల్‌, అక్కడ నుంచి ముంబాయి ఇదీ వారంలో బాలీవుడ్‌ కథానాయిక శ్రద్ధా కపూర్‌ ప్రయాణించాల్సి ప్రాంతాలు. హైదరాబాద్‌ రావడం ఇక్కడ రెండు రోజులు షూటింగ్‌లో పాల్గొనడం మరో చోటకు వెంటనే వెళ్లడం. ఇలాగే ఆరు నెలలు నుంచి ఆమె షెడ్యూల్‌ సాగుతోంది. నిత్యం బిజీ. కుటుంబ సభ్యులకు కూడా ఆమె అందుబాటులో ఉండడం లేదట. ప్రస్తుతం బాలీవుడ్‌లో చాలా బిజీగా ఉన్న కథానాయిక ఈమె ఒక్కరే. మల్టీపుల్‌ ప్రాజెక్టులు ఆమె చేతిలో ఉండడంతో ఆ సినిమా చిత్రీకరణలో పాల్గొనేందుకు నిత్యం విమానంలోనే ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రయాణంలోనే ఆమె నిద్రపోయేది కూడా. ఈ విషయాన్ని శ్రద్ధాయే స్వయంగా వెల్లండించింది. ప్రస్తుతం శ్రద్ధ మూడు చిత్రాలతో బిజీగా ఉంది. ‘సాహో’, ‘చిచ్చోరే’, ‘స్ట్రీట్‌ డ్యాన్సర్‌ త్రీడీ’… ఈ మూడూ వేటికవే భిన్నమైన చిత్రాలు. ఈ మూడు సినిమాల షూటింగ్‌ల మధ్య తిరుగుతోంది శ్రద్ధ. ఓ పాత్రలో లీనమై బయటకొచ్చి మరో కొత్త పాత్రలో ఒదిగిపోవాలి. ఇది కొంచెం కష్టమైన పరిస్థితే శ్రద్ధకు. హైదరాబాద్‌లో ‘సాహో’ షూటింగ్‌కి, దుబాయిలో ‘స్ట్రీట్‌ డాన్సర్‌ 3డీ’ ఇస్తాంబుల్‌కు మరో సినిమాకు ఇలా ఎక్కువ సమయం ప్రయాణిస్తుంది. ఒక సినిమాకు మరో సినిమాలో చేసే పాత్రకు ఎటువంటి సంబంధమూ ఉండదు. ఇలా ఒక చిత్రం షూటింగ్‌లో పాల్గొని మరో సినిమా సెట్స్‌పై షూట్‌లో పాల్గొనడం, ఆ పాత్రకు తగ్గట్టు నటించడం విశేషమే. అటువంటి సాహసాన్ని శ్రద్ధా కపూర్‌ చాలా ధైర్యంగా చేస్తోంది.మరి దీని గురించి శ్రద్ధ ఏమంటుందంటే…..
మూడు కొత్త ప్రపంచాలే !
‘‘నా జీవితంలో ఇలాంటి సందర్భం ఎప్పుడు వస్తుందా? అని ఎదురుచూశాను. మూడు విభిన్నపాత్రలంటే మూడు కొత్త ప్రపంచాలే. ఒకే జీవితంలో ఇన్ని జీవితాల్ని అనుభవించే అవకాశం రావడం నా అదృష్టం. అందరికీ ఇలాంటి అవకాశం రాదు కదా. ఒక పాత్ర నుంచి మరో పాత్రలోకి మారడానికి కొన్ని సందర్భాల్లో కష్టమవుతుంది. కానీ ఆ మాత్రం కష్టం లేకపోతే నాకు థ్రిల్‌ ఏముంటుంది?’’ అని అంటోంది.
‘‘ఒకేసారి రెండు మూడు చిత్రాల్లో నటించడం కష్టంగానే ఉంది. ఒక్కోసారి కంటినిండా నిద్ర కూడా ఉండటం లేదు. మెడిటేషన్‌ ద్వారా ఆ లోటును భర్తీ చేస్తున్నాను. నటులకు మంచి అవకాశాలు అరుదుగా వస్తుంటాయి. ఇదిగో ఒక్కోసారి ఇలా ఒకేసారి వచ్చేస్తాయి. అప్పుడు కష్టం తప్పదు. అదృష్టం మూడుసార్లు తలుపుతడితే ఒక్కసారే తీస్తానంటామా… సినిమా అవకాశాలు కూడా అంతే’’ అని చెప్పింది శ్రద్ధ.