పరాజయం ఎదురుకానిదే పాఠం నేర్వలేం !

“నేను నటించే ప్రతి పాత్ర గత పాత్రల కంటే భిన్నంగా, సాధ్యమైనంత కొత్తగా ఉండేలా చూసుకుంటాను. అంతేకాదుఆ  పాత్ర ద్వారా నన్ను నేను కొత్తగా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తా. నాలో కొత్త అంశాలను వెలికితీసేందుకు ట్రై చేస్తాను. అదే సమయంలో నా వ్యక్తిగత జీవితంపై పాత్ర ప్రభావం పడకుండా చూసుకుంటాను”…అని అంటోంది శ్రద్ధా కపూర్‌.ప్రస్తుతం శ్రద్ధా ‘సాహో’ చిత్రంలో ప్రభాస్‌ సరసన నటిస్తోంది. ‘బత్తీ గుల్‌ మీటర్‌ చాలు’ చిత్రంలో షాహిద్‌ కపూర్‌ సరసన నటిస్తోంది.
 
“నాన్న శక్తి కపూర్‌, ఆంటీ పద్మిని కొల్హాపుర్‌ నటులుగా నన్నెప్పుడూ గైడ్‌ చేస్తుంటారు” అని అంటోంది శ్రద్ధా కపూర్‌. నేను ఏదైన తప్పు చేస్తే దాన్నుంచి చాలా విషయాలను నేర్చుకోవాలని మా నాన్న, ఆంటీ చెబుతుంటారు. అందుకే నా సినిమాలు పరాజయం చెందితే కుంగిపోను. అలాగే విజయాలు వస్తే పొంగిపోను. సక్సెస్‌, ఫెయిల్యూర్‌కి, కన్‌ఫ్యూజన్‌కి అతీతంగా స్క్రిప్ట్‌లను ఎంపిక చేసుకుంటా’ అని తెలిపింది. 
 
#‘ఇలాంటి కథ ఉంటేనే’ ‘ఈ నటులైతేనే’ ‘ఇలా తీస్తేనే..’ అని మనకు కొన్ని లెక్కలు ఉంటాయి. నిజానికి ఇదొక భ్రమ. ఎందుకంటే ‘సేఫ్‌’ అనుకున్న ప్రాజెక్ట్‌లు బోల్తా కొట్టవచ్చు. ‘రిస్క్‌’ అనుకొని భయపడినవి బ్లాక్‌బస్టర్‌లు కావొచ్చు! ‘ఇది ఇలాగే అవుతుంది’ అని చెప్పడానికి బౌండ్‌ రూల్స్‌ ఏమీ లేవు. ఏదైనా ప్రేక్షకుల చేతుల్లోనే ఉంది.
 
#నా కెరీర్‌ ‘ఫెయిల్యూర్‌’తో మొదలైంది. పరాజయం ఎదురుకానిదే పాఠం నేర్వలేమనేది కూడా అర్థమైంది. మనకు తెలియకుండానే కొన్ని చట్రాల్లో చిక్కుకుపోతాం. ఆ చట్రం నుంచి బయటికి వచ్చినప్పుడు మనకు మనమే కొత్తగా పరిచయమవుతాం. ‘హసీనా పార్కర్‌’ సినిమాలో హసీనా పాత్ర సవాలుగా అనిపించింది. ‘నేను చేయగలనా?’ అని వెనకా ముందూ ఆడాను. ‘ఎందుకు చేయలేను’ అనుకున్నాను గట్టిగా. దాని ఫలితం వృథా పోలేదు.
#ఒక నటిగా డ్యాన్స్‌ చేయడం అంటే ఎంత ఇష్టపడతానో… పాడడాన్ని కూడా అంతే ఇష్టపడతాను. పెయింటింగ్‌ అంటే కూడా ఇష్టం. వీలైతే నా భావాలను రచనల రూపంలో ప్రపంచంతో పంచుకోవడం ఇష్టం. సంగీతం, నటనలలో ఏది ఇష్టం? అని అడిగితే చెప్పడం కష్టం. రెండూ నా మనసుకు చేరువైనవే.