సవాల్ గా తీసుకుని డబ్బింగ్‌ చెప్పడానికి సిద్ధం !

సవాల్ గా తీసుకుని తన పాత్రకు తానే డబ్బింగ్‌ చెప్పుకోవడానికి సిద్ధం అవుతోంది బాలీవుడ్‌ బ్యూటీ శ్రద్ధాకపూర్‌.సినిమా ఎల్లలు దాటుతున్న కాలం ఇది. కొత్తదనంతో పాటు, పర్ఫెక‌్షన్‌ చాలా ముఖ్యం. తారలు చెప్పింది చేసేసి పోదాం, సాంకేతిక వర్గం చుట్టేసిపోదాం అనుకోవడంలేదు. ముందు తరం తారలు తమ పాత్రలకు తామే డబ్బింగ్‌ చెప్పి, పాటలు పాడుకునే వారు. ఆ తరువాత అది కొరవడుతూ వచ్చింది. పరభాషా తారల ప్రాబల్యం పెరగడం కూడా ఇందుకు ఒక కారణం కావచ్చు. మాతృభాషలో కూడా డబ్బింగ్‌ చెప్పుకోలేని కథానాయికలు ఉన్నారంటే అతి శయోక్తి కాదు. అలాంటిది ఇటీవల పరభాషా యువ నటీమణులు కూడా తమ పాత్రలకు తామే డబ్బింగ్‌ చెప్పుకోవడానికి ఆసక్తి చూపుతుండటం ఆహ్వానించదగ్గ పరిణామం.

అలా తన పాత్రకు తానే డబ్బింగ్‌ చెప్పుకోవడానికి సిద్ధం అవుతున్న బాలీవుడ్‌ బ్యూటీ శ్రద్ధాకపూర్‌. ఈ ముద్దుగుమ్మ త్రిభాషా చిత్రం ‘సాహో’లో కథానాయకిగా నటిస్తున్న విషయం తెలిసిందే. ‘బాహుబలి -2’ చిత్రం తరువాత ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న భారీ చిత్రం ఇది.  ఈ చిత్రానికి శ్రద్ధాకపూర్‌ తెలుగు, తమిళం భాషల్లో సంభాషణలు చెప్పడానికి ప్రత్యేకంగా ఒక ట్యూటర్‌ను నియమించుకుందట.  డైలాగ్స్‌ పలకడంతో ఆయన నుంచి శిక్షణ పొంది చిత్ర సన్నివేశాల్లో నటిస్తోందట. అంతటితో ఆగకుండా తన పాత్రకు తానే డబ్బింగ్‌ చెప్పుకోవడానికి ముందుగానే సంభాషణల పేపర్లను తెప్పించుకుని ఇప్పటి నుంచే తర్ఫీదు పొందుతోందట. అదే విధంగా మరో మలయాళీ బ్యూటీ కీర్తీసురేశ్‌ కూడా తన పాత్రకు తానే డబ్బింగ్‌ చెప్పుకోవడానికి ఆసక్తి చూపుతోంది. ఈ అమ్మడిప్పుడు కోలీవుడ్, టాలీవుడ్‌లలో స్టార్‌ హీరోలతో నటిస్తూ చాలా బిజీగా ఉంది. తెలుగులో పవన్‌కల్యాణ్‌కు జంటగా నటిస్తున్న తాజా చిత్రంలో తన పాత్రకు తానే డబ్బింగ్‌ చెప్పేసిందట. ఈ విషయాన్ని తను డబ్బింగ్‌ చెబుతన్న ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసి మరీ చెప్పింది.

రెండు రంగాల్లోనూ కొనసాగాలనుకుంటున్నా!

శ్రద్ధా కపూర్‌ నటి… సింగర్‌ కూడా. ఈమె నటనా రంగంలోకి రాకముందే పాడడం అంటే ప్రత్యేకమైన అభిరుచి. అందుకే ఓ పక్క నటిస్తూనే మరో పక్క తన అభిరుచికి తగ్గట్టు పాటలు కూడా పాడేస్తోంది. ‘సబ్‌ తేరా… గల్లియానా’ … ‘ఫిర్‌ భి తుమ్‌కో చాహుంగీ…’ వంటి గీతాలు ఈమె పాడినవే. తాజాగా మరో ఆల్బమ్‌ చేస్తోందట. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఆమెను అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ… ‘నాకు పాడడం ఇష్టం. నటన కూడా ప్రాణం. అందుకే ఈ రెండు రంగాల్లోనూ కొనసాగాలనుకుంటున్నా. నటనకు ఎంత ప్రాధాన్యమిస్తానో పాడడానికి అంతే ప్రాధాన్యమిస్తా’ అని పేర్కొంది శ్రద్ధా కపూర్‌.