పెళ్లిరోజునాడు దారుణమైన పరిస్థితుల్లో పడ్డా!

“జన్మభూమిలో ఎప్పుడు అడుగుపెడతానో తెలియడం లేదు.నా తల్లిదండ్రులు ముంబైలో ఉన్నారు. నేను తరుచు వాళ్లతో వీడియో కాల్ ద్వారా మాట్లాడుతున్నాను.ఇండియాను మిస్ అవుతున్నాన”ని చెప్పింది హీరోయిన్ శ్రియా శరణ్. “మా అమ్మ కొన్ని వంటకాలను ఎలా చేయాలో నేర్పిస్తున్నారు. ప్రస్తుతం నా దగ్గర మసాలా దినుసులు అయిపోయాయి. ఇక దేశీ ఫుడ్ తినలేనేమో అని నాకు భయమేస్తోంది’’ అని శ్రియ ఆవేదన వ్యక్తం చేసింది. హీరోయిన్ శ్రియా శరణ్ ప్రస్తుతం స్పెయిన్‌లోని బార్సిలోనాలో దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు. ప్రపంచంలో కరోనా తీవ్ర ప్రభావం చూపిన దేశాల్లో స్పెయిన్ ఒకటి. అత్యంత దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటోన్న దేశాల్లో స్పెయిన్ ఒకటి. అలాంటి దేశంలో ప్రస్తుతం శ్రియా శరణ్ ఉంది . భర్తతో కలిసి సుమారు నెల రోజులుగా ఇంట్లోనే ఉంటోంది .అంతేకాదు, తన భర్త ఆండ్రీ కొశ్చీవ్‌కు కరోనా లక్షణాలు కనిపించడంతో చాలా కంగారు పడిందట . ప్రస్తుతం తామిద్దరం వేర్వేరు గదుల్లో ఉంటున్నామని ..కరోనా మహమ్మారి కారణంగా ఇక్కడ ఎంతో మంది ఉపాధిని కోల్పోయారని..చాలా మంది తమ కుటుంబానికి దూరంగా ఒంటరిగా హాస్టల్స్‌లో ఉండిపోయారని శ్రియ చెప్పింది.
 
దారుణమైన పరిస్థితుల్లో ఉన్నా!..
‘‘నెల రోజులు పైగా నేను బార్సిలోనాలో లాక్‌డౌన్‌లో ఉన్నాను. కోవిడ్-19 వచ్చిన తరవాత నా చుట్టూ పరిస్థితులు ఎంత దారుణంగా మారిపోయాయో తలుచుకుంటేనే భయమేస్తోంది. కరోనా ఎక్కువగా ఉన్న స్పెయిన్‌లో ఉంటూ… ఈ వైరస్ వల్ల జీవితాలు ఎంత త్వరగా తలకిందులయ్యాయో చూస్తున్నాను. మార్చి 13న నేను, నా భర్త ఆండ్రీ మా పెళ్లిరోజును సెలబ్రేట్ చేసుకోవడానికి బయటికి వెళ్లాం. అప్పటికి ఇంకా కరోనావైరస్ వ్యాపించలేదు. రెస్టారెంట్‌లో మేం సీట్స్ రిజర్వ్ చేసుకున్నాం. ఆ రెస్టారెంట్‌ను మూసేశారు. దీంతో పరిస్థితి చాలా సీరియస్‌గా ఉందని మాకు అర్థమైంది. స్పెయిన్ మొత్తం లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది. అప్పటి నుంచి పరిస్థితులన్నీ మారిపోయాయి. ఇంటిలో నుంచి ఒక వ్యక్తి మాత్రమే బయటికి రావడానికి పోలీసులు అనుమతించారు . అది కూడా తప్పనిసరి అయితే మాత్రమే. ఆండ్రీ కలిసి వెళ్తుండగా పోలీసులు మమ్మల్ని ఆపారు. కానీ, ఆయన వైట్.. నేను బ్రౌన్. దీంతో మేమిద్దం భార్యభర్తలం కాదని .. వేర్వేరు వ్యక్తులమని అనుకొని వదిలేశారు.
 
రోజురోజుకి పరిస్థితులు భయంకరంగా మారిపోతున్నాయని వార్తలు వస్తున్న పరిస్థితుల్లో.. ఆండ్రీకి పొడి దగ్గు, జ్వరం వచ్చాయి. వెంటనే మేం హాస్పిటల్‌కు వెళ్లాం. డాక్టర్లు పరీక్షించి వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోమని చెప్పారు. ‘ఒకవేళ ఈయనకు కోవిడ్-19 లేకపోయినా, ఇక్కడే ఉంటే కచ్చితంగా సోకుతుంది’ అని డాక్టర్లు మాకు చెప్పారు. దీంతో ఇంటికి వెళ్లిపోయి మాకు మేం నిర్బంధంలో ఉండాలని, ఇంటి వద్దే ట్రీట్‌మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాం. అప్పటి నుంచి వేర్వేరు గదుల్లోనే పడుకుంటున్నాం. ఇద్దరికీ మధ్య దూరం పాటిస్తున్నాం. దేవుడి దయవల్ల ప్రస్తుతం ఆయన బాగానే ఉన్నారు’’ అని శ్రియ చెప్పుకొచ్చింది.