ఆమెలా అరవై ఏళ్ళు దాటినా నటిస్తూనే ఉంటా !

అరవై ఏళ్ళు దాటినా నటిస్తూనే ఉంటానంటోంది నటి శ్రియ. ‘ఇష్టం’ అంటూ టాలీవుడ్‌లోకి రంగప్రవేశం చేసిన ఈ ఉత్తరాది బ్యూటీ ఆ తరువాత ‘మళై ఉనక్కు 20 ఎనక్కు 18’ చిత్రం ద్వారా కోలీవుడ్‌ దిగుమతైంది. ఆ తరువాత జయంరవి, విజయ్, ధనుష్‌ వంటి సూపర్‌స్టార్‌తో నటించి, ‘శివాజీ’ చిత్రంతో ఏకంగా సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తోనే జత కట్టే లక్కీచాన్స్‌ కొట్టేసింది. అదే విధంగా తెలుగులోనూ చిరంజీవి, బాలకృష్ట, నాగార్జునల నుంచి నేటి తరం హీరోల వరకూ నటిస్తున్న శ్రియ ఖాతాలో సక్సెస్‌లు చాలానే ఉన్నాయి. ఇప్పటికీ హీరోయిన్‌గా బిజీగా ఉన్న ఈ అమ్మడు ప్రస్తుతం తమిళంలో ‘నరకాసురన్’, తెలుగులో ‘గాయత్రి’, ‘వీర భోగవసంతరాయులు’, హిందీలో ‘తడ్కా’ అంటూ మూడు భాషల్లో నటిస్తోంది.

ఇలా దశాబ్దంన్నర పాటు కథానాయకిగా రాణిస్తున్న శ్రియ తాను సినిమాలో ఇంకా కొనసాగడం గురించి స్పందిస్తూ…. చాలా సంతోషంగా ఉందని పేర్కొంది. ఇంకా ఎన్నేళ్లు నటిస్తారు? అని చాలా మంది అడుగుతున్నారని, హాలీవుడ్‌ నటి మెరిల్‌స్ట్రీప్ అరవై ఏళ్ళు దాటి ఇంకా నటిస్తున్నారని, ఆమెలా తానూ సినిమాల్లో కొనసాగాలని కోరుకుంటున్నానని అంది. తాను కథక్‌ నాట్యకళాకారిణిఅని, సినిమాలతో బిజీగా ఉండడం వల్ల పదేళ్లుగా నాట్యానికి దూరంగా ఉండాల్సి వచ్చిందని చెప్పింది. మళ్లీ నాట్యంలో ప్రాక్టీస్‌ చేయడం మొదలెట్టానని చెప్పింది. ‘నాట్యం అన్నది ధ్యానం’ లాంటిదని అంది. ఈ తరం వారు మన సంప్రదాయ నృత్యాలు భరతనాట్యం, కూచిపూడి, కథక్‌ నృత్యాలపై ఆసక్తిని పెంచుకుని వాటిలో శిక్షణ పొందాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొంది. అలాంటి ప్రయత్నాన్నే తానూ చేస్తున్నానని శ్రియ అంటోంది.

అందంలోని రహస్యం ఏమిటని అడుగుతుంటారనీ, తన అందానికి ప్రధాన కారణం యోగానేననీ చెప్పింది. యోగా తన జీవితంలో చాలా మార్చు తీసుకొచ్చిందనీ, ఉద్రేకాలను అదుపు చేసుకోవడానికి యోగా ఎంతగానో ద్రోహదపడుతుందని తెలిపారు.ఇండస్ట్రీలోకి వచ్చి ఎంతోకాలమైనా తానిప్పటికీ నటనను ప్రేమిస్తున్నాననీ, వృత్తిని గౌరవించేవాళ్లకు అది ఎప్పటికీ బోర్‌ కొట్టదని శ్రియ అన్నారు. తానిక్కడ ఒంటరిగానే జయించానని, ఏనాడూ చేదు అనుభవాలు చవిచూడలేదని, నటిగా నిలదొక్కుకోవడంలో సహ నటీనటులు, దర్శక నిర్మాతలు సహకరించారని చెప్పుకొచ్చారు.

మరో ఆసక్తికరమైన పాత్రకు ఓకె ! 

టాలీవుడ్ సీనియర్ హీరోలతో పాటు కుర్ర హీరోలతోనూ నటించిమెప్పించిన సీనియర్ హీరోయిన్ శ్రియ ప్రస్తుతం ఆచితూచి సినిమాలు చేస్తున్నారు. పదిహేడేళ్ళుగా  కెరీర్ ని కొనసాగిస్తున్న ఈ బ్యూటీ ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ సినిమాలతో పాటు ప్రాధాన్యమున్న పాత్రలను మాత్రమే ఎంచుకుంటున్నారు. తాజాగా మరో ఆసక్తికరమైన పాత్రకు ఓకె చెప్పింది ఈ బ్యూటీ.

కొత్త దర్శకురాలు సుజన దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో ప్రయోగాత్మక పాత్రలో నటించనుంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ జ్ఞానశేఖర్‌ ఈ సినిమాతో నిర్మాతగా మారుతున్నారు. లెజండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా సంగీతమందిస్తున్న ఈసినిమాకు సాయి మాధవ్ బుర్రా మాటలు రాస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా మార్చిలో సెట్స్ మీదకు వెళ్లనుంది.