గాయనిగా ఇదొక అద్భుత అనుభవం !

శృతిహాసన్ ప్రొఫెషనల్ సింగర్‌లా సోమవారం లండన్‌లో పర్‌ఫార్మెన్స్ ఇచ్చింది. శృతి హీరోయినే కాదు మంచి సింగర్ కూడా. ఇప్పటికే కొన్ని సినిమాల్లో పాటలు కూడా పాడింది ఈ భామ. ఇప్పుడు ఒక ప్రొఫెషనల్ సింగర్‌లా తాజాగా లండన్‌లో పర్‌ఫార్మెన్స్ ఇచ్చింది. సోమవారంనాడు లండన్‌లోని ఎన్‌ఇడి హోటల్‌లో ‘న్యూ మ్యూజిక్ మండే’లో భాగంగా శృతిహాసన్ పాటలు పాడి ఆహుతులను అలరించింది. పవర్ స్టూడియో ఆధ్వర్యంలో మ్యూజిస్ షోస్ ప్రొడ్యూసర్ బెన్నీడీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ షో గురించి శృతి మాట్లాడుతూ…
“ఇదొక అద్భుతమైన అనుభవం. చాలా రోజుల తర్వాత స్టేజ్‌పై పాటలు పాడడం చాలా సంతోషాన్నిచ్చింది”అని పేర్కొంది. ఒరిజినల్ సింగిల్స్‌తో పాటు ఇతరులతో కలిసి మ్యూజిక్ ఆల్బమ్స్ చేయడంపై వర్క్ చేస్తున్నానని శృతిహాసన్ చెప్పింది. తన మ్యూజిక్ షోకు ప్రేక్షకుల స్పందన బాగుందని పేర్కొంది. ఇకపై మరిన్ని మ్యూజిక్ షోలలో పాల్గొంటానని ఆమె తెలిపింది. ఇదిలాఉండగా మహేష్ మంజ్రేకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో నటించేందుకు శృతిహాసన్ త్వరలో ఇండియాకు తిరిగి వస్తుందట.
బలం, బలహీనత తెలుసుకోవడానికే ఈ గ్యాప్‌
శృతీహాసన్‌ కొంత కాలంగా నటనకు దూరంగా ఉంటోంది.
“నటన మాత్రమే తనకు ముఖ్యం కాదని, ఇతరత్రా చాలా ఉన్నాయ”ని అప్పట్లో పేర్కొన్న శ్రుతీహాసన్‌ తాజాగా ఈ గ్యాప్‌ గురించి ఒక స్పష్టమైన వివరణ ఇచ్చింది.
“తన గ్యాప్‌ గురించి చాలా మంది చాలా రకాలుగా చర్చించుకుంటున్న విషయం తెలుసన్నారు. అలాంటి వారికి చెప్పేదేమిటంటే తన గురించి తాను పూర్తిగా అర్థం చేసుకోవడానికి కొంత సమయం అవసరం అయ్యిందన్నారు. తన బలం, బలహీనత తెలుసుకోవడానికే ఈ గ్యాప్‌ తీసుకున్నానని చెప్పారు. ప్రస్తుతం తానేమిటో క్లియర్‌గా అర్థం చేసుకున్నానని, ఇకపై తన నుంచి అభిమానులు అధిక చిత్రాలను ఆశించవచ్చని శ్రుతిహాసన్‌ అన్నారు. ఈ బ్యూటీ చిన్న గ్యాప్‌ తరువాత నటనకు రెడీ అయిపోయారు. ప్రస్తుతం ఒక హిందీ చిత్రంలో నటిస్తున్నారు. త్వరలోనే తండ్రితో కలిసి నటిస్తున్న ‘శభాష్‌నాయుడు’ చిత్ర బ్యాలెన్సు షూటింగ్‌ మొదలవుతుందని శ్రుతీహాసన్‌ తెలిపారు.
 
లండన్‌కు చెందిన మైఖెల్‌ అనే వ్యక్తి ప్రేమలో శ్రుతీ పడ్డట్టు, ఆయనతో పెళ్లికి సిద్ధం కావడంతోనే నటనకు దూరం అయ్యారనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఇటీవల చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఈ బ్యూటీ ఇలా అన్ని విషయాలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.