నాన్నతో కలిసి చేసా.. ఇకపై అమ్మతో కలిసి పనిచేస్తా !

‘ప్రతిభ గల తల్లిదండ్రులకు పుట్టాననే ఒత్తిడి నాపై లేదు. వారిని గర్వపడేలా చేయాలను కుంటున్నా.ఇప్పటి వరకు నాన్న(కమల్‌ హాసన్‌)తో కలిసి చాలా సినిమాలకు పనిచేశా. ఇకపై అమ్మ(సారిక)తో కలిసి పనిచేయాలనుంది’ అని అంటోంది శ్రుతి హాసన్‌.
గత కొంత కాలంగా ప్రేమలో పడి శ్రుతి సినిమాలు పూర్తిగా తగ్గించారు. ఇదే తరుణంలో మ్యూజిక్‌ ఆల్బమ్స్‌పై దృష్టిసారించారు. మరోవైపు కమల్‌ రూపొందిస్తున్న ‘శభాష్‌నాయుడు’ సినిమా పనులు చూసుకుంటున్నారు. ‘శభాష్‌నాయుడు’ త్వరలో విడుదలకు సన్నాహాలు చేసుకుంటోంది.
ఇటీవలే హిందీలో ఓ సినిమాకి గ్రీన్‌ సిగ్నల్  ఇచ్చారు. ఇలా మల్టీపుల్‌ వర్క్స్‌తో బిజీగా ఉన్న శ్రుతి ముంబయిలో జరిగిన ఓ ప్రైవేట్‌ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మాట్లాడుతూ…
“అమ్మ, నేను కలిసి నిర్మాణ సంస్థను ప్రారంభించాం. ఇకపై అమ్మతో కలిసి పనిచేయాలనుకుంటున్నా. అయితే ప్రతిభ కలిగిన తల్లిదండ్రులకు జన్మించాననే ఒత్తిడి నాపై లేదు. వారిని గర్వపడేలా చేయాలను కుంటున్నా. సొంతంగా గుర్తింపు తెచ్చుకోవాలని అనుకుంటున్నా. నన్ను ఎవరితోనూ పోల్చవద్దు. మా పేరెంట్స్‌ నాలుగేండ్ల వయసులోనే సినిమాల్లోకి వచ్చారు. దీంతో నాపై చాలా అంచనాలుంటాయి. కానీ నేను వాటిని అంతగా పటించుకోలేదు. బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి పదేండ్లు అవుతుంది. సినిమా రంగం మనకు ఓర్పుగా ఎలా ఉండాలో నేర్పుతుంది. నేను ప్లాన్‌ చేసుకుని సినిమా రంగంలోకి రాలేదు. వచ్చినందుకు మాత్రం సంతోషంగానే ఉన్నాను” అని తెలిపారు. శ్రుతి హాసన్‌ సినిమాల్లో ఎక్కువగా కనిపించాలని అభిమానులు కోరుకుంటున్నారు.