ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నా!

ఈ ఏడాది శ్రుతి హాసన్‌ నటించిన చిత్రాలు ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయాయి. ‘ఎస్‌3’, ‘కాటమరాయుడు’, ‘బెహెన్‌ హోగి తెరి’ చిత్రాలు బాక్సాఫీసు వద్ద డీలా పడ్డాయి. దీంతో తదుపరి చిత్రాల విషయంలో ఆలోచనలో పడింది శ్రుతి. అందుకు తగ్గట్టుగానే ఆచితూచి అడుగులేస్తుంది.
ఈ మధ్య ఆమె కొత్తగా ఏ సినిమాకు గ్రీన్‌ సిగ్నల్ ఇవ్వలేదు. చాలా రోజులు లండన్‌లో బాయ్ ఫ్రెండ్ తో విహారయాత్ర  సాగించింది.

ఇటీవల ఇండియా వచ్చిన శ్రుతి హాసన్‌ సినిమాలు ఒప్పుకోకపోవడంపై స్పందిస్తూ ….. ‘ప్రస్తుతం నేను ‘శభాష్‌నాయుడు’ చిత్రంలో నటిస్తున్నాను. నాన్న(కమల్‌హాసన్‌) రూపొందిస్తున్న ఈ సినిమా త్వరలో తిరిగి షూటింగ్‌ ప్రారంభం కానుంది. ఆ పనుల్లో ప్రస్తుతం బిజీగా ఉన్నాం. అలాగే హిందీలో నటించిన ‘యారా’ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్స్‌ వర్క్‌ జరుపు కుంటోంది. ఈ చిత్రాల తర్వాత నేను ఎలాంటి సినిమా చేయాలనేదానిపై ఆలోచించాలనుకుంటున్నా. ఎందుకంటే ఇటీవల మూడు భాషల్లో నటించిన చిత్రాలు సరైన ఫలితాలనివ్వలేదు. దీంతో కొత్త ప్రాజెక్టుల విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నా. గతంలో నటించిన చిత్రాలకు భిన్నంగా ఉండేలా, ఏదైనా కొత్తగా ఉండే సినిమాలు చేయాలనిపిస్తుంది. గతంలో ఒక్క ఏడాదే ఏడు సినిమాలు చేశా. అందుకే ఇప్పుడు కాస్త నెమ్మదిగానే సినిమాలు చేయాలనుకుంటున్నా’ అని తెలిపింది. ఇదిలా ఉంటే మహేష్‌బాబు హీరోగా, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందే చిత్రంలో శ్రుతి హాసన్‌ నటించే అవకాశం ఉందని టాలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి.