కష్టాల్లో శ్రుతి బాలీవుడ్‌ కెరీర్ !

ఈ ఏడాది బాలీవుడ్ లో ఒక ఫెయిల్యూర్‌ను చవిచూసిన ముద్దుగుమ్మకు ఊహించని విధంగా మరో షాక్ తగిలిందట.సౌత్‌లో సక్సెస్‌లు లేక ఇబ్బంది పడుతున్న ఈ అందాల భామకు బాలీవుడ్‌లోనూ కష్టాలు పెరిగిపోయాయట. గతంలో బ్యాడ్ టైమ్‌ ఫేస్ చేసి ‘ఐరన్ లెగ్’ అనిపించుకున్న కమల్ హాసన్ పెద్ద కూతురు శ్రుతి హాసన్ ఆ తరువాత టాలీవుడ్‌లో వచ్చిన హిట్ మూవీ ‘గబ్బర్ సింగ్’తో సక్సెస్ ట్రాక్ ఎక్కింది. ఈ సినిమా తరువాత క్రేజీ హీరోల పక్కన నటించి పలు విజయాలను సొంతం చేసుకున్న ఈమె మళ్లీ కొంతకాలంగా వరుస ఫెయిల్యూర్స్‌ చవిచూసింది. దీంతో శ్రుతి హాసన్‌కు కష్టకాలం మొదలైందని సినీ జనం గుసగుసలాడుకుంటున్నారు.మళ్లీ ఒక పెద్ద హిట్ వస్తే తప్ప శ్రుతి హాసన్ కెరీర్ గాడిలో పడే అవకాశం లేదని ప్రచారం జరుగుతోంది.

ఈ క్రమంలో శ్రుతి హాసన్ నటిస్తున్న ఓ బాలీవుడ్ మూవీ మధ్యలో ఆగిపోవడం ఆమెకు మరింత మైనస్‌గా మారిందని టాక్ వినిపిస్తోంది. విద్యుత్ జమాల్ హీరోగా నటిస్తున్న ‘యారా’ సినిమాలో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది.అయితే ఈ సినిమాకు ఎలాంటి బిజినెస్ జరగకపోవడంతో షూటింగ్ మధ్యలోనే ఆగిపోయిందట. విద్యుత్ జమాల్ పలు రకాల షేడ్స్‌లో కనిపించబోయే ఈ సినిమా మళ్లీ సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు కనిపించడం లేదని బీ టౌన్ వర్గాలు భావిస్తున్నాయి.ఈ ప్రభావం  శ్రుతి హాసన్ మీద మాత్రం బాగానే పడొచ్చని వార్తలు జోరందుకున్నాయి. ఈ ఏడాది శ్రుతి నటించిన బాలీవుడ్ మూవీ ‘బెహన్ హోగీ తేరి’ కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో బీ టౌన్‌లో ఇప్పుడప్పుడే మళ్లీ శ్రుతికి అవకాశాలు రావడం కష్టమే అని పుకార్లు మొదలయ్యాయి.