‘సక్సెస్‌కు ఓర్పు చాలా ప్రధానం’ అని అర్ధమైంది !

వయసు గురించి తాను అస్సలు పట్టించుకోనని, తన దృష్టిలో అదొక నంబర్ మాత్రమేనని చెప్పింది  శృతిహాసన్. అమెరికాలోని లాస్‌ఏంజిలస్‌లో శృతి తన 32వ జన్మదిన వేడుకల్ని జరుపుకుంది. కొందరు సన్నిహితులు, శ్రేయోభిలాషుల సమక్షంలో ఆనందంగా గడిపానని శృతిహాసన్ పేర్కొంది. ఈ సందర్భంగా తన కెరీర్‌కు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించింది….

కెరీర్ ఆరంభంలో వరుస అపజయాలు పలకరించాయి. ఒకానొక దశలో సినిమాల్లో కొనసాగడం కష్టమనుకున్నాను.అయితే నా ప్రయత్నాల్ని ఏమాత్రం విరమించకుండా ఓపికతో విజయం కోసం ఎదురుచూశాను. ఇప్పుడు కెరీర్ విషయంలో చాలా ఆనందంగా ఉన్నాను. సక్సెస్‌కు ఓర్పు చాలా ప్రధానమనే విషయం నాకు అవగతమైంది. వృత్తిపరమైన, వ్యక్తిగత విషయాల్ని సమన్వయం చేసుకుంటూ కెరీర్‌ను తీర్చిదిద్దుకుంటున్నాను అని తెలిపింది. నటనతో పాటు సంగీతం అంటే తనకు ప్రాణమని..ఈ ఏడాది మ్యూజిక్ ఆల్బమ్ చేసే ఆలోచనతో వున్నానని చెప్పింది. ప్రస్తుతం శృతిహాసన్ తన తండ్రి కమల్‌హాసన్ నటిస్తున్న ‘శభాష్‌నాయుడు’ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నది.

వివాహానంతరం నటనకు గుడ్‌బై !

 శ్రుతిహాసన్‌ తొలుత సంగీతదర్శకురాలిగా సినీరంగ ప్రవేశం చేశారు. ‘ఎన్నైపోల్‌ఒరువన్‌’ చిత్రం సంగీతదర్శకురాలిగా శ్రుతికి మంచి పేరునే తెచ్చిపెట్టింది. ఆ తరువాత ‘లక్కీ’ అనే హిందీ చిత్రంలో నటిగా అవకాశం రావడంతో నటించి చూద్దాం అన్న ధోరణిలో ఆ చిత్రం చేశారు.

ఆ చిత్రం విజయం సాధించకపోయినా తెలుగు, తమిళం భాషల్లో వరుసగా అవకాశాలు రావడంతో నటిగా కొనసాగుతున్నారు. అలా కొన్ని సక్సెస్‌లతో క్రేజీ హీరోయిన్‌గా పేరుతెచ్చుకున్న శ్రుతికి అనూహ్యంగా అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. ఇందుకు కారణం ఆమె స్వయంకృతాపరాధమే అనే ప్రచారం జరుగుతోంది. మంచి మార్కెట్‌ ఉండగా ‘సంఘమిత్ర’ చిత్రం నుంచి వైదొలగి వివాదాల్లో చిక్కుకున్న శుత్రి…ఆ తరువాత ఒక్క నూతన చిత్రం అంగీకరించకపోవడం చర్చకు దారి తీసింది. తన తండ్రితో కలిసి నటిస్తున్న ‘శభాష్‌నాయుడు’ సగంలోనే నిలిచిపోవడం ఆమె కెరీర్‌కు మైనస్‌గా మారిందనే చెప్పాలి. ప్రస్తుతం చేతిలో ఒక్క చిత్రం లేదు.

ఇటీవల శ్రుతి తన అందంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ప్రచారం వైరల్‌ అవుతోంది. ఆ మధ్య తన గ్లామర్‌పై విమర్శలు రావడంతో తన అందానికి  మెరుగులు దిద్దుకునే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం. ఒక ప్రముఖ  వైద్యుడి పర్యవేక్షణలో శ్రుతి  తన మేని అందాలను మెరుగు పరుచుకుంటున్నట్లు ప్రచారం. ఇక, శ్రుతి ఈ మధ్య తన బాయ్‌ఫ్రెండ్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరిగేస్తున్నారు. తండ్రి కమలహాసన్‌కు, తల్లి సారికకు పరిచయం చేసి వారి ఆమోదముద్రను పొందిన శ్రుతి త్వరలో బాయ్‌ఫ్రెండ్‌ మైఖెల్‌ కోర్సెల్‌ను వివాహం చేసుకోవడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. వివాహానంతరం నటనకు గుడ్‌బై చెప్పి అంతర్జాతీయ సంగీత ఆల్బమ్‌ల రూపకల్పన చేయాలనే ఆలోచనతో శ్రుతిహాసన్‌ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.