ఇక జన్మలో ముట్టుకో కూడదని నిర్ణయం తీసుకున్నా!

శ్రుతీ హాసన్ వ్యక్తిగత కారణాలతో రెండేళ్లు వెండితెరకు దూరమై ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది.మనసులోని మాటను ధైర్యంగా బయటకు చెప్పే శ్రుతి… ఇటీవల తన తాగుడు అలవాటు గురించి చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఆంగ్ల మీడియాతో శ్రుతి మరోసారి ఇదే విషయం మాట్లాడింది…
ఒకరోజు నా స్నేహితులతో కలిసి రాత్రంతా పార్టీ చేసుకున్నాను. ప్రతి శనివారం తీసుకునే మోతాదు కంటే చాలా ఎక్కువ మద్యం తీసుకున్నాను. నా జీవితానికి అది చాలనిపించింది. ఇక జన్మలో మందు ముట్టుకో కూడదని నిర్ణయం తీసుకున్నాను. మద్యం మంచిదా, కాదా? అనేది నేను ఇక్కడ చెప్పబోవడం లేదు. కానీ అది మానేసిన తర్వాత మాత్రం.. ‘నా జీవితం మెరుగ్గా ఉంది’ అని ఫీల్ అవుతున్నాను అని శ్రుతి చెప్పింది.ఒక మగవాడు మద్యం తీసుకుంటే ఎవరూ పట్టించుకోరని, అదే ఓ మహిళ తాగితే మాత్రం దాన్ని పెద్ద వివాదం చేసేస్తున్నార”ని ఆవేదన వ్యక్తం చేసింది శ్రుతి.
 
అంతా దూరంగా ఉంటూ ఉంటాం!
లాక్‌డౌన్ కారణంగా సెలబ్రిటీలు కూడా తమ ఇళ్లకే పరిమితమవుతున్నారు. సోషల్‌మీడియా ద్వారా తమ సమాచారాన్ని సెలబ్రిటీలు.. అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. శృతి హాసన్ లాక్‌డౌన్ కారణంగా తన కుటుంబసభ్యులను మిస్ అవుతున్నానని చెప్పింది . చాలాకాలంగా తన కుటుంబానికి దూరంగా ఉండటం అలవాటు చేసుకున్నానని పేర్కొంది..
‘‘నేను ప్రస్తుతం ముంబైలో ఉన్నాను. మా కుటుంబం అంతా ఒక చోట ఉండటం లేదు. మా నాన్న, చెల్లి ఇద్దరు చెన్నైలోనే ఉన్నారు. కానీ, ఒక చోట కాదు. మేమంతా రకరకాల ప్రదేశాలకు ప్రయాణిస్తుంటాం కాబట్టి.. ఒకే చోట ఉండటం కుదరదు. నేను నా కుటుంబాన్ని మిస్ అవుతున్నాను. కానీ, నేను చాలాకాలంగా నా కుటుంబానికి దూరంగా ఉండటాన్ని అలవాటు చేసుకున్నాను. మా ఫ్యామిలీలో సాధారణంగానే అంతా దూరంగా ఉంటూ ఉంటాం’’ అని శృతి తెలిపింది.
 
వారు ఏ మాత్రం సేవ చేస్తున్నారో?
శ్రుతీహాసన్‌ సోషల్‌ మీడియాలో తనను ట్రోల్‌ చేసిన నెటిజన్స్‌కు దీటైన సమాధానం చెప్పింది. ఇటీవల తాను పియానో వాయిస్తున్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది శ్రుతి. “ఇంట్లో ఖాళీగా కూర్చొని ఉండకపోతే బయటకు వెళ్లి ప్రజలకు సేవ చేయవచ్చుగా”… “కరోనా రిలీఫ్‌ ఫండ్‌కు మీరు ఇంకా ఎందుకు విరాళం ఇవ్వలేదు?” అని కొందరు నెటిజన్లు కామెంట్‌ చేశారట. ఈ విషయంపై శ్రుతీహాసన్‌ స్పందిస్తూ…
‘‘కరోనా సమయంలో ఎందుకు ప్రజలకు సేవ చేయడం లేదని కొందరు కామెంట్‌ చేసారు. నన్ను చేయమని చెప్పేవారు ప్రజలకు ఏ మాత్రం సేవ చేస్తున్నారో నాకు తెలియదు. కరోనా కారణంగా మనందర్నీ ఇంట్లోనే ఉండమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించాయని గుర్తుపెట్టుకోండి. అలాగే, “మనం ఇతరులకు ఎంత సహాయం చేస్తే.. అంత దేవుడు మనకు ఇస్తూనే ఉంటాడు” అనే మాటను నమ్మే వ్యక్తిని నేను. నాకు విరాళం ఇవ్వాలనిపిస్తే తప్పక ఇస్తాను. అంతేకానీ, అది ఇతరుల ఆదేశానుసారంగా చెయ్యను. గతంలో నేను సహాయం చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి’’ అని పేర్కోంది.