ఆ రెండు ఉన్నప్పుడే కథానాయికలు స్టార్లవుతారు!

శృతిహాసన్ పలు సినిమాల్లో గ్లామర్ తో ప్రేక్షకులకు కనువిందుచేసింది. ‘విశ్వనటుడు’ కమల్‌హాసన్ కుమార్తెగా శృతిహాసన్ ఈ స్థాయిలో గ్లామర్ పండిస్తుందని ఎవరూ ఊహించలేదు. అయితే హీరోయిన్లు గ్లామరస్‌గా కనిపించినప్పుడే ప్రేక్షకులు వారిని ఆదరిస్తారని ఆమె చెప్పడం విశేషం…
 
“సినిమా సక్సెస్ అవ్వాలంటే.. అందులో హీరోయిన్‌ల పాత్ర కూడా కీలకం. కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ల గ్లామర్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే సినిమాల్లో గ్లామరస్ యాంగిల్ తప్పదు. అయితే, గ్లామర్ ఒక్కటే ఏ హీరోయిన్ కెరీర్‌ను నడిపించదు. గ్లామర్‌తో పాటు పర్‌ఫార్మెన్స్ కూడా ముఖ్యం. ఈ రెండు ఉన్నప్పుడే కథానాయికలు స్టార్లు అవుతారు”అని చెప్పింది శృతిహాసన్.కమర్షియల్ సినిమాలతో పాటు కథా బలం ఉన్న సినిమాలు చేసినప్పుడే నటిగా కలకాలం గుర్తుండిపోతామ’ని చెప్పింది శృతి.
“నటునిగా మా నాన్న కమల్‌హాసన్ విభిన్నమైన పాత్రలు పోషించారు. ఆయన స్థాయిలో నాకు పేరు తెచ్చుకోవాలని ఉన్నా… అప్పట్లో ఆయన చేసినంత కథాబలమున్న సినిమాలు ఇప్పుడు రావడం లేదు. ‘సినిమాకు సంబంధించిన అన్ని విభాగాలపై అవగాహన కలిగి ఉండడం’ అనేది మా నాన్న నుంచి నాకు వారసత్వంగా వచ్చింది” అని చెబుతోంది శృతిహాసన్.
 
రవితేజ సినిమాలో శ్రుతి హీరోయిన్‌
శ్రుతి హాస‌న్ మ‌ళ్ళీ టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. మైఖేల్ కోర్సెల్ అనే వ్య‌క్తితో ప్రేమలో మునిగితేలిన శ్రుతి దాదాపు రెండేళ్లు సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల వీరి మధ్య ప్రేమకు బ్రేక్‌ పడటంతో… శ్రుతి మళ్లీ సినిమాల మీద ఫోకస్‌ చేస్తున్నారు. తమిళంలో విజయ్‌ సేతుపతి సరసన ‘లాభం’ సినిమాలో నటిస్తున్న శ్రుతి తెలుగులో ఓ సినిమాకు కమిట్‌ అయ్యారు. రవితేజ హీరోగా దర్శకుడు మలినేని గోపీచంద్‌ తెరకెక్కిస్తున్న సినిమాలో శ్రుతి హీరోయిన్‌గా నటిస్తున్నారు. దీన్ని బి.మధు నిర్మిస్తున్నారు.
 
పాట కోసం అద్భుతమైన విన్యాసాలు
రైతు సమస్యలు నేపథ్యంగా తెరకెక్కుతున్న ‘లాభం’ సినిమాలో విజయ్‌ సేతుపతితో శృతి రొమాన్స్‌ చేస్తున్నారు. ఈ సినిమాలో ఓ పాట కోసం శ్రుతి అద్భుతమైన స్టంట్స్‌ చేసినట్టు తెలుస్తోంది. శ్రుతి చేసిన విన్యాసాలకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఫ్యాన్స్‌ ఆమెను ప్రశంసలతో ముంచెత్తున్నారు. ‘లాభం’. చిత్రాన్ని ఆరుముగ కుమార్‌తో కలిసి విజయ్‌ సేతుపతి స్వయంగా నిర్మిస్తున్నారు. ఇందులో ఆయన రైతు నేతగా నటిస్తున్నారు. అమెరికాకి చెందిన ‘ట్రెడ్‌స్టోన్‌’లో శ్రుతి కీల‌క పాత్ర పోషిస్తున్నారు.