ఇది కూడా మనల్ని ఏకం చేయకపోతే.. ఇంకేం చేస్తుంది?

‘‘వైరస్‌కి ఎలాంటి వివక్ష ఉండదు. అందరిపైనా సమానంగా దాడి చేస్తుంది. దాన్ని ఎదుర్కోవాలంటే ఒకరి పై ఒకరు ప్రేమ, దయ చూపిస్తూ జాగ్రత్తగా ఉండాలి. కరోనా సమస్య కూడా మనల్ని ఏకం చేయకపోతే ఇంకేం ఏకం చేస్తుందో దేవుడికే తెలియాలి’’ అని అంటున్నారు శ్రుతీహాసన్‌.
“ప్రస్తుతం అందరం ఎదుర్కొంటున్న సమస్య కరోనా. కానీ ప్రజల్లో ఐకమత్యం కనిపించడంలేదు. ఐకమత్యంగా ఉంటేనే ఎలాంటి సమస్యని అయినా ఎదుర్కోగలం’’ అంటున్నారు శ్రుతీహాసన్‌. లాక్‌ డౌన్‌ సమయాల్లో ఇంటి పట్టునే ఉంటూ.. సోషల్‌ మీడియాలో అభిమానులతో టచ్‌లో ఉంటున్నారామె. వర్కౌట్స్, మేకప్‌ టిప్స్‌ షేర్‌ చేస్తున్నారు.
‘‘కొన్ని వార్తలు వింటుంటే చాలా దారుణం అనిపిస్తోంది.కొందరు వ్యక్తులు మానవత్వం మరచిపోయి ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి సమయాల్లోనూ వివక్ష చూపిస్తున్నారు అంటే మనుషులు ఎలా ఉన్నారో అర్థం అవుతోంది. కానీ వైరస్‌కి అలాంటి వివక్ష ఏమీ ఉండదు. అందర్నీ సమానంగా దాడి చేస్తుంది. దాన్ని ఎదుర్కోవాలంటే ఒకరి మీద ఒకరు ప్రేమ, దయను చూపిస్తూ జాగ్రత్తగా ఉండాలి. ఈ సమస్య కూడా మనల్ని ఏకం చేయకపోతే ఇంకేం ఏకం చేస్తుందో దేవుడికే తెలియాలి’’ అని శృతి అన్నారు.
 
అంతా ఒకే ఇంట్లో ఉంటే అర్ధం లేదు!
శ్రుతీ హాసన్‌ ముంబైలో స్వీయ నిర్బంధంలో ఒంటరిగా ఉంటున్నారు. ఆమె పది రోజుల క్రితం లండన్‌ వెళ్లి వచ్చారు. ప్రస్తుతం కరోనా కోరలు చాస్తున్న నేపథ్యంలో ప్రజలు మరింత జాగ్రత్తగా మెలగాల్సిన అవసరం ఉందన్నారు.
‘‘బయటకు వెళ్లే అవకాశం లేకపోవడం కష్టమే. అయితే,లోపల భయమూ ఉంటుంది కదా. కరోనా నేపథ్యంలో సామాజిక దూరం పాటించడం చాలా ముఖ్యం. కొన్ని రోజులుగాప్రజలు దీన్ని సీరియస్‌గా తీసుకుంటున్నారు. 
మా కుటుంబమంతా స్వీయ నిర్బంధంలో ఉంది. మా అమ్మ సారిక ముంబైలో ఉంది. అయితే.. నాతో కాదు, వేరే అపార్ట్‌మెంట్‌లో ఉంది. నాన్న కమల్‌ హాసన్‌, చెల్లి అక్షరా హాసన్‌ చెన్నైలో ఉంటున్నారు.. వేర్వేరు ఇళ్లల్లో. మా అందరి ట్రావెల్‌ హిస్టరీ.. షెడ్యూల్స్‌ వేరు. అందుకని, మేమంతా కలిసి ఒక్క ఇంట్లో స్వీయ నిర్బంధంలో ఉండటంలో అర్ధం లేదు. ప్రజలూ ఇలానే అలోచించి నిర్ణయాలు తీసుకుంటారని ఆశిస్తున్నా. సోషల్‌ మీడియాలో ఎవరో సామాజిక దూరం పాటిస్తున్నానని చెప్పారు… అదీ ఐదు మందితో. అటువంటి దూరాలు పని చేయవు. చదువుకున్నవారు మరింత బాధ్యతతో ఉండాలి. ఇంట్లో నాతో ఎవరూ లేరు. కనీసం ఇంటి పనులు చేయడానికి కూడా ఎవరినీ పెట్టుకోలేదు. నేను, నా పెంపుడు పిల్లి క్లారా…అంతే’’ అన్నారు.
 
నా పిల్లలకు కూడా ఇదే నేర్పిస్తా!
తండ్రి కమలహాసన్‌ సినిమాల్లో సంపాదించింది సినిమా రంగంలోనే పెట్టారని శ్రుతీహాసన్‌ చెప్పారు. సాధారణంగా సంపాదించిన దానితో ఆస్తులు కొంటారు. అలాంటిది తన తండ్రి రాజ్‌కమల్‌ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి చిత్రాలను నిర్మిస్తున్నారని తెలిపారు. ఆయనకు సినిమానే శ్వాస అని పేర్కొన్నారు.
తన బాల్య జీవితం చాలా సంతోషంగా సాగిందని చెప్పారు శృతి. నాన్న మొదట చెన్నైలోని ఒక పాఠశాలలో చదివించారు.. ఆ తరువాత అమెరికాలో మంచి కళాశాలలో చేర్పించారనీ చెప్పారు. మంచి ఆహారం, అంతకంటే మంచి దుస్తులు, ఖరీదైన కారు, అందమైన ఇల్లు .. అన్నీ అందించారని చెప్పారు. తాను 21వ ఏట నుంచి కథానాయకిగా నటిస్తూ సంపాదించడం ప్రారంభించా..ఆ తరువాత నుండి నాన్న నుంచి డబ్బు తీసుకోవడం మానేశానని చెప్పారు. ఇప్పటి వరకూ నాన్న ఆస్తిలో తన వాటా ఎంత? అని అడిగింది లేదని చెప్పారు. తనకు అవసరమైన డబ్బును తానే సంపాదించుకుంటున్నానని తెలిపారు. రేపు తన పిల్లలకు కూడా ఇదే నేర్పిస్తానని చెప్పారు శ్రుతీహాసన్‌ .