ఒంటరితనం నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది!

“స్వీయ సాంగత్యాన్ని నేను ఇష్టపడతా. ఒంటరితనం నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు.. సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కొనే నేర్పును అలవర్చింది”… అని అంటోంది శృతిహాసన్.
ఒంటరితనం తనకు అలవాటేనని, ఏకాంతంగా గడపడాన్ని ఎంతగానో ఆస్వాదిస్తానని అంటోంది .లాక్‌డౌన్‌ సమయంలో కుటుంబసభ్యులెవరూ తోడు లేకుండా.. ఒంటరిగా ముంబయిలో రెండు నెలలుగా ఉంటోంది శృతిహాసన్‌. ‘కుటుంబానికి దూరంగా ఉండటం నాకు కొత్తేమీకాదు. 19 ఏట ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లాను. ఆ సమయంలో నా ఒంటరిజీవితం ఆరంభమైంది. స్వీయ సాంగత్యాన్ని నేను ఇష్టపడతా. ఒంటరితనం నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కొనే నేర్పును అలవర్చింది.ఇంటిపనులు, సంగీతసాధన, పుస్తక పఠనంతో విరామాన్ని సద్వినియోగం చేసుకుంటుంటాను.
అయితే ఏకాంతవాసం ప్రతిసారి సౌకర్యంగా అనిపించదు. మన మనసులోని బాధల్ని ఇతరులతో పంచుకోవడానికి కొన్ని సందర్భాల్లో మరొకరి తోడు కావాలని అనిపిస్తుంది. అలాంటి భావన కలిగినప్పుడు కుటుంబసభ్యులు, స్నేహితులతో మాట్లాడుతూ స్వాంతన పొందుతాను. ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మంది అనవసరపు ఆందోళనలతో సతమతమవుతున్నారు. ప్రపంచం అంతం అయిపోతుందని భయపడుతున్నారు. అయితే అవన్నీ కేవలం ఊహాగానాలు మాత్రమే. ఏదీ మన నియంత్రణలో లేదు. అనవసరంగా ఆలోచిస్తూ ఒత్తిడులు పెంచుకోవడం సరికాదు. నేను మానసిక సమస్యలతో చాలా రోజులు పోరాటం చేశాను. స్వీయవివేచనతో వాటి నుంచి బయటపడగలిగాను’ అని తెలిపింది.
మానసిక ఆరోగ్యం కోసం చికిత్స
శ్రుతి హాసన్‌ తన వ్యక్తిగత విషయాలను ఇటీవల ఎక్కువగా పంచుకుంటోంది. ఇటలీకి చెందిన మైఖేల్‌తో ఈమె సహజీవనం చేసేది. ఆయనకి దూరమైనట్టు చెబుతూ.. అతనితో బంధాన్ని తెంచేసుకుంది. మద్యానికి బానిస అయ్యానని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ప్రస్తుతం తన ఆరోగ్య రీత్యా అల్కహాల్‌కు దూరమైనట్టు చెప్పింది. ఈ నేపథ్యంలో తాను మానసిక ఆరోగ్యం కోసం చికిత్స తీసుకుంటున్నానని తాజాగా వెల్లడించింది.
”మూడేళ్ల నుంచి మానసిక ఆరోగ్యంపై ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నా. అవసరమైన వాళ్లంతా ఈ థెరపీ చేయించుకోవాలని కూడా సూచిస్తున్నా. మానసిక ఆరోగ్యం కోసం ధ్యానం, యోగా, వ్యాయామం క్రమం తప్పకుండా చేస్తున్నా. ఇవి నాకు బాగా ఉపయోగపడుతున్నాయి. పుస్తకాలను చదవడం, రాయడం, సంగీతం వినడం వంటివి కూడా చేస్తున్నానని చెప్పింది. లాక్‌డౌన్‌ కాలంలో మానసికంగా ఆరోగ్యంగా ఉండడం అనేది చాలా పెద్ద సవాల్‌ అని గతంలో తెలిపింది . రవితేజ నటిస్తున్న ‘క్రాక్‌’ చిత్రంలో శ్రుతి హాసన్‌ తన పాత్ర టాకీ పార్టు పూర్తి చేసుకుంది. పాటల చిత్రీకరణకు హాజరు కావాల్సి ఉంది.