అందరిలో ఉన్నతమైన ఆలోచనలు..ఆచరణ వెతుకుతా!

‘‘2019 లో నేనొకటి తెలుసుకున్నాను. మనం చిక్కుల్లో పడబోతున్నప్పుడు దైవదూతలు గమనించి, మన స్నేహితుల రూపంలో మన దగ్గరకు వచ్చి సలహాలు, సూచనలు ఇచ్చి మనల్ని ప్రమాదం నుంచి తప్పిస్తారు’’ అని .. గత ఏడాది మీరు నేర్చుకున్న జీవిత పాఠం ఏమిటి?’’ అన్న ప్రశ్నసమాధానంగా శృతి చెప్పారు.
‘‘మనం చేయగలిగిన మంచి పని ఏదైనా ఉందీ అంటే అది.. మనల్ని మనం ప్రేమించుకోవడమే’’… ఆమె ప్రేమ విఫలమైంది అని ఈ మధ్య వార్తలు వచ్చాయి. ఆ ప్రభావం కావచ్చు.. ఆమెలోని ఈ తాత్వికత. ‘రేసుగుర్రం’ సినిమాలోని తన క్యారెక్టర్‌లా కూల్‌గా ఉంటూ.. కూల్‌గా మాట్లాడుతున్నారు శృతీహాసన్‌
మీ జీవితానికి ఆదర్శం ఏమిటి? అని అడిగితే.. ‘చాలా మందిని కలుస్తుంటాను. నా తల్లిదండ్రులు సహా అందరిలో ఉన్నతమైన ఆలోచనలు, ఆచరణలు వెతుకుతాను. ఉదాహరణకు సహనం, దయ వంటివి.. నేను ఎవరిని అనుసరిస్తానో వాళ్లే ఆరోజు నాకు రోల్ మోడల్స్. నేను ప్రజల నుంచి చాలా నేర్చుకుంటాను..’ అని అన్నారు. నాకు నచ్చిన సినిమా, ఎక్కువగా చూసిన సినిమా ‘జురాసిక్ పార్క్’. ఆ స్టోరీ నాకు చాలా నచ్చింది… అంటూ పర్సనల్ విషయాలు షేర్ చేసుకున్న శృతిహాసన్ తెలుగులో తనకు నచ్చిన సినిమా గురించి చెప్పమంటే.. ‘ఒక్కటి చెప్పడం అంటే కష్టం.. ‘గబ్బర్‌సింగ్’ ఎప్పటికీ స్పెషల్. రేసుగుర్రం, బలుపు, శ్రీమంతుడు ఇలా దేనికదే స్పెషల్..’’ అని అన్నారు.
 
విదేశీ నృత్యకళలో ప్రత్యేక శిక్షణ
‘లాభం’ సినిమాతో తమిళంలో రెండేళ్ల విరామం తర్వాత పునరాగమనం చేస్తున్నది శృతిహాసన్. విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత జననాథన్ దర్శకత్వం వహిస్తున్నారు. రైతుల సమస్యల నేపథ్యంలో పీరియాడికల్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో క్లారా అనే విదేశీ సంగీతకళాకారిణిగా శృతిహాసన్ కనిపించబోతున్నట్లు చిత్రబృందం పేర్కొన్నది. ఇటీవలే ఆమె పరిచయగీతాన్ని రోప్ డ్యాన్స్‌తో వినూత్నంగా చెన్నైలో చిత్రీకరించారు. ఈ పాట తాలూకు ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. వీటిలో శృతిహాసన్ తాళ్ల సహాయంతో తలక్రిందులుగా గాలిలో తేలియాడుతూ కనిపిస్తున్నది. క్లిష్టతరమైన రోప్‌డ్యాన్స్ మూవ్‌మెంట్స్‌ను డూప్ లేకుండా సాహసోపేతంగా శృతిహాసన్ పూర్తిచేసినట్లు చిత్రబృందం చెబుతున్నారు. ఈ విదేశీ నృత్యకళలో ఆమె ప్రత్యేక శిక్షణ తీసుకున్నట్లు చెబుతున్నారు. బ్రిటీష్ కాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి విజయ్ సేతుపతి ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
‘బలుపు’ చిత్రంలో తొలిసారి రవితేజతో జోడీకట్టింది శృతిహాసన్. ఆరేళ్ల తర్వాత మరోసారి ఈ జంట వెండితెరపై సందడిచేయబోతున్నది. ‘డాన్‌శీను’, ‘బలుపు’ తర్వాత హీరో రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేని కలయికలో మరో సినిమా రూపుదిద్దుకోనున్నది. ఈ చిత్రంలో శృతిహాసన్ కథానాయిక నటించనున్నది.