నాకు నిజమైన పరీక్షగా నిలిచింది ఈ పాత్ర!

రెగ్యులర్ సినిమాలు, గ్లామర్‌ పాత్రల్లో నటిస్తూనే అవకాశం లభిస్తే ప్రయోగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నానని అంటోంది శృతిహాసన్‌. ఆమె నటించిన తాజా చిత్రం ‘యారా’ ఓటీటీ ద్వారా ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకురానున్నది. ఈ సినిమాలో తాను వృద్ధురాలిగా నటిస్తున్నట్లు శృతిహాసన్‌ తెలిపింది. ఆమె మాట్లాడుతూ… ‘1970, 90 కాలాల వ్యవధుల్లో ఈ కథ సాగుతుంది. 1990 ఎపిసోడ్స్‌లో వృద్ధురాలిగా కనిపిస్తా. వయసుకు మించిన పాత్రలు చేయడం ఎప్పుడూ సవాల్‌గానే ఉంటుంది. వృద్ధురాలిగా నటించడం నా కెరీర్‌లో తొలిసారి కావడంతో పాత్ర విషయంలో చాలా పరిశోధన చేశా. దుస్తులు, హావభావాలు,నడక తీరుతో పాటు ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకున్నా. నా సినీ ప్రయాణంలో ఎక్కువగా శ్రమించి చేసిన పాత్రల్లో ఇదొకటి. నాలోని నటనాప్రతిభకు అసలైన పరీక్షగా నిలిచిన ఈ పాత్రకు పరిపూర్ణంగా న్యాయం చేశాననే నమ్మకముంది’ అని తెలిపింది.
తాను ప్రతి నాయిక పాత్రలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం తాను నటనపైనే ఎక్కువ దృష్టి పెట్టానని, సంగీతం పై పూర్తి దృష్టి సారించేందుకు చాలా కాలం పడుతుందని ఆమె వెల్లడించారు. నటిగా, గాయనిగా, సంగీత దర్శకురాలిగా ఆమె రాణిస్తున్నారు. తెలుగులో శృతిహాసన్‌ ‘వకీల్‌సాబ్‌’, ‘క్రాక్‌’ చిత్రాల్లో నటిస్తోంది.
 
యూ ట్యూబ్ ఛానెల్ ప్రారంభం!
శృతిహాస‌న్ హీరోయిన్‌గా ప‌రిచ‌యం కావ‌డానికి ముందు సంగీత ద‌ర్శ‌కురాలిగా ప‌నిచేసింది. అలాగే ప్లే బ్యాక్ సింగర్‌గా కూడా పాట‌లు పడింది. విదేశాల్లోనూ లైవ్ మ్యూజిక్ ప్రోగ్రామ్స్‌లో పాల్గొంది. ఇప్పుడు శృతిహాస‌న్ మ‌రో అడుగు ముందుకేసి త‌న మ్యూజిక్ ప్రోగ్రామ్‌ల‌కు సంబంధించిన వివ‌రాల‌ను తెలియ‌జేసేలా ఓ యూ ట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించ‌బోతోంది.శృతిహాస‌న్ సోష‌ల్ మీడియాలో ఎప్ప‌టిక‌పుడు త‌నకు సంబంధించిన అప్ డేట్స్ ఇస్తుంటుంది. యూట్యూబ్ ఛాన‌ల్ లో ఒరిజిన‌ల్ ట్రాక్స్  ను అభిమానులతో పంచుకుంటుంది. యూకే లో ప‌లు ప్ర‌ద‌ర్శ‌న‌లు, షోల‌తో త‌న టాలెంట్ చూపించిన ఈ భామ డెబ్యూ ఆల్బ‌మ్ తో ప‌లుక‌రించేందుకు సిద్ద‌మ‌వుతోంది. త‌న ఆల్బ‌మ్ ఒరిజిన‌ల్ కంటెంట్ తో  పాటు నా ప్ర‌ద‌ర్శ‌న‌లు, టూర్ లోని బీటీఎస్ పుటేజీ, వీడియోలతో సాగుతుందని శృతిహాస‌న్ చెప్పుకొచ్చింది.
 
ఆ వంద‌మందిలో చోటు!
శ్రుతిహాస‌న్‌కు అరుదైన గౌర‌వం ద‌క్కింది. న్యూయార్క్ ప్రెస్ ఏజెన్సీ ప్ర‌క‌టించిన ఏషియాలో వంద‌మంది ప్ర‌భావంత‌మైన వ్య‌క్తుల్లో శ్రుతిహాస‌న్‌కు చోటు ద‌క్కించుకున్నారు. ఓటింగ్ ప‌ద్ధ‌తిలో వంద మంది వ్య‌క్తుల‌ను ప్ర‌జ‌లే ప్ర‌భావంత‌మైన వ్య‌క్తులుగా నిర్ణ‌యిస్తారు. ఈ ఓటింగ్‌లో శ్రుతి కూడా ప్లేస్‌ను సంపాదించుకున్నారు. త‌న‌ను ఎంపిక చేసిన వారంద‌రికీ శ్రుతిహాస‌న్ త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ ద్వారా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. క‌మ‌ల్ త‌న‌య‌గా సినీ రంగ ప్ర‌వేశం చేసిన శ్రుతిహాస‌న్.. న‌టిగా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును సంపాదించుకున్న సంగ‌తి తెలిసిందే.