ఎప్పుడు పిలుపొస్తే.. అప్పుడు షూటింగ్‌కి  వెళ్లాల్సిందే! 

కమల్‌హాసన్‌ నట వారసురాలు అయినప్పటికీ శ్రుతీహాసన్‌ తండ్రి బ్యాగ్రౌండ్‌ని ఉపయోగించకుండా స్వశక్తితో ఎదుగుతున్న నటి. మొదటి నుంచి ఆమె అలానే ముందుకెళ్తున్నారు. తాజాగా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు…

“నా ఖర్చులు భరించాలంటే నేను పని చేయాల్సిందే! నాకు సహాయం చేయడానికి అమ్మానాన్న లేరు. అంటే నేను వారి మీద ఆధారపడలేదు. నా కాళ్ల మీద నిలబడటానికే ఎప్పుడూ ప్రయత్నిస్తా. నా ఖర్చులకి నేనే సంపాదించుకుంటా. నా కుటుంబ సభ్యుల నుంచి ఏమీ ఆశించను, అడగను. లేదంటే ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొవాలి. గతంలో కూడా నాకు ఇవన్నీ అనుభవమే. కరోనాకు ఎప్పుడు ఫుల్‌స్టాప్‌ పడుతుందనే దానికోసం నేను వెయిట్‌ చేయను. నేను పని చేస్తున్న ప్రాజెక్ట్‌ల నుంచి ఎప్పుడు పిలుపొస్తే.. అప్పుడు నేను షూటింగ్‌కి  వెళ్లాల్సిందే!  అందరిలాగే నాకు ఇబ్బందులున్నాయి. అందుకే పని చేసి తీరాలి. నా వ్యక్తిగత, వృతి పరమైన  నిర్ణయాలు నేనే తీసుకుంటా. ఎవరి సలహాలు తీసుకోను. కరోనా కారణంగా నష్టాల్లో ఉన్నామంటూ తెలివైన వారు చాలామంది ఖరీదైన కార్లు, ఇళ్లు కొనే ప్రయత్నం చేయలేదని చెబుతుంటారు. నేను మాత్రం ఓ ఇల్లు కొనుక్కున్నా. ఇండిపెండెంట్‌గా ఎదగడం నాకెంతో గర్వంగా ఉంది. నా వెనుక దేవుడు ఉన్నాడని బలంగా నమ్ముతా”.. అని శ్రుతి చెప్పింది. అయితే ఉన్నట్టుండి శ్రుతీ ఇలా  ఎందుకు వ్యాఖ్యలు చేసిందా? అని అభిమానులు ఆలోచిస్తున్నారు. ఇటీవల సక్సెస్‌ అయిన ‘వకీల్‌ సాబ్‌’లో పవన్‌కు భార్యగా నటించిన శ్రుతీహాసన్‌ ప్రస్తుతం, ప్రభాస్‌ ‘సలార్‌’, ఓ వెబ్‌ సిరీస్‌ లో నటిస్తోంది

చిన్న విషయాలు చెప్పినా,చాలామంది వింటారు… మాల్దీవులకు వెళ్లి ఎంజాయ్ చేస్తూ.. ఆ ఫొటోల్ని సోషల్ మీడియాలో పెడుతున్న సెలబ్రిటీలపై  విరుచుకుపడింది శృతిహాసన్. కరోనాతో దేశమంతా గగ్గోలు పెడుతుంటే సరదాగా సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో పెడతారా? అంటూ ఓ రేంజ్ లో విమర్శించింది. ఇటీవల పర్యాటకుల్ని మాల్దీవులు నిషేధించడం చాలా మంచి పని అంటోంది.

“మాల్దీవులు తాత్కాలికంగా పర్యాటకుల్ని బ్యాన్ చేయడం చాలా మంచి పని. ఇప్పటికైనా కొంతమంది మాల్దీవులు వెళ్లడం ఆపేస్తారు. నా తోటి నటీనటులు కొందరు ఇలా మాల్దీవులకు వెళ్లడాన్ని నేను తప్పు పట్టను. కానీ ఇలాంటి టైమ్ లో సోషల్ మీడియాలో ఆ ఫొటోలు పెట్టడం కరెక్ట్ కాదు. నేను కూడా ఫొటోలు పెడతాను. కానీ నేను మా ఇంట్లో ఐసొలేషన్ లో ఉంటూ… సెల్ఫీలు మాత్రమే పెడుతున్నాను. నేను టూర్స్ కు వెళ్లలేదు. ఈ టైమ్ లో ఏం చేయాలి, ఏం చేయకూడదనేది నటీనటుల విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది”… ఇలా మరోసారి వారికి చురకలంటించింది శృతిహాసన్. స్టార్ స్టేటస్ ఉన్న వ్యక్తుల వైపు ప్రజలు చూస్తారని, ఇలాంటి టైమ్ లో అందరికీ ఆదర్శంగా నిలవాలని సూచిస్తోంది.

“లైమ్ లైట్లో ఉన్న వ్యక్తుల వైపు ప్రజలు చూస్తారు. వాళ్లు చెప్పింది వింటారు. మనకు ప్రజలు ఈ గౌరవం  ఇచ్చారు. సో.. ఇలాంటి టైమ్ లో ఆ ఇమేజ్ ను సద్వినియోగం చేయాలి. ప్రజల కోసం వాడాలి. ఇంట్లోనే ఉండండి, మాస్క్ పెట్టుకోండి లాంటి చిన్న చిన్న విషయాలు చెప్పినా చాలు, చాలామంది వింటారు. ఇలాంటి టైమ్ లో మాల్దీవుల ఫొటోలు పెట్టే కంటే… ఇలాంటి చిన్న చిన్న సందేశాలు ఇవ్వడం మంచిదని నా ఉద్దేశం”. ప్రస్తుతం నటీనటులంతా తమ సోషల్ మీడియా పేజీల్ని కరోనా బాధితుల సహాయార్థం ఉపయోగిస్తున్నారు. తమకు తోచిన రీతిలో సహాయం అందిస్తున్నారు. ఇది చాలా మంచి పరిణామం అని అంటోంది శృతిహాసన్.