అవగాహన లేకుండా చేస్తే పెద్ద పొరపాటు అవుతుంది!

“రాజకీయాల గురించి నాకు  ఎలాంటి అవగాహన లేదు.  అవగాహన లేకుండా రాజకీయాల్లోకి వెళ్లడం.. సినిమాకు దర్శకత్వం వహించడం పెద్ద పొరపాటు అవుతుంది”..అన్నారు శ్రుతీహాసన్‌. ‘రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశమే లేదు’ అన్నారు. ‘మీ నాన్నగారు రాజకీయ పార్టీ స్థాపించారు కదా. మిమ్మల్ని కూడా రాజకీయాల్లో చూడొచ్చా’ అని శ్రుతీహాసన్‌ని అడిగితే.. ఆమె ఈ సమాధానం ఇచ్చింది.

‘‘మా నాన్నగారి పార్టీ Makkal Needhi Maiam ప్రచారానికి కూడా నేను వెళ్లను. ఆయన నమ్మిన సిద్ధాంతం.. ఆయన విజన్‌ను నేను గౌరవిస్తాను. ఆయనకు మంచి జరగాలని బలంగా కోరుకుంటాను. రాజకీయాల గురించి నాకు ఎలాంటి అవగాహన లేదు. ఎటువంటి అవగాహన లేకుండా రాజకీయాల్లోకి వెళ్లడం.. సినిమాకు దర్శకత్వం వహించడం పెద్ద పొరపాటు అవుతుంది. మనకు తెలియకుండానే ఎంతోమందికి హాని చేసినవాళ్లం అవుతాం’ అన్నారు.

కరోనా వల్ల జరిగిన నష్టాన్నిఅధిగమించే దిశలో నటీనటులు పారితోషికం తగ్గించుకోవాలని ఇటీవల చిత్రపరిశ్రమ పెద్దలు పేర్కొన్నారు. దీని గురించి శ్రుతీహాసన్‌ని అడిగితే.. ‘నిజానికి సినిమా ఇండస్ట్రీలో పారితోషికం విషయంలో హీరోలతో పోలిస్తే హీరోయిన్లకు చెల్లించేది చాలా తక్కువ. వారి పారితోషికాల్లో వ్యత్యాసం చాలా ఉంది. హీరోలు అందుకుంటున్న రెమ్యునరేషన్‌ హీరోయిన్‌కి రావాలంటే కచ్చితంగా మరో 20 ఏళ్లు పడుతుంది’ అని పేర్కొన్నారు.

నాగ్‌ అశ్విన్ వెబ్‌ సిరీస్ లీడ్‌ రోల్‌లో… ఇప్పుడు స్టార్స్‌ అంతా ఓటీటీ బాటపట్టారు. ఓటీటీలకు షోలు, సిరీస్‌లు, వెబ్‌ ఫిల్మ్స్‌ చేస్తున్నారు. తాజాగా ఓ వెబ్‌ ఫిల్మ్‌ కోసం దర్శకుడు నాగ్‌ అశ్విన్, హీరోయిన్‌ శ్రుతీహాసన్‌ కలిసారని సమాచారం. శ్రుతీహాసన్‌ లీడ్‌ రోల్‌లో ఓ వెబ్‌ సిరీస్‌ షూటింగ్‌ ప్రారంభించారట నాగ్‌. నెట్‌ఫ్లిక్స్‌ కోసం రూపొందుతున్న ఈ సినిమా నిడివి 30 నుంచి 40 నిమిషాల మధ్యలో ఉంటుందట.

దీని చిత్రీకరణ దాదాపుగా వారం రోజుల్లోనే పూర్తి చేయడం విశేషం. దీని ‌ కోసం ప్రత్యేకంగా ఓ స్టూడియో సెట్‌ను నిర్మించారని టాక్‌.  ఈ వెబ్‌ ఫిల్మ్‌లో ఓ బలమైన పాయింట్‌ను చర్చించారట నాగ్‌ అశ్విన్‌. ఈ సినిమా త్వరలోనే ‘నెట్‌ఫ్లిక్స్‌’లో అందుబాటులోకి రానుంది. ఈ సినిమా కాకుండా ప్రభాస్‌తో చేయబోయే భారీ బడ్జెట్‌ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనిలో బిజీగా ఉన్నారు నాగ్‌ అశ్విన్‌. అలానే ‘క్రాక్, వకీల్‌సాబ్‌’ చిత్రాలతో శ్రుతీహాసన్‌ బిజీగా ఉన్నారు.