అలాంటి పరిస్థితి రాకూడదనే సినిమాలు వద్దంటున్నా !

శ్వేతా బచ్చన్‌ నందా… శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌, సైఫ్‌ అలీ ఖాన్‌ కుమార్తె సారా అలీ ఖాన్‌ ఇప్పటికే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాలీవుడ్‌లో వారసులు హవా కొనసాగుతోంది. అయితే తన కూతుర్ని మాత్రం సినిమాల్లోకి పంపించనంటున్నారు శ్వేతా బచ్చన్‌ నందా.అమితాబ్ బచ్చన్, జయబాదురి కుమార్తె అయిన శ్వేతా బచ్చన్‌ ..సోదరుడు అభిషేక్‌ బచ్చన్‌తో కలిసి ‘కాఫీ విత్‌ కరణ్‌ షో’కు హాజరయ్యారు . ఈ సందర్భంగా తన కూతురు నవ్య సినిమా రంగ ప్రవేశం గురించి మాట్లాడుతూ… ‘నవ్యకు ఈ రంగం అంటే చాలా ఇష్టం, గౌరవం ఉండి.. ‘సొంతంగా రాణించగలను’ అనే ధైర్యం ఉంటే ఫర్వాలేదు. అలాకాకుండా కేవలం… ప్రముఖ వ్యక్తుల కుటుంబానికి చెందిన మనిషిగా తాను ఈ రంగంలోకి వస్తే మాత్రం చాలా బాధపడాల్సి వస్తుంది. దాని బదులు మరో కెరీర్‌ను ఎంచుకోవడమే ఉత్తమం’ అని అన్నారు.
 
“ఈ రంగం పట్ల నవ్యకు ఎలాంటి అభిప్రాయం ఉందో నాకు ఇంకా తెలియదు. తను సిని రంగాన్ని కెరీర్‌గా ఎంచుకోవడం నాకు ఇష్టం లేదు’ అన్నారు. ఇందుకు గల కారణాన్ని కూడా చెప్పారు శ్వేత. ‘మా కుటుంబంలో తొలి తరం అంతా సినిమాల్లోనే ఉన్నారు. రెండో తరంలో మా అన్నయ్య, వదిన కూడా సినిమాల్లోనే ఉన్నారు. సినిమాలు సరిగా ఆడనప్పుడు వారే పడే బాధ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. సినిమా స్టార్‌ అవ్వడం వల్ల జనాలు మా కుటుంబ సభ్యులు గురించి ఎలా మాట్లాడతారో నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను” అన్నారు.
 
‘ముఖ్యంగా అభిషేక్ గురించి.. “అమితాబ్‌ బచ్చన్‌ కొడుకు అయినందువల్లే చాలా ఇజీగా సినిమాల్లోకి వచ్చాడు. అంతే తప్ప అతని ప్రయత్నం ఏం లేదు” అంటూ తన గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు. నేను కూడా తనను సోషల్‌ మీడియాలో ఫాలో అవుతుంటాను. అక్కడ జనాలు తన గురించి మాట్లాడే మాటలు చూసి.. ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపాను. నా కూతురికి కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతోనే తనను సినిమాల్లోకి పంపించకూడదని అనునుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు శ్వేత.