నవంబర్‌ 3న సిద్దార్థ్‌ హార్రర్‌ ‘గృహం’

‘వయాకామ్‌ 18 మోషన్‌ పిక్చర్స్‌’, ‘ఎటాకి ఎంటర్‌టైన్‌మెంట్‌’ బేనర్స్‌పై సిద్ధార్థ్‌, ఆండ్రియా తారాగణంగా రూపొందిన హారర్‌ చిత్రం ‘గృహం’. మిలింద్‌ రావ్‌ దర్శకుడు. ఈ సినిమా నవంబర్‌ 3న విడుదలవుతుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హీరో నాని, సిద్ధార్థ్‌, తమన్‌ ఎస్‌.ఎస్‌, డైరెక్టర్‌ మిలింద్‌ రావ్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ గిరీష్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా…

మ్యూజిక్‌ డైరెక్టర్‌ గిరీష్‌ మాట్లాడుతూ – ”తొలిసారి తెలుగులో నేను సంగీతం అందించిన చిత్రమిది. పాటలు చాలా బాగా వచ్చాయి. బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ అద్భుతంగా కుదిరింది. రెహమాన్‌గారు మంచి సాహిత్యాన్ని అందించారు. తమిళం కంటే తెలుగు సాహిత్యం అద్భుతంగా ఉంది. ఇండియాలోనే నెంబర్‌ వన్‌ హారర్‌ మూవీగా ఇది నిలిచిపోతుంది. హాలీవుడ్‌ రేంజ్‌లో సినిమా ఉంటుంది. మిలింద్‌ రావ్‌ నాకు ఎంతో స్వేచ్ఛ ఇచ్చి నాతో మ్యూజిక్‌ చేయించుకున్నారు” అన్నారు.

చిత్ర దర్శకుడు మిలింద్‌ రావ్‌ మాట్లాడుతూ – ”నేను, సిద్ధార్థ్‌ మణిరత్నంగారి వద్ద ఒకేసారి అసిస్టెంట్‌ డైరెక్టర్స్‌గా జాయినయ్యాం. మాది 16 ఏళ్ల స్నేహం. నాకు హారర్‌ జోనర్‌ అంటే చాలా ఇష్టం. డిఫరెంట్‌ మూవీ కావాలని..నాలుగున్నరేళ్లు కష్టపడి స్క్రిప్ట్‌ తయారు చేశాం. ప్రతి సీన్‌ అద్భుతంగా ఉంటుంది. ఇప్పటి వరకు ఆడియెన్స్‌ చూడనటువంటి థ్రిల్స్‌ సినిమాలో ఉంటాయి. తెలుగు ప్రేక్షకులు ఎంతో మంది కొత్త దర్శకులను ఆదరించారు. నన్ను కూడా అలాగే ఆదరిస్తారని కోరకుంటున్నాను” అన్నారు.

ఎస్‌.ఎస్‌.తమన్‌ మాట్లాడుతూ – ”బాయ్స్‌ సినిమాలో నేను, సిద్ధార్థ్‌ కలిసి నటించాం. ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడి 16 ఏళ్లవుతుంది. సిద్ధార్థ్‌ తనను తాను ప్రూవ్‌ చేసుకుంటూ హీరోగా ఎదిగాడు. అలాగే నేను కూడా మ్యూజిక్‌ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాను. సిద్ధార్థ్‌కి సినిమాలంటే పిచ్చి. తను ఎంబీఏ చదివి..లక్షల్లో సంపాదించే అవకాశం ఉన్నా, అవన్నీ కాదని సినిమాల్లో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా జాయినయ్యాడు. దేశం గర్వించే నటులు అమీర్‌ ఖాన్‌ సహా ఎంతో మందితో కలిసి నటించాడు. తను నటించిన ‘జబర్‌దస్త్‌’ సినిమాకు నేను మ్యూజిక్‌ చేశాను. ఈ సినిమా విషయానికి వస్తే, మ్యూజిక్‌ డైరెక్టర్‌ గిరీష్‌ ఎంతో అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. భయపెట్టడం అనేది మామూలు విషయం కాదు. ఇలాంటి సినిమాకు మ్యూజిక్‌ చేయడం సాధారణమైన విషయం కాదు. ఈసినిమా రిలీజ్‌ తర్వాత ముఖ్యంగా మ్యూజిక్‌ డైరెక్టర్‌కు చాలా మంచి పేరొస్తుంది. సినిమా పెద్ద హిట్‌ సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

హీరో సిద్ధార్థ్‌ మాట్లాడుతూ – ”నాకు హారర్‌ జోనర్‌ సినిమాలంటే చాలా ఇష్టం. హారర్‌ చిత్రాలకు హీరో అవసరం ఉండదు. భయమనే ఎలిమెంటే హీరో. కొత్తగా చేయాలని ఆలోచనతో ఈ సినిమాపై వర్క్‌ చేసి సినిమా చేస్తున్నాం. హారర్‌ సినిమాలు చేయడం మామూలు విషయం కాదు. సినిమాను రెండు వందల మంది స్నేహితులకు చూపించి, ఎక్కడెక్కడ ప్రేక్షకుల భయపడతారు? ఎక్కడ భయపడరు? అనే విషయాలను చూసుకుని కరెక్ట్‌ చేసుకుని సినిమా తెరకెక్కిస్తూ వచ్చాం. నాలుగున్నరేళ్లు సినిమా స్క్రిప్ట్‌ పై వర్క్‌ చేశామంటే మేం పడ్డ కష్టం అర్థం చేసుకోవాలి. గిరీష్‌ చాలా మంచి సంగీతం, బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ అందించారు. నాకు, మిలింద్‌గారికి రామ్‌గోపాల్‌ వర్మ అంటే ఎంతో ఇష్టం. హారర్‌ సినిమాలకు గాడ్‌ఫాదర్‌ అయిన ఆయన డైరెక్ట్‌ చేసిన దెయ్యం, భూత్‌ సినిమాల తర్వాత ఆ రేంజ్‌ను ఏ సినిమాలు రీచ్‌ కాలేదు. మా సినిమా రీచ్‌ అవుతుందని మేం అనుకుంటున్నాం. బొమ్మరిల్లు సినిమాలో మొత్తం మీరే చేశారు అనే డైలాగ్‌కు ఎంత మంచి రెస్పాన్స్‌ వచ్చిందో, రేపు ఈ సినిమాకు కూడా అలాంటి రెస్పాన్సే వస్తుంది. ఒక డాక్టర్‌ తన భార్యతో కలిసి హిమాచల్‌ ప్రదేశ్‌కు వెళతాడు. వాళ్లుండే పక్కింట్లో మరో ఫ్యామిలీ ఉంటుంది. అందులో ఓ అమ్మాయి కారణంగా వచ్చే సమస్యలే ఈ సినిమా ప్రధానమైన కథ. సినిమా చూసి ప్రేక్షకులు థ్రిల్‌ అవుతారు. ప్రేక్షకులు ఊహించిన దానికంటే బాగానే సినిమాను ఆస్వాదిస్తారు. భయానికి భాష అక్కర్లేదు కాబట్టి, ఈ సినిమాను తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నాం. తెలుగు ఇండస్ట్రీ నన్ను హీరోగా ఎంతో బాగా ఆదరించింది. తెలుగులో సినిమాలు చేయడం కాస్త ఆలస్యమై ఉండొచ్చు కానీ, మిస్‌ మాత్రం కాను” అన్నాను.

హీరో నాని మాట్లాడుతూ – ”నేను ఎంసీఏ సినిమా షూటింగ్‌ చేస్తూ వరంగల్‌లో ఉండగా, ‘అవల్‌’ అనే తమిళ సినిమా ట్రైలర్‌ చూసి భయపడ్డాను. రెండు రోజుల తర్వాత సిద్ధు, అదే సినిమా తెలుగు వెర్షన్‌ ట్రైలర్‌ను నాకు పంపాడు. మిలింద్‌ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. ఇండియాలో ఇటువంటి సినిమా వచ్చి చాలా కాలమైంది. నెంబర్‌ వన్‌ హారర్‌ మూవీ అవుతుంది. హాలీవుడ్‌ రేంజ్‌లో ఉంది. రామ్‌గోపాల్‌వర్మ స్టయిల్‌లో ఈ సినిమాను తెరకెక్కించినట్టుంది. దెయ్యం, కాంజురింగ్‌ సినిమాలు తర్వాత ఆ రేంజ్‌లో నాకు భయాన్ని క్రియేట్‌ చేసిన సినిమా ఇది. సినిమా హండ్రెడ్‌ పర్సెంట్‌ హిట్‌ కొడుతుంది. సినిమా నవంబర్‌ 3న విడుదలవుతుంది” అన్నారు.