సినీవినోదం రేటింగ్ : 3/5
వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్, ఇటాకి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ల పై మిలింద్ రావ్ దర్శకత్వం లో సిద్ధార్థ్ ఈ చిత్రాన్ని నిర్మించారు
1934 బ్యాక్‌డ్రాప్..హిమాలయాలకు దగ్గరగా ఉండే రోషినీ వ్యాలీలో సినిమా మొదలవుతుంది. ఆ ప్రాంతంలో ఓ చైనా వ్యక్తికి చెందిన ఇంట్లో తల్లి, కూతురు హ్యాపీగా ఉంటుంటారు. చైనా మహిళ కడుపుతో ఉంటుంది. సీన్ కట్ చేస్తే..సినిమా 2016లో మొదలవుతుంది. బ్రెయిన్ సర్జన్ అయిన డా.కృష్ణకుమార్(సిద్ధార్థ్), అతని భార్య లక్ష్మి(ఆండ్రియా) రోషినీ వ్యాలీకి వస్తారు. వీరుండే ఇంటికి పక్కింట్లో పాల్(అతుల్ కులకర్ణి) తన రెండో భార్య, తన ఇద్దరు కూతుళ్లతో వస్తాడు. పాల్ మొదటి కూతురు జెన్నీ యుక్త వయసులో ఉంటుంది. ఆమెకి కృష్ణకుమార్‌ని చూడగానే మోజు ఏర్పడుతుంది. పాల్ రెండో కూతురు సారా..ఆమె వయసు ఆరేడేళ్లు ఉంటుంది.
ఈ రెండు కుటుంబాలు మధ్య సత్సంబంధాలు ఏర్పడే క్రమంలో..జెన్ని విచిత్రంగా ప్రవర్తిస్తుంది. ఇంటి వెనకున్న బావిలో దూకి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నిస్తుంది. అదే సమయంలో అక్కడున్న కృష్ణకుమార్, ఆమెను ప్రమాదం నుండి కాపాడుతాడు. తర్వాత జెన్ని ప్రవర్తనలో విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటాయి. డాక్టర్ అయిన కృష్ణ సలహాతో పాల్ జెన్నిని సైక్రియాటిస్ట్‌కు చూపిస్తారు. ముందు జెన్ని మానసిక డిజార్డర్‌తో బాధపడుతుందని సైక్రియాటిస్ట్(సురేష్) భావిస్తాడు. ఆమె డిజార్డర్‌ను పొగొట్టాలంటే ..జెన్నికి భూత వైద్యం చేస్తున్నట్లు నటిద్దామని పాల్, కృష్ణకు సలహా ఇస్తాడు సైక్రియాటిస్ట్. కానీ నిజంగానే పాల్ ఉండే ఇంట్లో లీజింగ్ అనే చైనా మహిళ, ఆమె పాప ఆత్మలు ఉన్నాయని తెలుస్తుంది. కానీ అంత కంటే భయంకరమైన నిజం మరొకటి తెలుస్తుంది. అదేంటి? అసలు చైనా మహిళకు, జెన్నికి ఉన్న రిలేషన్ ఏంటి? జెన్ని కోసం పాల్, డా.కృష్ణ ఏం చేస్తారు? అనే విషయాలు సినిమాలో చూడాలి ….
సిద్దార్థ్ నటించిన తాజా హిట్ తమిళ్ చిత్రం ‘అవల్’ తెలుగులో ‘గృహం’ పేరుతో విడుదలైంది. నటుడిగా, నిర్మాతగా సక్సెస్ సాధించాలన్న సిద్ధార్థ్ ప్రయత్నం ఈ చిత్రం తో ఫలించిందనే చెప్పాలి. తన స్నేహితుడు మిలింద్ రావ్ ను దర్శకుడిగా ఎంచుకున్న సిద్ధార్థ్ నటుడిగానే కాక డైలాగ్స్, స్క్రీన్‌ప్లే తదితర విషయాల్లో ఇన్‌వాల్వ్‌మెంట్ తో తనదైన ముద్ర ఉండేలా చూసుకున్నాడు. చాలా రోజుల తర్వాత ఒక పూర్తిస్థాయి హర్రర్ సినిమాను చూసిన అనుభూతిని కలిగించింది .హాలీవుడ్ స్థాయి హర్రర్ తో మిలింద్ రావ్ సూపర్బ్ విజువల్స్ తో భయపెట్టాడు. సినిమా లో భయపడే మూమెంట్స్ బాగా ఉండటం, సినిమా అంతా డిఫరెంట్ మోడ్ లో సాగడం , సౌండ్, కెమెరా వర్క్ ఎఫెక్టివ్ గా చెయ్యడం , నటీ నటులు బాగా నటించడం ఇందులో మెప్పించే అంశాలు .
ఇలాంటి సినిమాలకు నటీనటుల ఎంపిక చాలా కీలకం . ప్రధాన పాత్రలో నటించిన సిద్ధార్థ్ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. తనకు అలవాటైన రొమాంటిక్ సన్నివేశాలతో పాటు భయపెట్టే సీన్స్ లోనూ స్థాయిగల నటన కనబరిచాడు. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాల్లో సిద్ధార్థ్ చాలా బాగా చేసాడు . హీరోయిన్ గా ఆండ్రియా అందంతో పాటు అభినయంలోనూ పరవాలేదనిపించింది. సిద్ధార్థ్, ఆండ్రియా మధ్య రొమాంటిక్ సీన్స్ ఘాటుగానే ఉన్నాయి. పాల్ పాత్రలో అతుల్ కులకర్ణి తనదైన నటనతో మెప్పించాడు. బాలనటి అలీషా ఏంజెలినా విక్టర్ అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది .
శ్రేయాస్ కృష్ణ సూపర్బ్ సినిమాటోగ్రఫి సినిమా స్థాయిని పెంచింది. అందుకు తగ్గట్టుగా గిరీష్ వాసుదేవన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరింత భయపెట్టింది. లారెన్స్ కిషోర్ ఎడిటింగ్ బాగుంది -ధరణి