‘ఎప్పుడూ వొప్పుకోవద్దురా ఓటమి’.. అన్న సిరివెన్నెల మరిలేరు!

చెంబోలు సీతారామశాస్త్రి… 1955 మే 20న విశాఖపట్నం జిల్లా అనకాపల్లి డాక్టర్‌. సి.వి.యోగి సుబ్బలక్ష్మి దంపతులకు జన్మించారు. మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన ఆయన పదో తరగతి వరకూ అనకాపల్లిలోనే చదివారు. కాకినాడలో ఇంటర్‌, ఆంధ్రా విశ్వకళా పరిషత్‌లో బి.ఎ.పూర్తి చేశారు. అదే సమయంలో 10వ తరగతి అర్హతతో బీఎస్‌ఎన్‌ఎల్‌లో ఉద్యోగం రావటంతో రాజమండ్రిలో కొంతకాలం పనిచేశారు. ఆయనలో ఓ కవి ఉన్నాడని గుర్తించిన మొదటి వ్యక్తి ఆయన సోదరుడు. చిన్నప్పటి నుంచి సీతారామశాస్త్రికి పాటలు పాడాలని కోరిక. ఒకట్రెండుసార్లు ప్రయత్నించినా అందుకు తాను సూటబుల్‌ కాదని అటువైపు వెళ్లలేదు. కొత్త పదాలతో ఎప్పుడూ ఏదో ఒక ప్రయత్నం చేసే ఆయన్ను గమనించిన సోదరుడు ‘అన్నయ్యా కవిత్వం కూడా బాగా రాస్తున్నావు. నువ్వు ఒకసారి ప్రయత్నించు’ అని చెప్పడంతో ఆ తర్వాత ఏవీ కృష్ణారావు, సహచరుడు చాగంటి శరత్‌బాబుతో కలిసి సాహితీ సభలకు వెళ్తుండేవారు. ఆ సమయంలో సీతారామశాస్త్రిని అందరూ భరణి అని పిలిచేవారు. ఎం.ఏ చదువుతున్న సమయంలో దర్శకుడు కె.విశ్వనాథ్‌ నుంచి పిలుపు రావటంతో ‘సిరివెన్నెల’ చిత్రానికి తొలిసారి పాటలు రాశారు. అక్కడి నుంచి ఆయన జీవితం పద్మశ్రీ ఎందుకునే స్థాయికి వెళ్లింది. జనాల మదిలో నిలిచిపోయే సుమధుర గీతాలెన్నో రాశారాయన.  సీతారామశాస్త్రి పాటలు ప్రేక్షకులను ఎంతగా అలరించాయో అదే స్థాయిలో అవార్డులు కూడా ఆయన చెంతకు చేరాయి. తొలి గీతం ‘సిరివెన్నెల’లోని విధాత తలపున’ కే నంది అవార్డు దక్కించుకున్న ఘనత ఆయనది. 3000లకు పైగా పాటలు రాసిన ఆయనకు పదమూడు సార్లు నంది అవార్డ్‌ వరించింది. ఉత్తమ గేయ రచయితగా నాలుగు ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డులు అందుకున్నారు. పలు సినిమాల్లో ఆర్టిస్ట్‌గానూ మెరిశారు. సాహిత్యరంగానికి ఆయన చేసిన సేవలకుగానూ 2019లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణంతో సినీ పరిశ్రమ తీవ్ర ఆవేదనకు లోనైంది.

సీతారాముని జీవితంపై గురువు విశ్వనాథుని ప్రభావం!… సీతారామ శాస్త్రి గేయ రచయితగా తెలుగు సినీ రంగ ప్రవేశం చేసింది కళాతపస్వి కే. విశ్వనాథ్ వారి వల్లే అని మనందరికీ తెలుసు. అయితే, చాలా మంది ఆయన తొలి చిత్రం ‘సిరివెన్నెల’ అనుకుంటూ ఉంటారు. నిజానికి విశ్వనాథ్, సీతారామ శాస్త్రి కాంబినేషన్‌లో వచ్చిన ఫస్ట్ మూవీ ‘జననీ జన్మభూమి’. 1984లో విడుదలైన ఆ చిత్రంలో, సీతారామశాస్త్రి రాసిన ‘తడిసిన అందాలలో’ అనే గీతాన్ని కేవీ మహదేవన్ స్వరపరచగా మాధవపెద్ది రమేశ్, సుశీల గానం చేశారు. ఆ తరువాత రెండేళ్లకు, అంటే… 1986లో ‘సిరివెన్నెల’ జనం ముందుకొచ్చింది.

‘సిరివెన్నెల’ సినిమా కోసం సీతారామ శాస్త్రి చేత పాటలన్నీ రాయించారు విశ్వనాథ్. అప్పట్లో అలా సింగిల్ కార్డ్‌తో ఓ కొత్త రచయిత ప్రేక్షకుల ముందుకు రావటం అత్యంత అరుదైన విషయం. కానీ, ‘సిరివెన్నెల’ పాటలతో తెలుగు వెండితెరపై నిండు వెన్నెల ఆరబోసేశారాయన. ఒక్క ‘విధాత తలపున…’ పాట రాసేందుకే వారం రోజులు పట్టిందట. ఆ సినిమాలోని ప్రతీ పాటా, ప్రతీ పాటలోని ప్రతి ఒక్క మాటా ఓ తప్సస్సులా భావించి సృజించారు సీతారామ శాస్త్రి. అందుకే అదే సినిమా పేరు ఆయన ఇంటి పేరు అయిందని చాలా మంది భావిస్తారు. కానీ, ఆశ్చర్యకర విషయం ఏంటంటే… ‘సిరివెన్నెల’ సినిమా టైటిల్ కార్డ్స్‌లోనే సీతారామశాస్త్రి ఇంటి పేరుగా ‘సిరివెన్నెల’ అని ఉంటుంది. కే. విశ్వనాథ్ ఆ నిర్ణయం తీసుకున్నారట! మొదట్లో ‘భరణి’ అనే కలం పేరుతో సాహిత్యం రాస్తోన్న సీతారామశాస్త్రికి… ‘‘తల్లిదండ్రులు పెట్టిన లక్షణమైన పేరునే ఉపయోగించ’’మని కే. విశ్వనాథే చెప్పారు. మళ్లీ అదే చేంబోలు సీతారామశాస్త్రిని ‘సిరివెన్నెల’గా తెలుగు సినీ చరిత్రలో శాశ్వత కీర్తిమంతుడ్ని చేసింది కూడా ఆయనే! శిష్యుడు సీతారాముని జీవితంపై గురువు విశ్వనాథుని ప్రభావం వెలకట్టలేనిది…

మాట మూగబోయిన చోట పాట అవసరం!… పాట మన జీవితంలో ఒక భాగం. పాటను జీవితం నుంచి విడదీయలేం. పుట్టిన తర్వాత అమ్మ పాడే లాలి పాట నుంచే మనం పాటలు వినటం ప్రారంభమవుతుంది. అయితే నిత్య వ్యవహారాల్లో పాటకు చోటు లేదు. ఇంట్లో–  ‘ఈ రోజు ఏమి వంట వండుతున్నావు’ అని పాట పాడలేం కదా! సినిమాల్లో కూడా అంతే! ఓ మూడు నిమిషాల విరామం కోసం పాటను ఉంచటం ప్రారంభమైంది. అయితే ఆ విరామం కూడా సందేశాత్మకంగా ఉండేది. ఉదాహరణకు– కాలేజీ పిల్లలు– ‘పాడవోయి భారతీయుడా..’ అనే పాట పాడతారు. ‘ఏరువాకా సాగారో..’ అనేది ఒక ఐటమ్‌ సాంగ్‌. పాట కథకు అడ్డం పడకూడదు. భంగం కలిగించకూడదు. కథను ముందుకు నడించాలి. కానీ ప్రస్తుతం పాట ఎక్కడికో పోయింది. విశ్వనాధ్‌గారు ఈ మధ్య– ‘సినిమాకు పాట అనవసరం’ అన్నారు. నేను ఆయన మాటతో ఏకీభవిస్తున్నా. ఎందుకంటే భావుకజీవితానికి సంబంధించిన కథల్లో పాటలు చాలా అవసరం. ‘ఎక్కడ మాట మూగబోతుందో.. అక్కడ పాట అవసరం’. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. అందుకే నా దగ్గరకు వచ్చే నిర్మాతలకు – “పాటలెందుకు.. ఆ ఖర్చు మిగులుతుంది కదా”.. అంటుంటాను. పాటలు లేకపోతే ఆ డబ్బులన్నీ మిగులుతాయి కదా.

నా ఎడమ భుజం కోల్పోయిన భావన!… సీతారామ శాస్త్రిని సిరివెన్నెలగా మార్చిన దర్శకుడు కె.విశ్వనాద్. వారిద్దరి మధ్య ఎంతో గాఢ అనుబంధం ఉండేది. సిరివెన్నెలను తమ్ముడిగా భావిస్తారు విశ్వనాథ్‌.  సీతారామశాస్త్రి మరణ వార్త విని తల్లడిల్లిపోయారు విశ్వనాథ్‌. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఇది నమ్మలేని నిజం. సిరివెన్నెల మృతి నాకు తీరని లోటు. బాల సుబ్రహ్మణ్యం చనిపోయినప్పుడు నా కుడి భుజం పోయినట్లు అనిపించింది. సిరివెన్నెల మృతితో నా ఎడమ భుజం కోల్పోయిన భావన కలుగుతుంది. ఏం మాట్లాడాలో నాకు అర్థం కావడం లేదు.. మాట్లాడలేకుండా ఉన్నాను. సిరివెన్నెల కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను’’ అంటూ విశ్వనాథ్‌ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

ప్రశ్నిస్తాడు. ఓటమిని ఎప్పుకోవద్దు అంటాడు!… సీతారామశాస్త్రిగారి కవిత్వం గురించి చెప్పడానికి నాకున్న శక్తి సరిపోదు. నాకున్న పదాలు సరిపోవు. ఎందుకంటే ‘సిరివెన్నెల’సినిమాలో రాసిన ‘ప్రాగ్దిశ వీణియపైన, దినకరమయూఖ తంత్రులపైన’ ఆ పాట విన్న వెంటనే తెలుగు డిక్షనరీ అనేది ఒకటి ఉంటుందని నాకు తెలిసింది. దాన్ని ‘శబ్ద రత్నాకరం’ అంటారని తెలుసుకున్నా. అది కొనుక్కొని తెచ్చుకుని, ప్రాగ్దిశ అంటే ఏంటి? మయూఖం అంటే ఏంటి? ఇలాంటి విషయాలు తెలుసుకున్నా. ఒక పాటను అర్థమయ్యేలానే రాయాల్సిన అవసరం లేదు. అర్థం చేసుకోవాలి అని కోరిక పుట్టేలా కూడా రాయొచ్చు అని తెలుగు పాట స్థాయిని పెంచిన వ్యక్తి సీతారామశాస్త్రి.

ఆయన అర్ధరాత్రి ఉదయించే సూర్యుడు.. పదాలు అనే కిరణాలు తీసుకుని, అక్షరాలు అనే తూటాలు తీసుకుని ప్రపంచంమీద వేటాడటానికి బయలుదేరతాడు. రండి నాకు సమాధానం చెప్పండి అంటాడు.మన ఇంట్లోకి వచ్చి మనల్ని పశ్నిస్తాడు. ఓటమిని ఎప్పుకోవద్దు అంటాడు. సింధూరం సినిమాలో ‘అర్థ శతాబ్దం అజ్ఞానాన్నే స్వతంతం అందామా’ అనే ఒక‍్క మాటతో నేను లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకొని నడుచుకుంటూ వెళ్తున్నా.. ఎక్కడి వెళ్తున్నానో తెలియదు. ఒక మనిషిని ఇంతలా కదిలించే శక్తి సాహిత్యానికి మాత్రమే ఉంటుంది. సిరివెన్నెల తెలుగు సినీ కవి కావటం ఆయన దురదృష్టం.. తెలుగు వారి అదృష్టం’అంటూ త్రివిక్రమ్‌ ఉద్వేగంతో చెప్పారు.