కింగ్ ఖాన్ చిత్రంలో ఎందరో అందాల అతిధులు !

ముగ్గురు ఖాన్‌లలో నంబర్‌వన్‌గా నిలచిన షారుఖ్ ఈ మధ్య మూడో స్థానంతో సరిపుచ్చుకోవలసి వస్తోంది.ఒకప్పుడు షారుఖ్‌ఖాన్ తిరుగులేని సూపర్ స్టార్. ఆయన సినిమాలు వస్తున్నాయంటే చాలు… ఇతర స్టార్ హీరోస్ పక్కకు తప్పుకొనేవారు.  అప్పటి నుంచీ ఓ భారీ బంపర్ హిట్ కొట్టాలని షారుఖ్ తెగ ప్రయత్నిస్తున్నాడు. కానీ, ఫలితం లేకుండా పోతోంది. ఈ నేపథ్యంలో ఆనంద్ ఎల్.రాయ్ రూపొందించే చిత్రంలో మరుగుజ్జు పాత్రలో వైవిధ్యంగా కనిపించే ప్రయత్నం చేస్తున్నాడు. అంతటితో ఆగకుండా తనతో హీరోయిన్లు గా నటించిన పలువురు భామలను ఇందులో అతిథి పాత్రల్లో నటింప చేస్తున్నాడు.
 షారుఖ్ తాజా చిత్రంలో కాజోల్, దీపికా పదుకొణే, శ్రీదేవి, అలియా భట్, రాణీ ముఖర్జీ, కరిష్మాకపూర్ అతిథులుగా మెరవనున్నారు. ఇటీవల ఈ చిత్రం కోసం షారుఖ్‌ఖాన్ క్లోజ్ ఫ్రెండ్, ఇంతకు ముందు ఆయన బిజినెస్ పార్ట్ నర్ అయిన జూహీ చావ్లా ఓ సీన్‌లో నటించిందట. నిజంగా షారుఖ్ కెరీర్‌లో అతనికి అచ్చివచ్చిన భామలు ఇద్దరే ఇద్దరు ఒకరు కాజోల్ కాగా, మరొకరు జూహీ. షారుఖ్, జూహీ జంటగా రూపొందిన “రాజు బన్ గయే జెంటిల్ మేన్’, ‘డర్’,  ఎస్ బాస్’, ‘డూప్లికేట్” జనాదరణ పొందాయి. ఇక వారిద్దరూ భాగస్వాములుగా నిర్మించిన “ఫిర్ భీ దిల్ హై హిందుస్థానీ’, ‘పహేలీ” చిత్రాల్లో కూడా కలసి నటించారు. అలా షారుఖ్ కెరీర్‌లో ఎంతో ప్రాముఖ్యమున్న జుహీ చావ్లా అతని తాజా చిత్రంలో అతిధిగా నటించడం నిజంగా విశేషమే.
 ఇక ఈ చిత్రంలో ముద్దుగుమ్మల సంగతి అలా ఉంచితే, షారుఖ్‌కు ఒకప్పుడు శత్రువు, మళ్ళీ కలసిన మిత్రుడు సల్మాన్‌ఖాన్ సైతం ఇందులో కేమియో రోల్ పోషిస్తున్నాడు. ఇంతకుముందు షారుఖ్‌హీరోగా రూపొందిన “దిల్‌తో పాగల్ హై’, ‘కుచ్ కుచ్ హోతా హై” చిత్రాల్లోనూ సల్మాన్ స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చాడు. ఈ చిత్రాలు షారుఖ్‌కు సూపర్ హిట్స్‌గా నిలిచాయి. అందువల్ల ఈసారి కూడా సల్మాన్‌తోనూ అతిథిపాత్ర చేయిస్తున్నాడు షారుఖ్. ఒక గ్రాండ్ సక్సెస్‌  కోసం అన్ని విధాలా హంగామా చేస్తున్నాడు షారుఖ్.