నేర్చుకున్న మార్షల్‌ ఆర్ట్స్‌ నా సినిమాలకు హెల్ప్‌ అవుతోంది !

‘నాకు విభిన్నమైన క్రీడలంటే ఇష్టం. మేరీకోమ్‌, గీతా ఫోగత్‌, సాక్షి మాలిక్‌ వంటి క్రీడాకారులు,
మహిళా క్రికెట్‌ టీమ్‌ నుంచి స్ఫూర్తి పొందుతాను’ అని అంటోంది బాలీవుడ్‌ నటి సోనాక్షి సిన్హా. గ్లామర్‌ పాత్రలతో పాటు అవకాశం వచ్చినప్పుడలా శక్తివంతమైన పాత్రలు పోషిస్తూ అందరినీ అలరిస్తోంది సోనాక్షి. మురుగదాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అకిరా’లో బాక్సర్‌గా కనిపించింది.

క్రీడలు, మార్షల్‌ ఆర్ట్స్‌ అంటే ఇష్టమని చెబుతున్న సోనాక్షి మాట్లాడుతూ…. ‘నేను స్కూల్‌కి వెళ్లే టైమ్‌లో వాలీబాల్‌, ఫుట్‌బాల్‌ బాగా ఆడేదాన్ని. ఇవే కాదు టెన్నిస్‌, బాస్కెట్‌బాల్‌, స్విమ్మింగ్‌ అంటే కూడా చాలా చాలా ఇష్టం. చిన్నప్పుడు ఆటలకే నా టైమ్‌ ఎక్కువగా కేటాయించాను. కొన్ని కారణాల వల్ల ‘అకిరా’ చిత్రానికి సైన్‌ చేసేంత వరకు కూడా బాక్సింగ్‌గాని, మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌గానీ నేర్చుకోలేకపోయాను. ఇటీవల కాలంలో కమల్‌ ముజితబ్‌ వద్ద బాక్సింగ్‌, కుల్‌దీప్‌ శశి  మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకున్నాను. వాళ్ళు నన్ను బాగా మోటివేట్‌ చేసి నేర్పిస్తున్నారు. వారి శిక్షణ ‘అకిరా’ చిత్రానికి బాగా హెల్ప్‌ అయ్యింది. ఇకపై కూడా క్రీడా నేపథ్య చిత్రాల్లో నటిస్తాను. వీటితోపాటు క్రీడాకారుల బయోపిక్‌ల్లోనూ నటించేందుకు రెడీగా ఉన్నాను’ అని తెలిపింది. సోనాక్షి ప్రస్తుతం ‘ఇత్తేఫాక్‌’, ‘సర్కస్‌’ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.