విలన్‌ రోల్స్‌ చేయడమంటే ఇష్టం !

‘విలన్ గా చెయ్యడమే ఇష్టం. ‘సూపర్‌ హీరో సినిమాల్లో విలన్‌ రోల్స్‌ చేయడమంటే ఇష్టం. ఎందుకంటే ఇప్పుడు విలన్‌ పాత్రల ద్వారా కూడా గొప్ప కథలను చెబుతున్నారు. వాటికి అంత ప్రయారిటీ ఉంటుంది’ అని చెబుతోంది సోనమ్‌ కపూర్‌. బాలీవుడ్‌లో సెలక్టీవ్‌గా సినిమాలు చేసే కథానాయికల్లో సోనమ్‌ కపూర్‌ ఒకరు. గతేడాది ‘నీర్జా’ చిత్రంతో ఆకట్టుకుంది. తాజాగా సోనమ్‌కు ట్విట్టర్‌లో ఫాలోవర్స్‌ సంఖ్య 11 మిలియన్లకు చేరుకుంది. ఈ సందర్భంగా అభిమానులు ఆడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చింది.

సూపర్‌ హీరో సినిమాల్లో నటించాల్సి వస్తే హీరో పాత్ర చేస్తారా? విలన్‌ పాత్ర చేస్తారా? అన్న ప్రశ్నకు ఆమె స్పందిస్తూ… ‘విలన్‌ పాత్రకు కూడా గొప్ప కథ ఉంటుంది. దాని ద్వారా ప్రేక్షకులకు మంచి కథలను చెప్పొచ్చు’ అని తెలిపింది. మీరు నటించిన పాత్రల్లో ఫేవరేట్‌ పాత్ర ఏంటన్న ప్రశ్నకు సమాధానంగా….  ‘ఒక్కటని చెప్పలేం. అన్ని పాత్రలు నాకు ఇష్టమైనవే. ప్రతి పాత్రను ప్రేమించే చేశా’ అన్నారు. మీరు నటించిన ‘ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో’ చిత్ర కథానాయకుడు సల్మాన్‌ గురించి ఒక్క మాటలో ఏం చెబుతారు అన్న ప్రశ్నకు… ‘సూపర్‌ హీరో’ అని బదులిచ్చింది. ‘నాన్న నటించిన ‘మిస్టర్‌ ఇండియా’ నాకు ఫేవరేట్‌’ చిత్రమని మరో ప్రశ్నకు సమాధానంగా తెలిపింది. ప్రస్తుతం సోనమ్‌ ‘సంజు’, ‘ప్యాడ్‌మ్యాన్‌’, ‘వీరె ది వెడ్డింగ్‌’ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.