బాధలను దూరం చేయడానికి వచ్చాడీ దేవదూత!

సోనూ సూద్ ఒక దేవదూత.. ఇపుడు భూమిపై అవతరించాడు.. మనిషి రూపంలో ఉన్న దేవుడు.. అందరి బాధలను దూరం చేయడానికి.. వచ్చాడీ దేవదూత.. ముందడుగు వేసి.. అందరి ముఖంలో చిరునవ్వు తెప్పించాడు..అక్కడ ఎవ్వరూ ఒంటరిగా లేరు.. వారందరికీ తోడుగా భగవంతుడు నిలబడ్డాడు.. అంటూ ఎంతో మందిని ఆదుకున్న రియల్ హీరో సోనూ సూద్ పై కవితను రాశారు ఓ నెటిజన్. దీనిపై స్పందించిన సోనూ సూద్… “దీన్ని మాటల్లో వర్ణించలేం.. అద్భుతంగా ఉంది.. నేనో సాధారణ మనిషిని .. నా వల్ల సాధ్యమైంది చేస్తున్నానంతే”నని చెప్పుకొచ్చాడు.
 
కరోనా లాంటి విపత్కర సమయంలో ఎంతో మందిని ఆదుకున్నాడు రియల్ హీరో, రీల్ విలన్ సోనూ సూద్. సోనూ సూద్ సినిమాల్లో మాత్రం విలన్ వేషాలు వేస్తాడు. ఆర్థిక విరాళం ఇవ్వడమే కాకుండా, ఎన్నో రకాలుగా ఎంతో మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా సాయం చేస్తూనే వస్తున్నాడు. కరోనా కష్ట కాలంలో తన చుట్టూ ఉన్న వారిని ఆదుకునేందుకు ముందుకు వచ్చాడు. కరోనాపై పోరాటం చేస్తున్న వైద్య బృందం బస చేసేందుకు తన ఖరీదైన హోటల్‌ను విడిదిగా ఇచ్చేసాడు. వలస కార్మికులకు నిత్యం అన్నదానం చేశాడు. ఇందుకు గానూ ట్రక్కుల నిండా ఫుడ్ ప్యాకెట్స్ నింపి సరఫరా చేసేవాడు. రంజాన్ మాసంలో ముస్లింలకు కావాల్సిన డేట్స్, పళ్లను అందించాడు. ఇలా ఎన్నో రకాలుగా ఎంతో మందికి సాయం చేశాడు సోనూ సూద్. ఈ నేపధ్యంలో ఓ నెటిజన్ సోనూసూద్‌పై ఈ కవితను రాశారు.
 
మిమ్మల్ని చూసి గర్వపడేలా…
లాక్‌డౌన్‌ లో వలస కార్మికుల కష్టాలు వర్ణనాతీతం. సొంతూళ్లకు వెళ్లేందుకు అనేక కష్టాలు పడుతున్నారు. జాతీయ రహదారులపై ఎక్కడ చూసినా వేలాది మంది ఇళ్లకు చేరేందుకు పడుతున్న కష్టాలే కనిపిస్తాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వలస కార్మికులను ఇళ్లకు చేర్చేందుకు బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ తన ఉదారతను చాటుకుంటున్న విషయం తెలిసిందే. ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్ రాష్ట్రాల‌కు ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటుచేసి వారికి అండ‌గా నిల‌బ‌డుతున్నారు. అతను చేస్తున్న సహాయ కార్యక్రమాలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప్రశంసల వర్షం కురిపించారు.
 
ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో పేదలను ఆదుకునేందుకు సోనూసూద్‌ పడుతున్న తపనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మీరు నటుడిగా ఎప్పుడో చాలా ఎత్తుకు ఎదిగారు. మీతో వృత్తి పరంగా నాకు రెండు దశాబ్ధాల పరిచయం. ప్రస్తుత పరిస్థితుల్లో మీరు చేస్తున్న ఈ సహాయం మిమ్మల్ని చూసి మరింత గర్వపడేలా చేస్తోంది అని అన్నారు. కాగా గతంలో ఓ వ్యక్తి సోషల్‌ మీడియా వేదికగా యూపీలోని తన గ్రామానికి వెళ్లడానికి సాయం కోసం అభ్యర్థించగా.. అతనిని ఫోన్‌ నెంబర్‌ ద్వారా సంప్రదించి సహాయ అందించిన విషయాన్ని ఈ సందర్భంగా కేంద్రమంత్రి గుర్తుచేశారు.