పొరపాటున ట్రైలర్‌కు బదులు పూర్తి సినిమా

ఓప్రముఖ  సినిమా నిర్మాణ సంస్థ పొరపాటున ట్రైలర్‌కు బదులు సినిమాను యూ ట్యూబ్‌లో అప్‌లోడ్ చేసింది.   ఓ సినిమాను తెరకెక్కించడానికి పడే కష్టం అంతా ఇంతా కాదు. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి రూపొందిస్తారు. ఆ సినిమా ప్రమోషన్స్ కోసం ఎంతో ఖర్చు చేస్తారు. తాము తీసిన సినిమాలో ఒక్క సీన్ కూడా లీక్ అవకుండా ఉండటం కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అలాంటిది సినిమా నిర్మాణ సంస్థే పొరపాటున ట్రైలర్‌కు బదులు సినిమాను యూ ట్యూబ్‌లో అప్‌లోడ్ చేసింది. 8గంటల తర్వాత విషయాన్ని తెలుసుకుంది. చేసేదేమీ లేక దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇలా చేసింది చిన్నా చితకా నిర్మాణ సంస్థ కాదు.. ప్రముఖ నిర్మాణ సంస్థ సోనీ పిక్చర్స్.
జూలై 3న సోనీ తన యూట్యూబ్ ఛానల్‌  “సోనీ పిక్చర్స్ హోమ్ఎంటర్టైన్మెంట్” లో సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేయాల్సి ఉంది. కానీ ఈ సినిమా ట్రైలర్‌కు బదులు పొరపాటున జాన్ మాథ్యూస్ డైరెక్షన్‌లో.. రిచర్డ్ కాబ్రల్ లీడ్ రోల్ పోషించిన.. ‘ఖలీ ది కిల్లర్’ అనే 89 నిమిషాల పూర్తి సినిమాను అప్‌లోడ్ చేసింది. దీనిని గమనించిన సీబీఆర్.కమ్ అనే వెబ్‌సైట్ వెంటనే సదరు నిర్మాణ సంస్థకు విషయాన్ని తెలిపింది. అప్పటికే ఆ సినిమా యూట్యూబ్‌లో అప్‌లోడ్ అయి 8గంటలు. అప్పటికే చాలామంది యూట్యూబ్‌లో ఆ సినిమాను చూసేశారు. వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఈ మూవీ రెంటల్ బేసిస్‌పై ప్రేక్షకులకు సోనీ సంస్థ అందిస్తుంది.