బాలును నేను బాలాజీ అని పిలిచేదాన్ని!

‌”బాలూ ఒక ప్రత్యేక గాయకుడు .ఆయన ప్రతి పాటలో ఏదో ఒక మెరుపు హటాత్తుగా తెచ్చేవాడు. ఆయనతో రికార్డింగ్‌ అంటే ఈసారి పాటలో ఏం చేస్తాడా? అనే కుతూహలం ఉంటుంది. ఒక విరుపో, నవ్వో, గమకమో. ఆయనతో నేను ముంబై, సింగపూర్, హాంకాంగ్‌లలో లైవ్‌ కన్సర్ట్‌లలో పాల్గొన్నాను. స్టేజ్‌ మీద ఒక ఎనర్జీని తెచ్చేవాడు. ఆయన చనిపోయారనే వార్త పుకారని అనుకున్నాను. దురదృష్టవశాత్తు ఈ పుకారు నిజమని తేలింది” అన్నారు లతా బాలూ మరణవార్త విని బాధతో..

తెలుగులో హిట్‌ అయిన ‘మరో చరిత్ర’ను దర్శకుడు కె.బాలచందర్‌ హిందీలో ‘ఏక్‌ దూజే కే లియే’ రీమేక్‌ చేయాలనుకున్నప్పుడు సంగీత దర్శకులుగా లక్ష్మీకాంత్‌–ప్యారేలాల్‌లను తీసుకున్నారు. లతా పక్కన బాలూ చేత పాడించాలని బాలచందర్‌ కోరారు. దీనికి లతా మంగేష్కర్‌ అభ్యంతరం చెప్పలేదు కాని లక్ష్మీకాంత్‌ ప్యారేలాల్‌ కొంత నసిగారు. ‘బాలూ పాడితే దక్షిణాది శ్లాంగ్‌ వచ్చినా పర్వాలేదు. పాడించండి. ఎందుకంటే నా హీరో తమిళుడు కదా సినిమాలో’ అన్నారు బాలచందర్‌. ఇక లక్ష్మీకాంత్‌ ప్యారేలాల్‌ ఆశ్చర్యకరంగా.. బాలూతో పని చేయడం మొదలెట్టాక వారు “ఒక గాయకుడు పాటను ఎలా నేర్చుకోవాలో తెలియాలంటే బాలూ చూసి నేర్చుకోండి” అని ముంబైలో అందరికీ చెప్పడం మొదలెట్టారు.

‘ఏక్‌ దూజే కే లియే’లో లతా–బాలూ పాడిన పాటలు దేశాన్ని ఊపేశాయి. ‘తేరే మేరే బీచ్‌ మే’ పాట  వినపడని చోటు లేదు. ‘హమ్‌ బనే తుమ్‌ బనే’, ‘హమ్‌ తుమ్‌ దోనో జబ్‌ మిల్‌ జాయేంగే’… ఈ పాటలన్నీ పెద్ద హిట్‌. ఈ సినిమాకు బాలూకి నేషనల్‌ అవార్డ్‌ వచ్చింది. ఆ తర్వాత రమేష్‌ సిప్పీ తీసిన ‘సాగర్‌’ (1985) కోసం లతాతో బాలూ ‘ఒమారియా ఒమారియా’ పాడి హిట్‌ కొట్టారు. కాని అన్నింటి కంటే పెద్ద హిట్‌ ‘మైనే ప్యార్‌ కియా’ (1989)తో వచ్చింది. సల్మాన్‌ ఖాన్, భాగ్యశ్రీల ఈ తొలి సినిమాలో సల్మాన్‌కు బాలూ, భాగ్యశ్రీకి లతా గొంతునిచ్చారు. రామ్‌లక్ష్మణ్‌ సంగీత దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలోని ప్రతి పాట పెద్ద హిట్‌గా నిలిచింది.

‘ఆయనతో పాడిన పాటల్లో నాకు ‘ఆజా షామ్‌ హోనే ఆయీ’ ఇష్టం’ అని లతా అన్నారు. ఆ తర్వాత వచ్చిన ‘హమ్‌ ఆప్‌కే హై కౌన్‌’ (1994) కోసం లతా, బాలూ పోటీలు పడి పాడారు. లతాతో కలిసి బాలూ పాడిన ‘దీదీ తేరా దేవర్‌ దివానా’ పాట .. అందులోని ‘మౌసమ్‌ కా జాదు హై మిత్‌వా’, ‘జూతే దో పైసే లో’, ‘హమ్‌ ఆప్‌ కే హై కౌన్‌’… ఇవన్నీ ఆ సినిమాను భారతదేశ అతి పెద్ద హిట్‌గా నిలిపాయి. “బాలూని నేను చాలాసార్లు రికార్డింగ్‌ థియేటర్లలోనే కలిశాను. కాని ఒకటి రెండుసార్లు ఆయన మా ఇంటికి వచ్చి నాకు బహుమతులు తెచ్చారు. ఇవన్నీ ఇప్పుడు గుర్తుకు వస్తున్నాయి. ఆయనను నేను బాలాజీ అని పిలిచేదాన్ని“అని లత అన్నారు.