జాన్వీ పెళ్లి చేసుకుంటే చూడటం నాకెంతో ఆనందం !

 

శ్రీదేవి  తన కూతురు జాన్వీ కపూర్‌ సినిమాల్లో నటించడం కంటే పెళ్లి చేసుకొని జీవితంలో స్థిరపడితే చూడాలని అనుకుంటోంది. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ బాలీవుడ్‌ ఎంట్రీ దాదాపు ఖాయమైంది. దీని గురించి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ.. కరణ్‌ జోహర్‌ తెరకెక్కించే ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌-2’లో ఆమె టైగర్‌ ష్రఫ్‌ సరసన చిత్రసీమకు పరిచయం కానుందని తెలుస్తోంది. ‘జాన్వీ పెళ్లి చేసుకుంటే చూడటం నాకెంతో ఆనందంగా ఉంటుంది. తను సినిమాలు చేయాలనుకుంటోంది. మొదట్లో నేను అందుకు ఇష్టపడలేదు. సినిమా పరిశ్రమ చెడ్డదని నేను అనుకోను. నేను ఆ పరిశ్రమ నుంచి వచ్చినదాన్నే. కానీ, ఓ తల్లిగా తను పెళ్లి చేసుకుంటే చూడటం నాకెంతో ఆనందంగా ఉంటుంది. కానీ తన ఆనందమే ఎక్కువ నాకు. తను నటిగా రాణిస్తే.. ఓ తల్లిగా నా కన్న గర్వపడే వారు ఉండరు’ అని శ్రీదేవి పేర్కొంది.

శ్రీదేవి తాజా చిత్రం ‘మామ్‌’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ‘మిడ్‌డే’ పత్రికతో ఆమె ముచ్చటించారు. కూతుళ్లు జాన్వీ, ఖుషీతో తాను స్నేహితురాలిగా ఉంటానని, వారి చుట్టూనే నా దిన చర్య ఉంటుందని, జాన్వీకి సంబంధించిన ప్రతి విషయాన్ని తాను, భర్త బోనీ కపూర్‌  ఎంతో శ్రద్ధగా చూసుకుంటామని చెప్పారు.