శ్రీధర్ సీపాన “బృందావనమది అందరిది” లోగో ఆవిష్కరణ !

రచయిత శ్రీధర్ సీపాన దర్శకుడిగామారి రూపొందిస్తున్న తొలి చిత్రం” బృందావనమది అందరిది”. శ్రీధర్ సీపాన పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్ర లోగో లాంఛ్ కార్యక్రమం హైదరాబాద్ లోని సెలబ్రేషన్స్ హోటళ్లో జరిగింది. ఈ కార్యక్రమంలో సినిమా యూనిట్ తో పాటు రచతలు కోన వెంకట్, గోపీ మోహన్, నిర్మాతలు వెనిగళ్ల ఆనంద్ ప్రసాద్, అనిల్ సుంకర, దర్శకులు వైవీఎస్ చౌదరి, నటులు ఫృథ్వీ, రఘు కారుమంచి తదితరులు పాల్గొన్నారు. సినిమా లోగోను నిర్మాతలు వెనిగళ్ల ఆనంద్ ప్రసాద్, అనిల్ సుంకర, దర్శకులు వైవీఎస్ చౌదరి, మాటల రచయిత గోపీమోహన్ ఆవిష్కరించారు. అతిథులంతా కేక్ కట్ చేసి శ్రీధర్ సీపానకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం నిర్మాత వెనిగళ్ల ఆనంద్ ప్రసాద్ మాట్లాడుతూ.. శ్రీధర్ సీపానకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఈ రోజు ప్రారంభం జరుపుకుంటున్న బృందావనమది అందరిది చిత్రం గొప్ప సక్సెస్ కావాలని, దర్శకుడిగా శ్రీధర్ కు, నిర్మాత శ్రీనివాస్ కు మంచి విజయం దక్కాలని కోరుకుంటున్నాను. .శ్రీధర్ సీపానతో నాకు చాలా రోజులుగా అనుబంధం ఉంది. మేమిద్దరం కలిసి హైదరాబాద్ నుంచి తిరుమలకు కాలినడకన రెండు సార్లు వెళ్లొచ్చిన అనుభవం మాకుంది. ఆ భగవంతుడు సంపూర్ణమైన ఆశీర్వచనాలు ఇచ్చి కెరీర్ లో మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నా. అన్నారు.

నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ….నిర్మాత శ్రీనివాస్ గారు మంచి ఛాన్స్ కొట్టేశారు. ఎప్పుడు దర్శకత్వం చేస్తావంటూ శ్రీధర్ ను అడిగేవాళ్లం. ఇవాళ ఉదయం ఫోన్ చేసి సినిమా ప్రారంభం అవుతుంది అని చెప్పారు. సంతోషం. శ్రీధర్ తో సినిమా చేసే అవకాశం వంగల శ్రీనివాస్ గారికి వచ్చింది. దూకుడు, నమో వేంకటేశకు గోపీ మోహన్ తో కలిసి రచయితగా శ్రీధర్ పనిచేశారు. అహనా పెళ్లంటలో శ్రీధర్ రాసిన సంభాషణలకు మంచి పేరొచ్చింది. మాటల విషయంలో ప్రతీది ఆయన చూసుకున్నారు. సినిమా విజయంలో శ్రీధర్ డైలాగులకు క్రెడిట్ దక్కింది. అప్పటి నుంచి మేము కలిసి ప్రయాణం చేస్తున్నాం. శ్రీధర్ మంచి విజయం సాధించాలి. అన్నారు.

దర్శకుడు వైవీఎస్ చౌదరి మాట్లాడుతూ…తన పుట్టిన రోజు నాడు శ్రీధర్ మరో మెట్టు ఎక్కుతున్నారు. అది దర్శకుడి ఛైర్ లో కూర్చోబోతున్నారు. అది చాలా శక్తివంతమైన స్థానం. పరిశ్రమలో చాలా మందికి మ్యాజిక్ చేసిన సీటు అది. ఆ మ్యాజిక్ శ్రీధర్ విషయంలోనూ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీధర్ ను దర్శకుడిని చేద్దామని చాలా మంది అనుకున్నారు. నిర్మాత వంగల శ్రీనివాస్ గారు జాగ్రత్తగా ఆ  బాధ్యతను  వహిస్తారని ఆశిస్తున్నాను. ఆనంద్ ప్రసాద్ గారూ, నేనూ, అనిల్ సుంకర గారు అనుకునేవాళ్లం శ్రీధర్ తో సినిమా చేద్దామని. ఇప్పటిదాకా శ్రీధర్ తో పనిచేసిన నిర్మాతలు, నటీనటులు, దర్శకుల అందరి ఆశీస్సులు శ్రీధర్ కు ఉంటాయి. అన్నారు. మణిశర్మ గారి లాంటి గొప్ప సంగీత దర్శకుడిని తన తొలి చిత్రానికి ఎంచుకోవడంలోనే శ్రీధర్ అభిరుచి తెలుస్తోంది. కొత్త వాళ్లతో సినిమా చేయాలనే నిర్ణయంలో ధైర్యం, సాహసం ఉన్నాయి. గతంలో జంధ్యాల గారు , ఈవీవీ గారు చాలా మంది కొత్త వాళ్ల నటీనటులతో సినిమాలు చేసేవారు. అలా శ్రీధర్ కూడా కొత్త నటీనటులను పరిశ్రమకు పరిచయం చేయాలని కోరుకుంటున్నాను. యూత్ ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ తో ఈ సినిమా ఉండాలని ఆశిస్తున్నాను. అన్నారు.

నటుడు ఫృథ్వీ మాట్లాడుతూ…బృందావనమది అందరిది కథ ఆమెరికాలో ఉన్నప్పుడు శ్రీధర్ రాసుకున్నాడు. చాలా అద్భుతమైన కథ ఇది. చాలా మలుపులు తిరుగుతూ వినోదాన్ని అందిస్తుంది. రచయిత దర్శకుడు అయితే జంధ్యాల గారిలా గొప్ప హాస్యాన్ని చూపించగలరు. శ్రీధర్ గొప్ప దర్శకుడు అవుతారు. ఈ సినిమాలో నా క్యారెక్టర్ చాలా బాగుంటుంది. ఓ హిట్ సాంగ్ తో నా పాత్ర మొదలై చివరి వరకు సాగుతుంటుంది. ఎంతోమంది అడుగుతున్నా తనను నమ్ముకున్న కొత్త నిర్మాతతో సినిమా చేస్తున్నారు. అదీ శ్రీధర్ గొప్పదనం. దర్శకుడిగా తన ప్రతాపం చూపిస్తారని ఆశిస్తున్నా. అన్నారు.

దర్శకుడు శ్రీధర్ సీపాన మాట్లాడుతూ…ఇటీవల నా దర్శకత్వంలో సినిమా ఉంటుందని ప్రకటించాను. దానికి మీడియాలో వచ్చిన స్పందన చాలా ధైర్యాన్నిచ్చింది. నా దర్శకత్వంలో కొత్త వాళ్లతో సినిమా అనగానే పరిశ్రమలో ఉన్న నా సన్నిహితులు, తెలిసినవాళ్లు కొత్త వాళ్లతో ఎందుకు చాలా మంది స్టార్ హీరోలతో పనిచేశావు కదా అని మాట్లాడారు. నా మంచి కోసమే వాళ్లు చెప్పారు. నేను వాళ్లకు ఓ విషయం చెప్పాను. పదిహేనేళ్ల క్రితం నేను నటుడిని అవుదామని రోడ్లపై తిరుగుతుంటే తనకున్న స్థాయిలో నన్ను పిలిచి నా స్నేహితుడు రామిరెడ్డి చేరదీశారు. ఆయన స్నేహితుడే వంగాల శ్రీనివాస్. ఇన్నేళ్లలో నన్ను ఏదీ అడగని రామిరెడ్డి ఓ సినిమా చేసిపెట్టమన్నారు. ఆయన కోసమే ఈ చిత్రాన్ని ఒప్పుకున్నాను. అది తప్ప ఇంకే కారణం లేదు. నాకు ఇష్టమైన కథ ఇది. పెద్ద హీరోలు నాకు అవకాశమిచ్చినా…ఎప్పుడైనా ఈ కథ చేయాలని అనుకున్నాను. నా అదృష్టం కొద్దీ తొలి చిత్రమే ఈ కథతో చేయడం బృందావనమది అందరిది లాంటి పాజిటివ్ టైటిల్ దొరకడం సంతోషంగా ఉంది. కొన్ని నెలల కిందట మా నాన్న చనిపోయారు. ఆయన ఆశీర్వాదంతోనే ఈ చిత్రం ఇంత త్వరగా ప్రారంభమైందని భావిస్తున్నాను. నిర్మాత చాలా స్వేచ్ఛనిచ్చారు. కథకు కావాల్సింది తీసుకోండి అని చెప్పారు. ఆయన ఇచ్చిన స్వేచ్ఛతో నాపై బాధ్యత మరింత పెరిగింది. చెప్పిన బడ్జెట్ లో జాగ్రత్తగా సినిమా చేసి నిర్మాతకు ఓ రూపాయి మిగిలేలా శాయశక్తులా కష్టపడతాను. నేను దర్శకుడిని అయితే మణిశర్మ గారితో సినిమా చేయాలని అనుకున్నాను. ఆయన సంగీతం అంటే నాకు చాలా ఇష్టం.  ఆనంద్ ప్రసాద్ గారు, అనిల్ సుంకర గారు నాకు ఆప్తులు. వాళ్లు ఉన్నారనే ధైర్యంతోనే సినిమా చేస్తున్నాను. రచయిత అవడానికి కారణమైన స్వామిజీ, విజయ్, గురువులాంటి గోపీమోహన్, కోన వెంకట్, దర్శకులు వైవీఎస్ చౌదరి గారికి కృతజ్ఞతలు. అతి త్వరలో సినిమా షూటింగ్ అందరు స్టార్ హీరోలు, దర్శకులు, నిర్మాతల సమక్షంలో వైభవంగా ప్రారంభిస్తాం. వచ్చే నెల చివర నుంచి రెగ్యులర్ చిత్రీకరణకు వెళ్తాం.అన్నారు.

మెలొడీ బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.

బృందావనమది అందరిదీ మంచి విజయం సాధించాలని నటుడు రఘు కారుమంచి కోరారు.

నూతన నటీనటులతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రఘు కారుమంచి, ఫృథ్వీ,

శేషు, రామిరెడీ ,రాకర రవీంద్ర ప్రత్యేక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ – ఎంఎస్ తేజ,

ఎడిటర్ – ప్రవీణ్ పూడి,

సంగీతం – మణిశర్మ,

నిర్మాత – శ్రీనివాస్ వంగల,

కథా, మాటలు,  స్క్రీన్ ప్లే, దర్శకత్వం — శ్రీధర్ సీపాన