ప్రేక్షకుల పంబరేగింది …..‘జంబ లకిడి పంబ’ చిత్ర సమీక్ష

                                 సినీవినోదం రేటింగ్ : 1.5/5

శివమ్‌ సెల్యులాయిడ్స్‌, మెయిన్‌లైన్‌ ప్రొడక్షన్స్‌ జె.బి. మురళికృష్ణ (మను) దర్శకత్వంలో రవి, జోజో జోస్‌, ఎన్‌. శ్రీనివాసరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు
వరుణ్‌ (శ్రీనివాసరెడ్డి) , పల్లవి (సిద్ధి ఇద్నాని) ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట. పెళ్లి తరువాత మనస్పర్థల కారణంగా ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. ఇక కలిసి జీవించలేం అని నిర్ణయించుకున్న వరుణ్‌, పల్లవిలు విడాకుల తీసుకోవాలని నిర్ణయించుకుంటారు. 99 జంటలకు విడాకులు ఇప్పించిన ఫేమస్‌ లాయర్‌ హరిశ్చంద్ర ప్రసాద్‌ (పోసాని కృష్ణమురళీ) వీరికి విడాకులు ఇప్పించి వంద మందికి విడాకులు ఇప్పించిన లాయర్‌ గా గిన్నిస్‌ రికార్డ్ సాధించాలనుకుంటాడు. కానీ వరుణ్‌, పల్లవికి విడాకులు రాకముందే హరిశ్చంద్ర ప్రసాద్‌ ఓ యాక్సిడెంట్‌లో భార్యతో సహా చనిపోతాడు. చేసిన పాపాల కారణంగా ఆత్మగా మారిన హరిశ్చంద్ర ప్రసాద్ భార్యకు దూరమవుతాడు. తిరిగి తన భార్యను కలుసుకోవాలంటే వరుణ్‌, పల్లవిలను ఒక్కటి చేయమని దేవుడు(సుమన్‌) కండిషన్ పెడతాడు. దీంతో తిరిగి భూలోకంలోకి వచ్చిన హరిశ్చంద్రప్రసాద్‌ ఏం చేశాడు..? వరుణ్‌ శరీరంలోకి పల్లవి ఆత్మను, పల్లవి శరీరంలోకి వరుణ్‌ ఆత్మని ఎందుకు మార్చాల్సి వచ్చింది..? చివరకు వరుణ్‌, పల్లవిలు ఒక్కటయ్యారా..? అన్నది సినిమాలో చూడాలి ….
కధ బావుంది కానీ, దాని చుట్టూ అల్లుకున్న స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల స‌హ‌నానికి ప‌రీక్ష పెడ‌తాయి.ఫస్ట్‌ హాఫ్‌లో హీరో హీరోయిన్ల మధ్య జరిగే గొడవలు ఏ మాత్రం ఆసక్తికరంగా లేకుండా టీవీ సీరియల్‌ లా సాగటం ప్రేక్షకులను విసిగిస్తుంది. ఒక‌రి మీద ఒక‌రు ప‌గ ప‌ట్ట‌డం, ఒక‌రి కెరీర్ ని మ‌రొక‌రు నాశ‌నం చేసుకోవాల‌నుకోవ‌డం వంటి స‌న్నివేశాల‌న్నీ తేలిపోయాయి. ఎక్క‌డా డెప్త్ క‌నిపించ‌దు. ఇద్ద‌రిలోనూ క‌సి క‌నిపించ‌దు.దర్శకుడు మురళీ కృష్ణ ప్రేక్షకులను అలరించటంలో ఫెయిల్‌ అయ్యారు. అసలు సినిమాలో మెయిన్ పాయింట్‌ ఏంటనేది ఇంటర్వెల్‌ దగ్గర కానీ రివీల్‌ అవ్వదు. ఫస్ట్‌ హాఫ్‌ సాగతీత సీన్లతో, విసుగు తెప్పించే హాస్యంతో నెట్టుకొచ్చేశారు. ఆశించిన స్థాయి కామెడీ ఈ చిత్రంలో కొరవడింది. కనీసం ప్లో కూడా లేకుండా సాగే ప్రథమార్ధం చూసే సరిగే ఆడియన్స్ విసుగెత్తిపోతారు. కథకి ముఖ్యమైన ఇంటర్వెల్‌ సీన్‌ చూశాక ..ఇక సెకెండ్ హాఫ్ లోనైనా సినిమా గాడిన పడుతుందనుకుంటే.. అవే సీన్లను అటు తిప్పి, ఇటు తిప్పి అదే రొటీన్‌ తంతుతో, పండని కామెడీ తో ఇంకొంత బోర్ కొట్టిస్తారు.శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణ మురళి లాంటి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ లు ఉన్నా… వారి టాలెంట్‌ని వాడుకునేంతగా సన్నివేశాలు లేకపోవడంతో వాళ్ళు కూడా చేయగలిగేది ఏమీ లేకుండా పోయింది. భావోద్వేగాన్ని పండించే సన్నివేశాలు రెండు కూడా కనిపించవు. పాట‌లు కూడా మెప్పించ‌వు. పాట‌లు ఎప్పుడొస్తాయో, ఎందుకొస్తాయో అన్న‌ట్టు ఉన్నాయి. స్క్రీన్ ప్లే చాలా ఊహాజనితంగా నడుస్తుంది. దీంతో ప్రేక్షకుడికి సినిమాలో తర్వాత ఏం జరుగుతుంది? అనే ఉత్కంఠ ఎక్కడా కలగలేదు.
 శ్రీనివాస్ రెడ్డి హీరోగా తన పాత్రకి న్యాయం చేసేందుకు కష్టపడ్డాడు.అమ్మాయి ల‌క్ష‌ణాల‌తో శ్రీనివాస‌రెడ్డి, అబ్బాయి ల‌క్ష‌ణాల‌తో సిద్ధి చేసినా పండించలేక పోయారు . కీలకమైన పాత్రలో నటించిన పోసాని తన నటనతో చిత్రానికి కొంత ప్లస్ అయ్యారు. వెన్నెల కిశోర్ ఎప్పటిలానే తన మార్క్ పంచులతో విడాకుల లాయర్ గా నవ్వించారు.తనికెళ్ల భరణి,  జబర్దస్త్ అప్పారావు, సత్యం రాజేష్ లు బాగానటించారు. హ‌రితేజ పాత్ర బావుంది.
సతీష్ ముత్యాల కెమెరా వర్క్ ఈ సినిమాకే హైలెట్. బలం లేని స్క్రీన్ ప్లే లో తన విజువల్స్ తో కొంతైనా ఊరట కలిగించాడు. సినిమాలో ఎక్కడా విజువల్ బ్యూటీ తగ్గకుండా ఆయన చాలా బాగా చిత్రీకరించారు. శ్రీనివాస్ అంకాలపు రాసిన డైలాగ్స్ అక్కడక్కడ బాగున్నాయి . సంగీత దర్శకుడు గోపి సుందర్ అందించిన ట్యూన్స్, నేపధ్య సంగీతం మరీ నాసిగా,ఆయన స్థాయికి తగ్గట్టు లేవు. తమ్మిరాజు ఎడిటింగ్ బాగున్నా, ఫస్ట్ హాఫ్ లోని సన్నివేశాలను మరింత తగ్గిస్తే బాగుండేది – రవళి