నా దాహం ‘బిగ్‌బాస్‌’తో తీరుతుందనే నమ్మకం వుంది !

‘స్టార్ మా’ ఛానెల్‌ ‘బిగ్‌బాస్’ తొలి సీజన్‌కు ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. తొలి సీజన్ ప్రేక్షకాదరణ చూరగొంది. తాజాగా రెండో సీజన్‌కు హీరో నాని హోస్ట్‌గా కనిపించబోతున్నారు. ఈ నెల 10న ఈ రియాలిటీ షో ప్రారంభంకానుంది. “బిగ్‌బాస్ తొలిసీజన్‌ను తారక్ అద్భుతంగా నడిపించాడు. ఆ ఆంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా రెండో భాగాన్ని నేను కొనసాగిస్తాననే నమ్మకముంది. ఎక్కడికి వెళ్లినా అందరూ నన్ను పక్కింటి అబ్బాయిలా ఉన్నావనేవారు. ఈ షో ద్వారా అందరి ఇంట్లో అబ్బాయిలా మారబోతుండటం ఆనందంగా ఉంది” అని అన్నారు నాని. ఈ సందర్భంగా సోమవారం నాని మీడియాతో ముచ్చటించారు…

బిగ్‌బాస్ సీజన్-2కు వ్యాఖ్యాతగా నన్ను వ్యవహరించమని అడిగినప్పుడు ఈ కార్యక్రమం ఎలా ఉంటుంది? ఎప్పుడొస్తుంది? అని కజిన్స్, స్నేహితులను అడిగాను. నా మాటలు విని బిగ్‌బాస్ చూడలేదా అంటూ అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడే అది ఎంత పెద్ద రియాల్టి షోనో అర్థమైంది. అప్పటి నుంచి షో గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. నేను వ్యాఖ్యాతగా ఎలా చేస్తానోనని చాలా మంది అడుగుతున్నారు. నేను మీలాగే ఈ రియాలిటీ షో కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఈ కార్యక్రమంపై నాకు పూర్తిగా అవగాహన లేదు. ఈ నెల 10 నుంచి తెలుసుకోబోతున్నాను. సంవత్సరానికి ఎన్ని సినిమాలు చేసినా తక్కువే అనిపిస్తున్నాయి. నా దాహం బిగ్‌బాస్‌తో తీరిపోతుందనే నమ్మకం వుంది. ఈ షోను ఎప్పుడు ప్రారంభించాలి? ఎలా ముగించాలనే అంశంపై టీమ్ అందరూ చాలా ఖచ్చితంగా ఉన్నారు. వారి క్లారిటీ చూస్తుంటే ఈ షోకు నేను కరెక్టేనా అనిపిస్తున్నది. కానీ వారికే అంత నమ్మకం ఉన్నప్పుడు నాకు లేకపోతే బాగుండదనిపించింది.

నేను ఎవరిని ఫాలో అవ్వను !

ఎక్కడికి వెళ్లినా తారక్ చాలా బాగా చేశాడని చెబుతున్నారు. ఆయనతో వందశాతం సరితూగడం కష్టం. తొలి సీజన్‌ను ఇంకా చూడలేదు. చూస్తానని తారక్‌కు ప్రామిస్ చేశాను. అయితే టీమ్ ప్రణాళికలు చూస్తుంటే రెండో భాగాన్ని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారనే నమ్మకముంది. ప్రేక్షకులతో నాకున్న అనుబంధం ఇంకా బలపడటానికి ఇదొక మంచి వేదిక అవుతుంది. మహానటి ఆడియో వేడుక అనంతరం ఎన్టీఆర్‌ను కలిశాను. షోలో స్టేజ్‌పై నటించాల్సిన అవసరం లేదు. మనం మనలాగా కనిపిస్తే చాలని ఆయన అన్నారు. సలహాలు అసలు ఫాలో అవకూడదని చెప్పారు. అందుకే నేను ఎవరిని ఫాలో అవ్వకూడదని నిర్ణయించుకున్నాను. నాకు తోచిన విధంగా చేసుకుంటూ వెళ్తాను. వ్యాఖ్యాతగా పనిచేయడాన్ని హోదాలా కాకుండాబాధ్యతగా భావిస్తున్నాను. నేనే దీనికి హోస్ట్ కాబట్టి మా ఇ ంట్లో వారు షో చూస్తారు. అందుకే ఇంటిల్లిపాది కలిసి చూసే క్లీన్ ఎంటర్‌టైనర్‌లను చేయాలన్నదే నా సిద్ధాంతం. అందుకు అనుగుణంగానే ప్రతి ఎపిసోడ్ ద్వారా ఏదో ఒక సందేశాన్ని ఇవ్వడానికే ప్రయత్నిస్తాను

ఏది చేసినా వందశాతం ఎఫర్ట్ పెడతా !

ఇంతకుముందు పనిపాటా లేకుండా ఎందుకు ఇలాంటి షోలు చూస్తారని అందరిని తిట్టేవాడిని. దేవుడి స్క్రీన్‌ప్లే కారణంగా ఈ రియాలిటీషో నేనే చేయాల్సివస్తుంది. ఇంతకుముందు ముంబయిలో ఈ షో చిత్రీకరణ జరిగింది. దాంతో తారక్ ఇంటివారిని మిస్సయ్యారు. ఇప్పుడు హైదరాబాద్‌లో షో చేస్తుండటంతో కంఫర్ట్, టైమ్ కలిసి వచ్చాయి. మూడు సినిమాలు చేస్తున్నాను కాబట్టి అంతదూరం వెళ్లడం కష్టమయ్యేది. హైదరాబాద్‌లోనే కాబట్టి సాయంత్రాలు మా జున్ను(కొడుకు)తో ఆడుకోవచ్చు(నవ్వుతూ). సినిమాలు, వృత్తిపరంగా సవాళ్లను స్వీకరించడం అంటే నాకు ఇష్టం. ఇప్పటికే ఓ స్టార్ ఈ రియాలిటీ షోను పెద్ద స్థాయికి తీసుకెళ్లి బెంచ్‌మార్క్‌ను సృష్టించారు. ఆ స్థాయికి తగ్గట్లుగా చేయాలంటే రెండింతల బలంతో రావాలి. పెద్ద ఛాలెంజ్ కళ్ల ముందు కనిపించడంతో బిగ్‌బాస్‌కు హోస్ట్‌గా పనిచేయడానికి అంగీకరించాను. ప్రతిఫలాన్ని ఆశించి నేనెప్పుడూ సినిమాల్ని, కార్యక్రమాల్ని అంగీకరించను. ఏది చేసినా వందశాతం ఎఫర్ట్ పెట్టడానికే ప్రయత్నిస్తాను అని తెలిపారు.

‘స్టార్ మా’ బిజినెస్ హెడ్ అలోక్ జైన్ మాట్లాడుతూ…. ఎన్టీఆర్‌నే రెండో సీజన్‌కు కొనసాగించాలని అనుకున్నాం. కానీ సినిమా షూటింగ్‌లతో ఆయన డేట్స్ సర్దుబాటు కాలేదు. ఆయన స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలనేది నిర్ణయించుకోవడం చాలా కష్టమైంది. నానినే మాకు మొదటిఛాయిస్ అనిపించారు. ఈ నెల 10 ప్రారంభయ్యే రెండో సీజన్ మొత్తం 106 రోజుల పాటు ప్రేక్షకుల్ని అలరిస్తుంది. ఇందులో నాని జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొనే ఇందులో సామాన్యులు పాల్గొనే అవకాశం కల్పించాం. హైదరాబాద్‌లో బిగ్‌బాస్-2 చిత్రీకరణ జరుగుతుంది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అభిషేక్ రెగె, రజత్‌నందా, నాడియా చౌహాన్ తదితరులు పాల్గొన్నారు.