ఎన్నికల బరిలో కన్నడ నటుడు సుదీప్‌ ?

కర్నాటక శాసనసభ ఎన్నికల్లో కన‍్నడ నటుడు కిచ‍్చ సుదీప్‌ రాజకీయ అరంగేట్రం చేస్తున్నారనేచర‍్చ ఇప్పుడు కన‍్నడ నాట జోరుగా సాగుతోంది.2018లో కర్నాటకలో శాసనసభ ఎన్నికలు జరుగుతున్నందున అన్ని పార్టీల నాయకులు ఇప్పటికే గెలుపుకోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా సినిమా రంగంలో ఉన్న వారిని కూడా తీసుకోవడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి కన్నడ నటుడు కిచ్చ సుదీప్‌ బరిలో ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ విషయమై ఇప్పటివరకు నటుడు సుదీప్‌ ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించకపోయినా ఆయన ఇటివల సీఎం సిద్దరామయ్యను కలవడం చర‍్చనీయాంశమైంది.

వచ్చే ఎన్నికల‍్లో సుదీప్‌ కాంగ్రెస్ పార్టీ నుంచి తప‍్పకుండా పోటీచేస్తారని కన్నడ నటి, కాంగ్రెస్‌ నాయకురాలు రమ్య ప్రకటించడం  ఊహాగానాలకు బలం చేకూరుస్తోంది. సుదిప్‌ను రాజకీయాల్లోకి తీసుకోనిరావడానికి రమ్య గత కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తోంది. గతంలో కిచ్చ సుదీప్‌తో కలిసి ఆమె ‘రంగ ఎస్‌ఎస్‌ఎల్‌సీ’, ‘ముస్సంజే’ సినిమాల్లో నటించింది. అంతే కాకుండ ఇద్దరూ మంచి స్నేహితులు కూడా. కాంగ్రెస్‌ పార్టీలో చేరమని సుదీప్‌ను రమ్య అడిగిందన‍్న వార‍్తలు గుప్పుమంటున్నాయి. ఒకవేళ సుదీప్‌ ఒప్పుకుని కాంగ్రెస్‌ పార్టీలో చేరితే వచ్చే శాసనసభ ఎన్నికల్లో సుదీప్‌ను చిత్రదుర్గలోని మోళ కాల్మూరు నియోజకవర్గం నుంచి బరిలో దింపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇటివలె కన్నడ నటుడు విష్ణువర్థన్‌ స్మారకం ఏర్పాటు చేసే విషయం పైన నటుడు సుదీప్‌ సీఎం. సిద్దరామయ్యను కలిసి వినతి పత్రం అందజేశారు.అక్కడ సీఎంతో కలిసి సుదీప్‌ ఏకాంతంగా చర‍్చలు జరిపారు. కాని బయటకి వచ్చిన సుదీప్‌ను మీడియా ప్రతినిదులు కాంగ్రెస్‌ పార్టిలో చేరుతున్నారా అని అడగ్గా …ఈ విషయం పైన ఎలాంటి స్పందన తెలుపకుండా నవ్వుతూ  చేయి ఊపి వెళ్ళిపోవడం జరిగింది. దాంతో సుదీప్‌ కాంగ్రెస్‌ పార్టీలొ చేరుతున్నారా లేదా అని అభిమానులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.

హాలీవుడ్ సినిమాలో సుదీప్

సౌత్‌లో పాపులర్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు సుదీప్ ఇప్పుడు హాలీవుడ్ ఛాన్స్ కొట్టేశాడు. ‘స్పర్శ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సుదీప్ తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఆతర్వాత రామ్‌గోపాల్ వర్మ ‘రక్త చరిత్ర’, రాజమౌళి దర్శకత్వంలో ఈగ, బాహుబలి సినిమాలు చేసి తెలుగులో ఎంతో పాపులారిటీ తెచ్చుకున్నాడు సుదీప్. కన్నడలో పెద్ద స్టార్ అయిన సుదీప్ ఓ హాలీవుడ్ సినిమాలో నటిచంచడానికి సిద్ధమయ్యాడు. యాక్షన్ డ్రామా తరహాలో తెరకెక్కే ఈ సినిమాకు ఆస్ట్రేలియన్ ఫిల్మ్‌మేకర్ ఈడి ఆర్య దర్శకత్వం వహించబోతున్నాడు. సుదీప్ ఈ సినిమాలో ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు. రష్యాలో జరిగే ఒక భారీ విస్పోటనం పేలుడుపై సినిమా కథ నడుస్తుందట. ఆ బ్లాస్ట్ వేలాది మంది జీవితాలను వికలాంగులను చేస్తుందట. సుదీప్ యాక్షన్ సీన్స్ హైలైట్‌గా ఉంటాయట. ప్రస్తుతం సుదీప్ కన్నడలో చేస్తున్న సినిమా పూర్తికాగానే వేసవిలో ప్రారంభమయ్యే హాలీవుడ్ చిత్రం షూటింగ్‌లో పాల్గొంటాడు.