ఆమె డేట్స్ కోసం ఇప్పుడు స్టార్ హీరోలు సైతం…

సుధా కొంగర… రెండు సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తో స్టార్ డైరెక్టర్‌గా ముద్ర వేయించుకుంది .ఇప్పుడు ఈ దర్శకురాలి విషయంలో అద్భుతం జరుగుతోంది. ఒకప్పుడు ఆమె పేరు వింటే వద్దన్న నిర్మాతలే ఇప్పుడు ఒక్క సినిమా చేయమని కోరుతున్నారు. ఇక స్టార్ హీరోలు కూడా ఆమె చెప్పే కథల కోసం వేచి చూస్తున్నారు. ‘గురు’ సినిమాతో సంచలనం రేపిన సుధ..ఇప్పుడు ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాతో మరో సంచలనానికి తెరతీసింది. ప్రస్తుతం ఎక్కడ విన్నా కూడా.. సూర్య నటించిన ‘ఆకాశం నీ హద్దురా’ గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమాతో సుధ పేరు సౌత్ ఇండస్ట్రీలో మార్మోగుతోంది.  ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ కూడా చేయబోతున్నారు.

తమిళంలో ‘సూరరై పొత్రు’గా వచ్చిన ఈ చిత్రాన్ని తెలుగులో ‘ఆకాశం నీ హద్దు రా’ పేరుతో డబ్ చేసారు. థియేటర్స్ మూత పడటంతో ‘అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేసిన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది. ఓటిటిలోనే అతి పెద్ద విజయంగా నిలిచింది. ప్రశంసల వర్షం కురుస్తోంది. సుధ డైరెక్షన్‌పై కూడా విమర్శకుల ప్రశంసలు కురుస్తున్నాయి. ఓ స్ఫూర్తిదాయకమైన కథను సుధ తెరకెక్కించిన తీరు అందరిచేత శభాష్ అనిపించుకుంటోంది. ఓ వాస్తవిక సంఘటన తీసుకుని కల్పిత స్క్రీన్ ప్లే తో అందర్నీ ఒప్పించేలా ‘ఆకాశం నీ హద్దురా’ తెరకెక్కించింది సుధ. ఇందులో కొన్ని సన్నివేశాలను సుధ తెరకెక్కించిన తీరు దిగ్గజ దర్శకులను కూడా ఆకట్టుకుంది.

అయితే సుధా కొంగర  తెలుగమ్మాయి అని చాలా తక్కువ మందికి తెలుసు. గుంటూరు, వైజాగ్‌లో ఈమెకు మూలాలున్నాయి. కొన్నేళ్లుగా మణిరత్నం దగ్గర శిష్యరికం చేసిన ఈమె 2008లో విడుదలైన ‘ఆంధ్రా అందగాడు’ సినిమాతో దర్శకురాలిగా మారింది. కమెడియన్ కృష్ణభగవాన్ ఇందులో హీరో. ఆ సినిమా వచ్చిన రెండేళ్ల తర్వాత  2010లో ‘ద్రోహి’ సినిమా చేసి ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత ఆరేళ్లు గ్యాప్ తీసుకుని మాధవన్, రితికా సింగ్ ప్రధాన పాత్రల్లో బాక్సింగ్ డ్రామా ‘సాలా ఖాదూస్’ తో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇదే సినిమా తెలుగులో ‘గురు’గా వచ్చివిజయం సాధించింది. స్టార్ హీరోలు కూడా ఇప్పుడు సుధా కొంగర డేట్స్ కోసం చూస్తున్నారు. మొత్తానికి ఒకప్పుడు వద్దనుకున్న వాళ్లే ఇప్పుడు ఆమె ఇంటి ముందు క్యూ కడుతున్నారు.

త్వరలో ఆమెతో కలిసి సినిమా చేస్తా!… అందిరిచేత శభాష్ అనిపించుకునేలా వచ్చింది సూర్య నటించిన ‘ఆకాశం నీ హద్దురా’. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ద్వారా విడుదలైన ఈ చిత్రంపై ప్రేక్షకులు, సెలబ్రిటీలు, విమర్శకులు.. ఇలా ప్రతి ఒక్కరూ ఈ సినిమాను, సినిమాలో నటించిన వారిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. తాజాగా ఈ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించారు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ…

‘‘సూరారై పొట్రు (ఆకాశం నీ హద్దురా) చిత్రాన్ని నా ఫ్రెండ్స్‌తో కలిసి చూశారు. అందులో ముగ్గురు సినిమా చూసి ఏడుస్తూనే ఉన్నారు. బాగా ఎమోషనల్ అయ్యారు. బయటి వ్యక్తులు ఇచ్చే స్టేట్‌మెంట్స్ అస్సలు నమ్మకూడదు. ఈ సినిమా చూశాక ఆవేశం వచ్చేసింది. సూర్య అన్న అద్భుతమైన నటుడు. ఆయన నటనను చూసి అందరూ ప్రేమలో పడిపోతారు. ఈ సినిమాని ఆయన నిర్మించినందుకు లవ్ యు సార్. హీరోయిన్‌గా ఆపర్ణను ఎక్కడి నుంచి పట్టుకొచ్చారో గానీ.. అద్భుతం. ఇలాంటి వారిని సుధగారు భలే పట్టుకొస్తుంటారు. వాస్తవంగా.. నటనతో ఆమె కట్టిపడేసింది. సుధాకొంగర.. ఖచ్చితంగా త్వరలో ఆమెతో కలిసి సినిమా చేస్తాను. ఇది ఆమె పట్ల నాకున్న గౌరవం. ఈ సినిమాని అందరూ ఖచ్చితంగా చూడండి.. ఛీర్స్..’’ అని విజయ్ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.