ఫీల్ గుడ్ సినిమా ….. ‘మ‌ళ్ళీ రావా’ చిత్ర సమీక్ష

                                            సినీ వినోదం రేటింగ్ : 3/5
స్వ‌ధ‌ర్మ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ బ్యానర్ పై గౌత‌మ్ తిన్న‌నూరి క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం లో రాహుల్ యాద‌వ్ న‌క్క‌ ఈ చిత్రాన్ని నిర్మించారు
 
కార్తిక్ (సుమంత్) 9వ తరగతి చదువుతున్నప్పుడే తన తోటి స్టూడెంట్ అంజలి (ఆకాంక్ష సింగ్) ను ప్రేమిస్తాడు. కానీ వారి ఇంట్లోని పెద్దలు విషయం తెలిసి వాళ్ళను మందలిస్తారు. అంజలి పేరెంట్స్ ఆమెను ఆ ఊరి నుండే తీసుకెళ్ళిపోతారు. అలా 13 ఏళ్ల పాటు అంజలికి దూరమైన కార్తిక్ ఆమెనే ప్రేమిస్తూ ఉంటాడు . ఒక రోజు అంజలి సడన్ గా అతను జాబ్ చేసే కంపెనీకే వస్తుంది.ఆ కలయికలో అంజలి కార్తీక్ ప్రేమను అర్థం చేసుకుని అతన్నే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది. తీరా పెళ్లి సమయానికి ‘పెళ్లి ఇష్టం లేద’ని చెప్పి వెళ్ళిపోతుంది . ఆ తర్వాత కొంత కాలానికి … మరొకరితో పెళ్ళికి రెడీ అయిన అంజలి మళ్ళీ కార్తీక్ ని వెతుక్కుంటూ తిరిగి వస్తుంది. అసలు అంజలి ఆఖరు నిముషంలో పెళ్లి వద్దని కార్తిక్ ను వదిలి ఎందుకు వెళ్ళిపోయింది? మళ్లీ ఎందుకు వచ్చింది? ఈ సారి వారి కలయికలో అంజలిని కార్తిక్ అంగీకరించాడా ? అనేది సినిమా లో చూడాలి …..
దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ప్రేమ కథను కొత్త కోణంలో చూపించడానికి చేసిన ప్రయత్నం బాగుంది. సినిమా ను బాగా హ్యాండిల్ చేశారాయన.చాలా సన్నివేశాల్లో దర్శకుడి టాలెంట్ కనిపిస్తుంది. సినిమా స్టార్టింగ్ నుంచి ఓ ఫీల్ తీసుకొచ్చి చివరి వరకూ అదే ఫీల్ ను మైంటైన్ చేసి ఎంటర్టైన్ చేశాడు.ప్రేమ‌క‌థ అన‌గానే ఎమోష‌న్స్‌ను క్యారీ చేసే విధానం, ప్రెజెంట్ చేసే తీరుపై వాటి స‌క్సెస్‌ ఆధార‌ప‌డి ఉంటుంది. అలాంటి డిఫ‌రెంట్ క‌థ‌నంతో ద‌ర్శ‌కుడు గౌత‌మ్ సినిమాను న‌డిపిన తీరు మెప్పిస్తుంది. సెన్సిబుల్ ఎమోషన్స్‌ను వివిధ ప‌రిస్థితుల్లో ద‌ర్శ‌కుడు చ‌క్క‌గా ఎలివేట్ చేశాడు.మూడు స్టేజ‌స్‌లో జ‌రిగే ప్రేమ‌క‌థ ఇది. అలాంటి ప్రేమ‌క‌థ‌ను మూడు స్టేజ‌స్‌లోని స‌న్నివేశాల‌ను స‌మాంత‌రంగా కలుపుతూ సినిమాను న‌డిపించిన తీరు బావుంది.అయితే ,1999, 2012, 2017 … మూడు కాలాల మధ్య నడవడం మూలాన చూసే ప్రేక్షకులను కొంత కన్ఫ్యూజ్ చేసి ఇబ్బందిపెట్టింది . హీరో చిన్ననాటి ప్రేమ కథ లెంగ్త్ కొంత తగ్గిస్తే రిలీఫ్ గా ఉండేది. హీరోయిన్ ఆఖరిసారి హీరోని వెతుక్కుంటూ రావడానికి బలమైన కారణమేదీ కనిపించదు . హీరోయిన్ హీరోని వదిలి వెళ్లిపోయే సందర్భం, చివర్లో అతనికి సంజాయిషీ చెప్పుకునే సందర్భం భావోద్వేగపూరితంగా బాగా చేసారు . హీరో ఆఫీస్ వాతావరణంలో నడిచే సన్నివేశాలు చాలా చోట్ల కడుపుబ్బ నవ్వించాయి.
 
హీరో సుమంత్‌, హీరోయిన్ ఆకాంక్ష చ‌క్క‌గా త‌మ న‌ట‌న‌తో ఎమోష‌న్స్‌ను ప‌లికించారు.హీరోగా కాస్త గ్యాప్ తర్వాత సుమంత్ తనకి పర్ఫెక్ట్ అనిపించే చక్కటి రొమాంటిక్ స్టోరీని సెలెక్ట్ చేసుకున్నాడు.ఎలాంటి పరిస్థితిలో అయినా ప్రేయసిని అర్థం చేసుకునే ఉదార స్వభావం కలిగిన ప్రేమికుడిగా సుమంత్ నటన చాలా బాగుంది. హీరోయిన్ ఆకాంక్ష సింగ్, హీరో స్నేహితుడిగా అభినవ్ ల నటన బాగున్నాయి. ఇక అన్న‌పూర్ణ‌మ్మ క్యారెక్ట‌ర్ ,మిర్చి కిర‌ణ్ కామెడి ట్రాక్ బావుంది. ఇక కార్తీక్ అడుసుమిల్లి స‌హా ఇత‌ర న‌టీన‌టులు వారి పాత్ర‌ల‌కు న్యాయం చేశారు.ముఖ్యంగా చైల్డ్ ఆర్టిస్టులుగా సాత్విక్ – బేబీ ప్రీతీ చాలా బాగా చేశారు.
 
“నువ్వు ద‌గ్గ‌రగా ఉన్న‌ప్పుడు ఇష్ట‌ప‌డ‌టం, దూరంగా ఉన్న‌ప్పుడు బాధ‌ప‌డ‌టం త‌ప్ప నాకేం తెలియ‌దు …నువ్వు లేవనే బాధ క‌న్నా..నిన్ను క‌లిస్తే ఎక్క‌డ దూర‌మైపోతానో అనే భ‌యం ఉంది..నీ గుండెలో మ‌నం విడిపోమ‌ని అనిపించి, ఏ భ‌యం లేన‌ప్పుడు మ‌నం క‌లుద్దాం”….వంటి దర్శకుడు రాసిన మంచి సంభాష‌ణ‌లు సినిమాకు బలాన్నిచ్చాయి. సంగీత ద‌ర్శ‌కుడు శ్ర‌వ‌ణ్ పాట‌లు క‌థ‌లో భాగంగానే హృదయం గా సాగిపోతాయి. ప్రత్యేకం గా ఎక్క‌డా పాట ఉన్న‌ట్లు ఫీల్ కాము . బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా బావుంది. కృష్ణకాంత్ అందించిన సాహిత్యం బావుంది. స‌తీష్ ముత్యాల సినిమాటోగ్ర‌ఫీ బావుంది. ప్ర‌తి స‌న్నివేశాన్ని హడావుడి లేకుండా అందంగా చూపించాడు. సత్య తన ఎడిటింగ్ ద్వారా ఫస్టాఫ్ డ్రామా లెంగ్త్ ను కొద్దిగా తగ్గించి ఉంటే బాగుండేది. మళ్ళీ చూడాలనిపించేలా ఉన్న ఈ ఫీల్ గుడ్ చిత్రాన్ని నిర్మించిన రాహుల్ యాదవ్ నక్క ను అభినందించాలి – ధరణి