బంగారం లేని ….. ‘ఉంగరాల రాంబాబు’ చిత్ర సమీక్ష

                                             సినీవినోదం రేటింగ్ : 2/5

యునైటెడ్ కిరిటి మూవీస్ బ్యానర్ పై కె.క్రాంతి మాధవ్ దర్శకత్వం లో పరుచూరి కిరీటి ఈ చిత్రాన్ని నిర్మించారు .

రాంబాబు(సునీల్‌) రెండు వంద‌ల కోట్ల‌కు అధిప‌తి. చిన్న‌త‌నంలోనే అమ్మ‌నాన్న‌ల‌ను కోల్పోవ‌డంతో తాత‌య్య‌(విజ‌య్‌కుమార్‌) రాంబాబును పెంచి పెద్ద చేస్తాడు. ఆస్థికి మించిన అప్పులున్నా రాంబాబు సంతోషం కోసం అత‌ని తాత‌య్య ఆ విష‌యాల‌ను దాచేస్తాడు. తాత‌య్య మ‌ర‌ణంతో అప్పుల వాళ్లకి ఆస్తినంతా ఇచ్చేస్తాడు. చేతిలో చిల్లిగ‌వ్వ‌లేని రాంబాబుకి బాదంబాబా(పోసాని కృష్ణ‌ముర‌ళి) ప‌రిచ‌యంతో ద‌శ తిరుగుతుంది. దొంగ బాబా అయిన బాదం బాబా చెప్పిన స‌ల‌హాతో రాంబాబుకు మంచే జ‌రుగుతుంది. తాను పోగొట్టుకున్న ఆస్థి మొత్తం తిరిగొచ్చేస్తుంది.

 దాంతో ఓ ట్రావెల్స్ బిజినెస్ ప్రారంభిస్తాడు. సావిత్రి(మియాజార్జ్‌), రాంబాబు ఆఫీస్‌లోనే మేనేజ‌ర్‌గా జాయిన్ అవుతుంది. రాంబాబును ప్రేమిస్తుంది. ముందు సావిత్రిని శ‌నిలా భావించిన రాంబాబుకు, ఆమె అదృష్ట జాత‌కురాల‌ని తెలుస్తుంది. ఆమెను ప్రేమించే ప్ర‌య‌త్నంలో రాంబాబు ఆమెకు ద‌గ్గ‌ర‌వుతాడు. ఇద్ద‌రూ పెళ్ళి చేసుకోవాలనుకుంటారు. సావిత్రి నాన్న రంగ నాయ‌ర్‌(ప్ర‌కాష్ రాజ్‌) కేర‌ళ‌లోని క‌మ్యూనిస్టు భావాలున్న గ్రామానికి అధిప‌తి. సావిత్రిని పెళ్లి చేసుకోవాలంటే రంగ నాయ‌ర్‌ను ఒప్పించాల‌ని రాంబాబు, సావిత్రి వాళ్ల గ్రామానికి వెళ్తాడు. ఇంత‌కు రాంబాబు, రంగ నాయ‌ర్‌ను ఒప్పిస్తాడా? రాంబాబు, సావిత్రిల పెళ్లి జ‌రుగుతుందా? అనే విష‌యాలు సినిమాలో చూడాల్సిందే…..

సునీల్ త‌న‌ను హీరోగా ప్రూవ్ చేసుకోవడానికి చేసిన మరో ప్ర‌య‌త్నం ఈ `ఉంగ‌రాల రాంబాబు`. ‘ఓన‌మాలు’, ‘మ‌ళ్ళీ మ‌ళ్ళీ ఇది రానిరోజు’ వంటి ఫీల్ గుడ్ సినిమాల‌ను తెరకెక్కించిన ద‌ర్శ‌కుడు క్రాంతిమాధ‌వ్ ఈ సినిమాను డైరెక్ట్ చేయడం సినిమా పై కొంత ఆసక్తిని పెంచింది .అయితే ఈ సినిమా చూస్తే క్రాంతి మాధవ్ ఈ సినిమాను తీశాడా? అనే అనుమానం వస్తుంది. తన మీద ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకోవటంలో దర్శకుడు పూర్తిగా విఫలమయ్యాడు. రియాలిటీకి దూరంగా, పాత క‌మ‌ర్షియ‌ల్ క‌థ‌ల‌నే కలిపి మ‌ళ్లీ రుద్దే ప్ర‌య‌త్నం చేశాడు . కామెడి స‌న్నివేశాలు కొత్త‌గా అనిపించ‌వు. గ‌తంలో చూసిన సినిమాల్లోని సన్నివేశాలే మ‌న‌కు క‌న‌ప‌డ‌తాయి. చిత్రం ఆద్యంతం నెగిటివ్ పాయింట్సే ఉన్నాయి . లాజిక్ లేని సన్నివేశాలు, ఆకట్టుకోని పెర్ఫామెన్స్, చికాకు పుట్టించే పాటలు ప్రేక్షకులని సీట్లో కుర్చోనివ్వవు. ఈ సినిమాని చివరి వరకు చూడడం అంటే ప్రేక్షకులకు పెద్ద పరీక్షే.ఈ చిత్రంలో ట్విస్ట్ లతో వచ్చే కొన్ని సన్నివేశాలు అర్థం లేనివిగా అనిపిస్తాయి. ఈ చిత్రం లో అన్నీ ప్రేక్షకులకు నిరాశ కలిగించే సన్నివేశాలే . హీరో ఇంట్ర‌డ‌క్ష‌న్ స‌న్నివేశంలో హీరో చిరంజీవిని ఇమిటేట్ చేయ‌డం చూస్తే … ‘బాబోయ్’ అనిపిస్తుంది. అలాగే సెకండాఫ్‌లో హీరో వంట వండే సీన్‌లో వేరే సినిమాల్లోని పాట‌లు, స‌న్నివేశాలు.. ఇలా అన్నీ ప్రేక్ష‌కుడికి నవ్వు తెప్పించ‌డం కంటే, ఇబ్బందినే ఎక్కువ క‌లిగిస్తాయి . హీరో, హీరోయిన్ తండ్రిని ఒప్పించ‌డానికి ప‌డ‌రాని పాట్లు ప‌డ‌టం, చివ‌ర‌కు ఆమె తండ్రిని ఒప్పించే సంద‌ర్భాల్లో హీరో మెప్పించడం లాంటి స‌న్నివేశాలు చాలా సినిమాల్లో మనం చూసేశాం.
సునీల్ పెర్ఫామెన్స్ ప‌రంగా ఆకట్టుకునే ప్ర‌య‌త్నం చేశాడు. తన పాత్రకు పూర్తి న్యాయం చేసినా.. అభిమానులు తన నుంచి ఆశించే కామెడీని మాత్రం అందించలేకపోయాడు. డ్యాన్సులు బాగా చేశాడు. మియాజార్జ్ పెర్ఫామెన్స్‌కు స్కోప్‌లేని, పాట‌ల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మ‌య్యే పాత్ర‌లో క‌నిపించింది. తనకు అవకాశం ఉన్న మేరకు బాగానే నటించింది. లుక్స్ పరంగా కూడా ఆకట్టుకుంది. దొంగ బాబా పాత్రలో పోసాని కృష్ణ‌ముర‌ళి త‌నదైన బాడీ లాంగ్వేజ్‌తో న‌వ్వించాడు. సెకండాఫ్‌లో ప్ర‌కాష్ రాజ్ గ‌తంలో ఎన్నో సినిమాల్లో కుటుంబ పెద్ద‌గా, ఊరి పెద్ద‌గా చేసిన క్యారెక్ట‌ర్‌నే ఇందులో కూడా చేశాడు. ప్ర‌కాష్ రాజ్ త‌న క్యారెక్ట‌ర్ ని ఈజీ గా చేసేశాడు. కానీ, ప్ర‌కాష్ రాజ్ పాత్ర‌లో డెప్త్ క‌న‌ప‌డ‌దు. ఏ పాత్ర‌లోనూ ఎమోష‌న్‌, డెప్త్ వెతికినా క‌న‌ప‌డ‌వు. సెకండాఫ్‌లో వ‌చ్చే వెన్నెల కిశోర్ బోరింగ్ సీన్స్ నుంచి ఆడియన్స్ ను ఆదుకునే ప్రయత్నం చేశాడు. ఆశిష్ విద్యార్థి, రాజీవ్ క‌న‌కాల పాత్ర‌లు ఎందుకు వ‌స్తాయో, ఎందుకు పోతాయో కూడా తెలీదు .
ఇక జిబ్రాన్ సంగీతం గురించి ఎంత త‌క్కువ‌గా మాట్లాడుకుంటే అంత మంచిది . బోరింగ్ సన్నివేశాల నుంచి ప్రేక్షకులను ఉపశమనం కలిగించేలా పాటలు లేవు .ఒక్క ట్యూన్ కూడా ఆకట్టుకోలేదు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ స‌రేస‌రి. డైలాగులు బావున్నాయి. స‌ర్వేష్ మురారి సినిమాటోగ్రఫీ బాగుంది – ధరణి