కొంత బాధ ! ..ఎక్కువ సంతోషం !!

బాలీవుడ్‌లో నటించడానికి వచ్చిన కొత్తల్లో నాకు తెలియకుండా కొన్ని తప్పులు జరిగాయి. అయితే,నన్ను మోసం చేసిన వారే ఎక్కువగా ఉన్నారు…. అని అంటోంది సన్నీలియోన్. నాకు చెప్పే కథ ఒకటి తీసే కథ మరొకటి ఉండేది. తెరమీద చూస్తే కొన్ని సన్నివేశాలు నాకే అసహ్యంగా అనిపించేవి. ఓ ఐదారు సినిమాల వరకూ అలా మోసపోయాను. ఇప్పుడు వాటన్నిటిని అధిగమించాను. ఇన్ని సంవత్సరాల నా సినీ ప్రయాణం గురించి చెప్పాలంటే… ‘కొంత బాధ ఎక్కువ సంతోషం’ అనే చెప్పుకోవాలి. ఉత్తరాదికన్నా దక్షిణాదివారే నన్ను ఎక్కువగా అభిమానిస్తున్నారు. వారికెప్పుడూ రుణపడి ఉంటాను.
 
తెలుగులో ‘గరుడవేగా’ చేసిన తరువాత చాలా గ్యాప్‌ తీసుకుని మాలీవుడ్‌లో ఓ సినిమా చేస్తున్నాను. ఇందులో ఓ మంచిపాత్ర చేస్తున్నాను. దక్షిణాదిన ఓ క్యారక్టర్‌ చేయడం ఇదే మొదలు. ఈ సినిమా తరువాత మరిన్ని అవకాశాలొస్తాయని అనుకుంటున్నాను. తెలుగులో ఆ పాట తరువాత చాలా మంది అలాంటి పాటలు చేయమని అడిగారు. కానీ నాకు చేయడం ఇష్టం లేక చేయలేదు.
 
మనసుకు నచ్చిన సినిమాలు 
స్టార్‌ హీరోయిన్‌ అన్న గుర్తింపు నాకు రాలేదన్న బాధ ఏమాత్రం లేదు. పెద్ద హీరోలతో, పెద్ద పెద్ద బ్యానర్లలో సినిమాలు చేయకపోవచ్చు. కానీ మనసుకు నచ్చిన సినిమాలు చేశాను. నా మీద ఉన్న పోర్న్‌ స్టార్‌ ముద్రను పోగొట్టుకోగలిగాను. అంత వరకూ హ్యాపీ. ఇప్పుడిప్పుడు పెద్ద బ్యానర్లలో అవకాశాలొస్తున్నాయి. గతంలోలాగా ఏ సినిమా అంటే ఆ సినిమా అంగీకరించడం లేదు.
 
సౌందర్య సాధనాల తయారీ 
నాకు మొదటి నుంచి సౌందర్య సాధనాలంటే ఇష్టం. మేకప్‌ అనేది ఏ వ్యక్తినైనా అందంగా చూపిస్తుంది. నాణ్యమైన మేకప్‌ సామాగ్రిని ఉపయోగిస్తేనే అనుకున్న ఫలితం పొందగలం. అందంగా కనిపించడానికి ఇష్టపడని ఆడపిల్ల ఉంటుందంటే నేను నమ్మను. ఆడపిల్లలకు నాణ్యమైన, మేలురకమైన సౌందర్య సాధనాలు అందించడానికే ఈ రంగంలోకి అడుగుపెట్టాను. వ్యాపారం బాగాపుంజుకుంది.