హాలీవుడ్ కి సూపర్‌ హీరోలనందించిన స్టాన్‌లీ మృతి !

ప్రపంచ వినోద రంగానికి స్పైడర్‌ మేన్‌, బ్లాక్‌ పాంతర్‌, ఐరన్‌ మేన్‌, ఎక్స్‌మేన్‌ లాంటి సూపర్‌హీరోలను అందించిన ప్రముఖ రచయిత స్టాన్‌లీ సోమవారం కన్నుమూశారు. మార్వెల్‌ కామిక్స్‌కు గాడ్‌ఫాదర్‌ గా గుర్తింపు తెచ్చుకున్న స్టాన్‌లీ 1922 డిసెంబర్‌ 22న జన్మించారు. లీ తండ్రి ఎక్కువగా అడ్వంచర్‌ నవలలను చదివారు. ఆ ప్రభావమే లీని రచయితగా మార్చింది.
17 ఏళ్ల వయసులోనే కామిక్‌ ప్రపంచంలోకి అడుగుపెట్టిన స్టాన్‌ లీ తన జీవిత కాలంలో డజన్ల కొద్దీ సూపర్‌ హీరోలకు ప్రాణం పోశారు. కామిక్‌ పుస్తకాల ప్రచురణ సంస్థ మార్వెల్‌లో (అప్పటి పేరు టైమ్‌లీ కామిక్స్‌) రచయితగా ప్రస్థానం ప్రారంభించిన ఆయన తొలుత 1941లో ‘కెప్టెన్‌ అమెరికా స్టోరీ’ని రాశారు. ఆ తర్వాత నలుగురు సూపర్‌ హీరోలు ప్రధాన పాత్ర ధారులుగా ‘ఫెంటాస్టిక్‌ ఫోర్‌’ను రచించారు. ఆయన కలం నుంచి డేర్‌ డెవిల్‌, డాక్టర్‌ స్ట్రేంజ్‌, బ్లాక్‌ పాంథర్‌, యాంట్‌ మ్యాన్‌ లాంటి సూపర్‌ హీరో పాత్రలు పురుడు పోసుకుని పాఠకులను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తాయి. సాహసాలు చేయడమొక్కటే కాదు.. హృదయాలను హత్తుకునే భావోద్వేగాలను ప్రదర్శించేలా లీ తన పాత్రలను తీర్చి దిద్దారు. ప్రధానంగా పిల్లల కోసం సృష్టించిన ఈ పాత్రలు వారితో పాటు పెద్దల్లో దాగున్న పిల్లల్నీ అలరించడం విశేషం. మార్వెల్‌లో వివిధ హోదాల్లో పనిచేసి చీఫ్‌ ఎడిటర్‌ స్థాయికి ఎదిగారు స్టాన్‌లీ.
స్టాన్‌ లీ సృష్టించిన పాత్రల ఆధారంగా మార్వెల్‌ సంస్థ ఎన్నో టీవీ సిరీస్‌లు, మరెన్నో చిత్రాలను తెరకెక్కించింది. ‘స్పైడర్‌ మ్యాన్‌’ సిరీస్‌ చిత్రాలైతే ప్రపంచవ్యాప్తంగా కనక వర్షం కురిపిస్తున్నాయి. స్టాన్‌లీ సూపర్‌ హీరో పాత్రల కలయికతో వచ్చిన ‘అవెంజర్స్‌’, ‘అవెంజర్స్‌: ఏజ్‌ ఆఫ్‌ అల్ట్రాన్‌’, ‘అవెంజర్స్‌: ఇన్ఫినిటీ వార్‌’ చిత్రాలు బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టించాయి. ఐరన్‌ మ్యాన్‌, కెప్టెన్‌ అమెరికా, ఎక్స్‌ మెన్‌ పాత్రలతో వచ్చిన చిత్రాలు ఘన విజయం సాధించాయి.
1961లో తొలిసారిగా ఫెంటాస్టిక్‌ ఫోర్ పేరుతో సూపర్‌హీరో టీంను సృష్టించిన లీ.. 2002లో తన ఆత్మకథను ‘ఎక్సెల్షియర్! ద అమేజింగ్‌ లైఫ్‌ ఆఫ్‌ స్టాన్‌ లీ’ పేరుతో విడుదల చేశారు. ఆయన మృతి పట్ల పలువురు హాలీవుడ్ నటులు, నిర్మాతలు సంతాపం తెలిపారు.