అన్ని సినిమాల్లోనూ నటించలేను కదా!

‘సూపర్‌స్టార్’ మహేశ్‌ బాబు ‘మేజర్‌’ సినిమాతో నిర్మాతగా మారారు.ఇతర భాగస్వాములతో కలిసి ఘట్టమనేని ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై ఆయన ‘మేజర్‌’ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అడివి శేష్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా గురించి మహేశ్‌ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ‘మేజర్‌’ చిత్రాన్ని ఎందుకు తీయాలనుకున్నారు? అందులో ఆయన నటించకపోవడానికి కారణం ఏంటి? వంటి ప్రశ్నలకు మహేశ్ సమాధానం ఇచ్చారు….

“తాను యాక్టివ్‌ నిర్మాతను కానని, తనకు సినిమాలంటే చాలా ఇష్టమని ఆయన పేర్కొన్నారు. తాను నటించే సినిమాలు ఏ జోనర్‌కు సంబంధించినవైనా సరే. కానీ ప్రేక్షకులకు చూపించి తీరాల్సిన కథలు కొన్ని ఉంటాయని, అటువంటి సినిమాల్లో ‘మేజర్‌’ ఒకటని మహేశ్ పేర్కొన్నారు. ఈ సినిమాలో తాను నటించేవాడినేనని, అయితే అన్ని సినిమాల్లోనూ తాను నటించలేను కదా!” అని ఆయన పేర్కొన్నారు. ‘మేజర్‌’ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఆయన చెప్పారు. మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ గురించి అడవి శేష్‌ చాలా పరిశోధన చేశారని, ఈ క్రమంలోనే ఈ పాత్రకు శేషే సరిపోతారనిపించిందని మహేశ్ వెల్లడించారు.

‘మహర్షి’ సినిమా గురించి ఆయన మాట్లాడారు. ‘మహర్షి’ సినిమా తన హృదయానికి బాగా దగ్గరైందని చెప్పారు. ఈ సినిమా కోసం తమ యూనిట్ మొత్తం కష్టపడుతుందని ఆయన పేర్కొన్నారు. తన కెరీర్‌లో మరో ల్యాండ్‌మార్క్‌ సినిమాగా ‘మహర్షి’ నిలిచిపోతుందని మహేశ్ తెలిపారు. ‘మహర్షి’ సినిమా ఏప్రిల్‌ 25న విడుదల కానుంది.