పరిస్థితులు మారాయి.. నయనతారా మారింది!

కథానాయికలంతా ఒకలా ఉంటే… నయనతార తీరు మాత్రం మరోలా ఉంటుంది . ఆమె సినిమాలే మాట్లాడతాయి. ఆమె మాత్రం ఎక్కడా నోరు విప్పదు. కనిపించదు. అప్పుడప్పుడు సినిమా అవార్డు ఫంక్షన్‌ లో తప్ప…అందరిలా సినిమా ప్రమోషన్లకు గానీ..ప్రయివేట్‌ వేడుకలకు గానీ నయన్‌ హాజరుకాదు. కనీసం ఎవరికీ ఇంటర్వ్యూ కూడా ఇవ్వదు. అంత కఠినంగా తాను రాసుకున్న నిబంధనలు పాటిస్తుంది. ‘దక్షిణాది లేడీ సూపర్‌స్టార్‌’ నయనతార ఒక సినిమా అంగీకరించే ముందు చాలా షరతులు పెడుతుంది. సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరుకానని..సినిమాలో గ్లామరస్ దుస్తులు ధరించనని.. హీరోలతో డీప్ రొమాంటిక్ సీన్లలో నటించనని ముందే చెప్పేస్తుంది. ఇన్ని కండీషన్లు పెట్టినా నయన్‌కు వరుస అవకాశాలు వచ్చాయి.నయనతార ఇటీవల నటించిన సినిమాలన్నీ పరాజయాలుగా నిలిచాయి. కొత్త హీరోయిన్ల రాకతో నయన్‌ను అంతగా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆ కారణంగా నయన్‌కు అవకాశాలు తగ్గిపోయాయి.
భారీ పారితోషికం తీసుకుంటూనే .. నయన్ పెడుతున్నఇతర కండీషన్లు నిర్మాతలకు చిరాకు తెప్పిస్తున్నాయి. ఆమెతో పాటు స్టార్ కళాకారులపై కొన్ని కటిన నిబంధనలు పెట్టడానికి నిర్మాతల సంఘం సిద్ధమవుతోంది. దీంతో నయన్ దిగొచ్చిందట. రొమాంటిక్ సీన్లలోనూ, గ్లామరస్ డ్రెస్స్‌ల్లోనూ కనిపించేందుకు ఓకే అంటోందట. అంతేకాదు, ప్రమోషన్ కార్యక్రమాలకు కూడా హాజరవుతానంటోందట. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.అదే నయన్ మనసు మారడానికి కారణమని మీడియా అంటోంది .
 
మొదటిసారి పబ్లిక్‌ కార్యక్రమంలో…
నయనతార దశాబ్దం తర్వాత మొదటిసారిగా పబ్లిక్‌ కార్యక్రమంలో కనిపించింది. ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి నయన్‌ ప్రత్యేక అతిథిగా హాజరు అయింది. ఆదాయ పన్ను శాఖ, ఓ ప్రయివేట్‌ సోషల్‌ సర్వీస్‌ సంస్థ సంయుక్తంగా నిర్వహించిన అయిదు కిలోమీటర్ల ‘వాక్‌ ఏ థాన్‌’లో నయనతార పాల్గొంది. చెన్నైలోని నుంగమ్‌బాకమ్‌లో జరిగిన ఈ ఈవెంట్‌కు ఆమె రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. దానికి సంబంధించిన ఫొటోలు ఆదివారం నెట్టింట్లో హల్‌చల్‌ చేశాయి. గతంలో ఆమె ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘నేను ఈ ప్రపంచం తెలుసుకోవాలని అనుకోవడం లేదు. నేనొక ప్రయివేట్‌ వ్యక్తిని. అందరిలో ఉండలేని దాన్ని. నేను చాలాసార్లు తప్పుగా మాట్లాడాను. తప్పుగా అర్థం చేసుకున్నా కూడా. నన్ను నేను అదుపు చేసుకోవడం నా వల్ల కాదు. నటించడం నా వృత్తి. వాళ్లతో నా సినిమాలే మాట్లాడతాయి” అని చెప్పింది.
నయనతార ప్రస్తుతం ‘నెట్రికన్‌’ అనే చిత్రంతో పాటు, ఆర్‌జే.బాలాజీ స్వీయ దర్శకత్వంలో ‘మూక్కుత్తి అమ్మన్‌’ అనే భక్తిరస కథా చిత్రంలో నటిస్తుంది. ‘కాత్తువక్కుల రెందు కాదల్‌’ పేరుతో తెరకెక్కుతున్న చిత్రంలో సమంత, విజయ్ సేతుపతిలతో కలిసి నటిస్తుంది.