అత్యుత్తమ నటి ‘సురభి లక్ష్మి’

ఈసారి  జాతీయ సినిమా అవార్డుల్లో ఉత్తమ నటిగా మళయాల నటి ‘సురభి లక్ష్మి’ ఎన్నికైంది . అప్పటిదాకా సహాయనటి పాత్రల్లో కనిపించిన ఆమె … ప్రధాన పాత్రలో చేసిన ఒకే ఒక్క సినిమాతో జాతీయ అవార్డును దక్కించుకుంది. ‘మిన్నమిణుంగు’ (ద ఫైర్‌ఫ్లై) సినిమాలో ఆమె నటనకుగాను అవార్డును దక్కించుకుంది సురభి. అందులో ఉత్తమ ప్రతిభ కనబరిచింది అనడం కంటే… సినిమా మొత్తాన్ని ఆమె భుజాలపై మోసిందంటే అతిశయోక్తికాదు.

టీవీ, సినిమా నటిగా సురభి మలయాళీ ప్రజలకు సుపరిచితం. కానీ ఆమె అసలు ప్రతిభ తెలియాలంటే… రంగస్థలం మీద చూడాల్సిందే. నిజంగానే సురభి సార్థక నామధేయురాలు. లక్ష్మి వాళ్ల బామ్మ పేరు సురభి. ‘గృహలక్ష్మి క్వీన్‌’ కాంటెస్ట్‌కోసం… ఫొటో పంపిస్తున్నప్పుడు వాళ్ల భామ్మ పేరు యాడ్‌ చేయమని స్నేహితులు సలహా ఇచ్చారామెకు. అది పనిచేసింది. జీన్స్‌, షర్ట్‌ వేసుకుని ఉంటే మోడ్రన్‌ అమ్మాయిలా కనిపించే సురభిలో ఓ సహజమైన అందం ఉంది. అది పట్టణాలది కాదు. ఈ కాంక్రీట్‌ జంగిల్‌ది అసలే కాదు. పల్లె మట్టివాసనలతో పరిమళించిన సహజత్వం అది.

కళాకారిణి కావాలన్న తృష్ణ …

ఇక పిల్లలు వద్దు అనుకున్న సమయంలో.. 1986నవంబర్‌ 16న లో ఆండీ, రాధలకు నాలుగోబిడ్డగా పుట్టింది. కోజీకోడ్‌లోని నరిక్కునిలో సురభి బాల్యమంతా గడిచింది. పచ్చని పంటపొలాలు, నదులు, అప్పుడప్పుడు వచ్చే సంచారజాతుల కళాకారులు. జీవితం అంతా చూడటానికి పచ్చగా ఉండేది. రోజు గడవడానికి ఎన్నో కష్టాలు. వాటినుంచి బయటపడటానికే ఊర్లోకి వచ్చేవారు సంచారజాతుల కళాకారులు. వాళ్ల ప్రదర్శనలు చూస్తూ పెరిగింది. అప్పుడే సురభిలో కళాకారిణి ఉద్భవించింది. అప్పటిదాకా ఎలా ఉన్నా.. స్టేజీ ఎక్కితే మాత్రం పాత్రలోకి వెళ్లిపోయేది. జీవించేది. ఆమెకు అబ్బిన సౌరభం వెనుక ఎంత సాధారణమైన జీవితం ఉందో అంతే కష్టాలున్నాయి. చిన్నప్పుడు సినిమాలు చూడటం కోసం జీడిపప్పు అమ్మేది. వచ్చిన డబ్బుతో ఒంటరిగా వెళ్లి సినిమాలు చూసి వచ్చేది. కచ్చితంగా కళాకారిణి కావాలన్న తృష్ణ ఏదో ఎప్పుడూ ఆమెలో రగులుతూ ఉండేది. పదేండ్ల వయసులో గురువు కళామండలం సత్యవృతన్‌ దగ్గర శాస్త్రీయ నృత్యం నేర్చుకుంది. చిన్నప్పుడు ఊర్లో జరిగే నాటకాల్లోని పురాణగాథల్లో దేవతగా నటించింది. హైస్కూల్లో కూడా నాటకాల్లో నటించింది. కాలేజీకి వచ్చేనాటికి ఆమె రంగస్థలానికి మరింత దగ్గరైంది. విశాల రంగస్థల ప్రపంచానికి ఎంతో దూరంగా ఉన్న ఆమె… తరువాత నెమ్మదిగా, స్థిరంగా ఆ వైపు అడుగులు వేసింది.

‘కేరళ సాహిత్య నాటక అకాడమీ’ ఉత్తమ నటి…..

రోడ్డు పక్కన దొరికిన చిన్న పేపర్‌లో కనిపించిన ఒక వార్త ఆమెను ‘కలాది శ్రీ శంకరాచార్య కాలేజ్‌’కు చేరేలా చేసింది. అక్కడే ఆమె భరతనాట్యంలో బీఏ పూర్తి చేసింది. అక్కడే ఆమెలోని అసలైన ప్రతిభ బయటికి వచ్చింది. సాధారణంగా కాదు.. ఫస్ట్‌ ర్యాంకులో ఉత్తీర్ణురాలైంది. నెమ్మదిగా ఆమె గమ్యం వైపు కదిలింది. అమృత టీవీలో జరిగిన ఓ పోటీలో ‘బెస్ట్‌ యాక్టర్‌’గా గెలిచి అందరికీ పరిచయమైంది. దాంతో ఆమెకు సినిమా అవకాశాలు వచ్చాయి. ‘బై ద పీపుల్‌’, ‘గుల్‌మొహర్‌’, ‘తిరక్కత’, ‘కాంచీపురతె కళ్యాణం’ వంటి సినిమాలు ఆమె కెరీర్‌లో మైలురాళ్లుగా నిలిచాయి. సినిమాల్లోకి వచ్చినా రంగస్థలం ఆమె వెంటే ఉంది. అందుకే ఓవైపు సినిమాల్లో నటిస్తూనే థియేటర్‌లో ఎమ్మే చేసింది. 2014లో ప్రఖ్యాతిగాంచిన ‘కేరళ సాహిత్య నాటక అకాడమీ’ నుంచి ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది. అబుదాబీ థియేటర్‌ ఫెస్టివల్‌లోనూ బెస్ట్‌ యాక్టర్‌ అవార్డును దక్కించుకుంది.

దాదాపు 30 సినిమాల్లో సహాయనటిగా…..

తండ్రి చనిపోవడంతో కుటుంబ బాధ్యత ఆమెపై పడింది. తన కెరీర్‌ను చక్కబరుచుకుంటూనే కుటుంబానికి ఆసరాగా నిలిచింది. కెకె రాజీవ్‌ తీసిన సీరియల్‌ ‘ఒరు కతాయిలే రాజకుమారీ’ ఆమెను మరింత ప్రజల దగ్గరకు తీసుకెళ్లింది. రంగస్థలంపై ఆమె ప్రదర్శనలు, ఆమె ఏర్పరుచుకున్న స్నేహాలు… నెమ్మదిగా ఆమెను వెండితెరవైపు నడిచిపించాయి. దాదాపు 30 సినిమాల్లో సహాయనటిగానే చేసింది. 2016లో అనిల్‌ థామస్‌ దర్శకత్వం వహించిన ‘మిన్నమిణుంగు (ది ఫైర్‌ ఫ్లై) ప్రధాన పాత్ర పోషించింది. అందులో ఆమె నటనగాకు జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది. జాతీయ అవార్డును గెలుచుకున్న ఐదవ మలయాళ నటి సురభి. అంతకుముందు శారద, మోనిషా, శోభన, మీరాజాస్మిన్‌లు ఉత్తమనటిగా అవార్డులు అందుకున్నారు. ప్రస్తుతం సురభి ‘మీడీయా వన్‌’ టీవీలో ‘ఎమ్‌80 మూసా’ సీరియల్‌లో ప్రధాన పాత్రలో నటిస్తోంది. 2014 అక్టోబర్‌ 19న విపిన్‌ సుధాకరన్‌ను పెళ్లి చేసుకుంది.

కళను సజీవంగా ఉంచేది రంగస్థలమే……

“ఈ అవార్డు వస్తుందని నేనెప్పుడూ ఊహించలేదు. జ్యూరీ మెన్షన్‌ అవార్డు వస్తుండొచ్చు అనుకున్నా. కానీ ఉత్తమ నటి అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం నేను ఓ షో కోసం దుబారుకు వచ్చాను. ఈ వార్త వినగానే కొంతసేపు స్టన్‌ అయ్యాను”

“రంగస్థలం గుడిలాంటిది. అక్కడే మన ఇగో చచ్చిపోతుంది. లేకపోతే నువ్వు నటించలేవు. అక్కడంతా పూర్తిగా ఇవ్వడం, తీసుకోవడం.. పరస్పరం గౌరవం. అది భూమిలోకి చొచ్చుకుని వెళ్లే వేరు వంటిది. కళను సజీవంగా ఉంచేది రంగస్థలమే. ఇక సినిమా అంటారా…. అక్కడంతా సూపర్‌ఫీషియల్‌. మూడేండ్ల అమ్మాయి కూడా నన్ను గుర్తుపట్టి మాట్లాడుతుంది అంటే … అది థియేటర్‌ నాకు ఇచ్చిన వరమే. దానివల్లే టీవీ సీరియల్‌లో రియాలిటీకి అంత దగ్గరగా ఉండగలుగుతున్నాను. అందుకే అందరూ నన్ను ఓన్‌ చేసుకుంటున్నారు. ఇప్పుడు రంగస్థలంపై నటించేందుకు అంత అవకాశం ఉండటం లేదు. సినిమాలు, టీవీ షోస్‌తోబిజీగాఉన్నాను. ఎప్పుడైతే ఊపిరాడనంత బిజీ అవుతానో… కాస్త విశ్రాంతి కోసం మళ్లీ నాటకాలవైపు వెళ్తాను. కాకపోతే ఇతర కళాకారులు చేసిన నాటకాలు చూస్తుంటాను. అదే నన్ను రిఫ్రెష్‌ చేస్తుంది. ఒంటరిగా ఉండటం నాకు ఇష్టం ఉండదు. ఎప్పుడూ నా చుట్టూ జనం ఉండాలనుకుంటాను”