సూర్యకు మాజీ హైకోర్టు న్యాయమూర్తుల మద్దతు !

మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి ఎస్‌ ఎం సుబ్రమణియం ప్రముఖ తమిళ నటుడు సూర్యపై కోర్టు ధిక్కరణ నేరం కింద కేసు నమోదు చేయాలని ప్రధాన న్యాయమూర్తి అమరేశ్వర్‌ ప్రతాప్‌ సాహికి లేఖ రాశారు. తమిళనాడులో నీట్‌ పరీక్షలను రద్దు చేయాలన్న ఆందోళన కొనసాగుతోంది. కరోనా ప్రమాదం ఉన్నందున నీట్‌ను వాయిదా వేయాలన్న అభ్యర్ధనలను కోర్టులు తోసిపుచ్చాయి. వైద్యవిద్యను అభ్యసించాలన్న అభిలాష ఉన్న విద్యార్ధులలో ఒత్తిడి తీవ్రమైంది. సెప్టెంబరు 12న తమిళనాడులో ముగ్గురు విద్యార్ధులు ఆత్మహత్య చేసుకున్నారు. సామాజిక సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించే అలవాటుగల సూర్య …
”కరోనా భయంతో వీడియో కాన్ఫరెన్సుల ద్వారా తీర్పులిచ్చే న్యాయమూర్తులు విద్యార్ధులను మాత్రం భయంలేకుండా పరీక్షలు రాయమంటున్నారు” అని సోషల్‌ మీడియాలో అన్నాడు. ఇప్పుడు సూర్య మీద కోర్టుధిక్కరణ కేసు నమోదు చేయాలని న్యాయమూర్తి కోరినవార్త రావడంతో సూర్య చేసిన వ్యాఖ్య వైరల్‌ అవుతోంది.
సూర్య చేసిన వ్యాఖ్య న్యాయమూర్తుల నిబద్ధతను, అంకిత భావాన్ని శంకించేలా, న్యాయవ్యవస్థను కించపరిచేలా ఉందని జస్టిస్‌ సుబ్రమణియం తన లేఖలో తెలిపారు. ఐతే సూర్య వ్యాఖ్యలు కోర్టు ధిక్కరణగా పరిగణించలేమని, సమాజంలో అందరిలోనూ ఉన్న అభిప్రాయాన్నే సూర్య వ్యక్తం చేశాడని, ఒక సామాజిక చైతన్యం గల వ్యక్తిగా సూర్య చేసినదానిలో తప్పు లేదని హక్కుల కార్యకర్తులు, సీనియర్‌ న్యాయవాదులు అంటున్నారు.
 
‘అగరమ్‌ ఫౌండేషన్’‌ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా సూర్య పేద గ్రామీణ విద్యార్ధులకు ఆర్ధిక సహకారం చేస్తున్నాడు .నీట్‌ విధానం వెనుకబడిన, గ్రామీణ ప్రాంత విద్యార్ధులకు వైద్యవిద్యను దూరం చేస్తున్నదని సూర్య భావిస్తున్నాడు…
”మనం ఈ వివక్షతో కూడిన పరీక్షావిధానానికి వ్యతిరేకంగా పోరాడనట్టైతే.. రాబోయే రోజుల్లో ఇంకా విద్యార్ధుల చావుల వార్తలను మనం వినాల్సిన దుర్గతి పడుతుంది” అని సూర్య అన్నారు. ”ఇది మనునీతి. కేవలం ఒక్క పరీక్షతో అభ్యర్ధుల అర్హత సంగతి తేల్చాలనుకోవడం అర్ధరహితం. ఏకలవ్యుడిపట్ల ద్రోణాచార్యుడు అనుసరించిన పద్ధతినే నేటి పాలకులు నూతన విద్యావిధానం 2020 ద్వారా అనుసరించడానికి పూనుకున్నారు” అని సూర్య వ్యాఖ్యానించారు.
2017 సెప్టెంబరులో సుప్రీంకోర్టు నీట్‌ పరీక్షను సమర్ధిస్తూ తీర్పునిచ్చిన తర్వాత ఇప్పటివరకూ తమిళనాడులో 10 మంది వైద్యవిద్యలో చేరాలనుకున్న ఆశావహులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇది ఇలా ఉండగా.. ఆరుగురు మాజీ హైకోర్టు న్యాయమూర్తులు సూర్య పై ఎటువంటి కోర్టుధిక్కరణ కేసునూ పెట్టవద్దని మద్రాసు హైకోర్టు ప్రధానన్యాయమూర్తికి విజ్ఞప్తి చేసారు.