ఏకంగా 200 దేశాల్లో సూర్య “ఆకాశం నీ హ‌ద్దురా” విడుద‌ల!

హీరో సూర్య న‌టించిన తాజా చిత్రం “సూరరై పొట్రు” ను ఏకంగా 200 దేశాల్లో హాలీవుడ్ రేంజ్‌లో అక్టోబ‌ర్‌ 30న విడుద‌ల చేస్తున్నారు.. లేడీ డైరెక్ట‌ర్‌ సుధా కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాలో అప‌ర్ణ బాల‌ముర‌ళి హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. ఈ చిత్రం తెలుగులో “ఆకాశం నీ హ‌ద్దురా” అనే టైటిల్‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. అయితే లాక్‌డౌన్ కార‌ణంగా థియేట‌ర్లు ఇంకా ఓపెన్ కాక‌పోవ‌డంతో చిన్న, మ‌ధ్య త‌ర‌హా సినిమాలు ఓటీటీని ఆశ్ర‌యిస్తున్న విష‌యం తెలిసిందే. కానీ భారీ సినిమాల నిర్మాత‌లు మాత్రం ఆ సాహ‌సం చేయ‌డానికి వెనుకాడుతున్నారు. పైగా త‌మిళ ఎగ్జిబిట‌ర్లు సినిమాలను నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్ చేయ‌డాన్ని తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు.
 
అయినా సూర్య మాత్రం ఓటీటీకే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. దీంతో భారీ రేటుకు ‘అమెజాన్ ప్రైమ్’ వాళ్లు సూర్య సినిమాను సొంతం చేసుకున్నారు. దీన్ని ఏకంగా 200 దేశాల్లో హాలీవుడ్ రేంజ్‌లో విడుద‌ల చేస్తున్నారు. ఈ విష‌యాన్ని ‘సూర‌రై పొట్రు’ సినిమా నిర్మాణ సంస్థ 2డీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ స‌హ నిర్మాత‌ రాజ‌శేఖ‌ర్ పాండియ‌న్ ధృవీక‌రించారు. ఈ చిత్రం అక్టోబ‌ర్‌ 30న విడుద‌ల కానుంది.  ఈ సినిమా నుంచి గ‌త నెల‌లో విడుద‌లైన ‘కాట్టి పయ‌లే'(కాటుక క‌నులే మెరిసిపోయే) పాట‌ను 15 మిలియ‌న్ల మంది వీక్షించారు. ఎంతైనా ఓ ప్రాంతీయ సినిమాను ఇలా ఎక్కువ‌ దేశాల్లోకి అందుబాటులోకి తేవ‌డం నిజంగా గొప్ప విషయమే.
 
సినిమా కుటుంబాలకు 5 కోట్ల విరాళం!
కరోనా కాలంలో సినిమా ఆఫర్లు లేక ఆర్థిక సమస్యలతో సతమవుతున్న వారికి చేయూతగా సూర్య 5 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చాడు. ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ.. సినీ పరిశ్రమ మనుగడకు ఎన్నో కుటుంబాలు పనిచేస్తున్నాయన్నారు. కరోనా వల్ల ఆర్టిస్టులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ కష్ట కాలంలో ఎంతోమంది నాకు అండగా నిలిచారు. ఈ పరిస్థితుల కారణంగానే డిజిటల్‌ మీడియాలో ‘ఆకాశమే హద్దురా’ సినిమాను విక్రయించామన్నారు. దీనిని అభిమానులతో సహా అందరూ అర్థం చేసుకుంటారని భావిస్తున్నానని సూర్య అన్నారు.
 
సూర్య నటించిన ‘ఆకాశమే హద్దురా’ సినిమాను ఇటీవల ఓటీటీ ప్లాట్‌ఫాంకు విక్రయించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాను సూర్య తన సొంత ప్రొడక్షన్‌ 2D ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మించారు. ఈ చిత్రం టైటిల్‌ను కమల్ హాసన్ నటించిన ‘సొమ్మొకడిది సోకొకడిది’ లోని ఆకాశమే నీ హద్దురా పాట నుంచి తీసుకున్నారు. ఇందులో టాలీవుడ్ సీనియర్ హీరో మోహన్ బాబు ప్రముఖ పాత్రలో నటించారు.