కరడుకట్టిన క్రిమినల్‌గా సాధారణ గృహిణి : సుస్మితాసేన్‌

మాజీ విశ్వసుందరి సుస్మితాసేన్‌ చాలాకాలం తర్వాత ‘ఆర్య’గా వెబ్‌ తెర మీదకు వస్తోంది . భార్యగా, తల్లిగా, భర్త వ్యాపారాన్ని టేకోవర్‌ చేసి… భర్త బిజినెస్‌ పార్ట్‌నర్స్‌, డ్రగ్స్‌ మాఫియాతో తలపడే టఫ్‌ ఉమన్‌గా… ఇంతకుముందు ఎన్నడూ చూడని, సరికొత్త సుస్మితా ‘ఆర్య’లో కనిపిస్తుంది…
‘‘మృగాళ్లు మాత్రమే శాసించే నేర ప్రపంచంలోకి ఒక మహిళ వెళ్లాల్సి వస్తే ఎలా ఉంటుంది? ఆర్యలో నిర్ణయాలు తీసుకునే శక్తి, దాడులను ఎదుర్కొనే ధైర్యం… మొత్తంగా మహిళాశక్తిని చాటుతుంది. ఒక సాధారణ గృహిణి, తన చుట్టూ జరిగే మోసాలను ఆకళింపు చేసుకుని, తన పిల్లల్ని కాపాడుకునేందుకు ఎంత దూరమైనా వెళ్లగలిగే తెగింపు చూపడం ఈ కథలో నన్ను బాగా ఆకట్టుకున్న అంశం. ఇలాంటి పాత్ర కోసం దశాబ్దకాలంగా ఎదురుచూస్తున్నా. అందుకే ఆర్యలోకి పరకాయ ప్రవేశం చేశా’’ అంటోంది సుస్మిత.
ఆమె బాలీవుడ్‌లో నటించి పదేళ్లు అవుతోంది (2010లో ‘నో ప్రాబ్లమ్‌’ చివరి చిత్రం). ఆ తర్వాత 2015లో బెంగాలీ సినిమా ‘నిర్భక్‌’లో కనిపించింది. మళ్లీ ఇన్నేళ్లకు సుస్మిత సెకండ్‌ ఇన్నింగ్స్‌లో వెబ్‌ సిరీస్‌ను ఎంచుకోవడానికి ప్రధాన కారణం ‘ఆర్య’ క్యారెక్టర్‌ ఆమెకు బాగా నచ్చడమే. సుమారు 24 ఏళ్ల సుదీర్ఘమైన కెరీర్‌లో వెండితెరపై ఇప్పటిదాకా వేయని ఒక ఇంటెన్సివ్‌ క్యారెక్టర్‌ ఆమెకు వెబ్‌ సిరీస్ లో దక్కడం విశేషం.
 
ఈ కథను దశాబ్ద కాలంగా రాసుకున్నా!
బయోగ్రాఫికల్‌ థ్రిల్లర్‌ ‘నీర్జా’ తీసి జాతీయ అవార్డుతో పాటు, విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు రామ్‌ మద్వానీ ‘ఆర్య’ వెబ్‌ సిరీస్‌ను రూపొందించారు.
‘‘ఒక సాధారణ గృహిణి నుంచి కరడుకట్టిన క్రిమినల్‌గా ‘ఆర్య’ మారే క్రమంలో, ఈ ప్రయాణంలో ప్రతీ పాత్రకు ఒక ప్రయోజనం ఉంటుంది. ఈ కథను దశాబ్ద కాలంగా నేను చాలా జాగ్రత్తగా… ఇటుక మీద ఇటుక పేర్చుకుంటూ రాసుకున్నా. ఈ వెబ్‌ సిరీస్‌ కోసం సుమారుగా 588 మంది నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణులు నాకు అద్భుతమైన తోడ్పాటును అందించారు. వారి సహకారం లేకుండా నేను ఇంత దూరం ప్రయాణించేవాణ్ణి కాదు’’ అంటున్నారు దర్శకుడు రామ్‌ మద్వానీ.
డచ్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘పెనోజా’కు ఇది రీమేక్‌. ఇందులో సుస్మితాసేన్‌ భర్తగా ఒకప్పటి బాలీవుడ్‌ హీరో చంద్రచూర్‌ సింగ్‌ (‘మాచీస్‌’ ఫేమ్‌) నటించారు. నమిత్‌దాస్‌, సికందర్‌ ఖేర్‌, మనీశ్‌ చౌధురి, వినోద్‌ రావత్‌, అంకుర్‌ భాటియా, అలెక్‌ ఓ నెల్‌, సుగంధ గార్గ్‌ ముఖ్యభూమికలు పోషించారు. ఈ వెబ్‌ సిరీస్‌ జూన్‌ 19న ‘డిస్నీ హాట్‌స్టార్‌’లో విడుదల కానుంది.
 
ఆర్య పోరాటం ఏ దిశగా…
‘ఆర్య’ది ఒక అందమైన ఫ్యామిలీ… బిజినెస్‌ చేసే భర్త, ముగ్గురు పిల్లలతో సంసారం హాయిగా సాగిపోతోంది. కుటుంబమే ఆమె ప్రపంచం. అలాంటి ఇంట్లోకి రివాల్వర్‌ చేరింది. దాన్ని తీసుకుని ఆమె కొడుకు స్కూల్లో తోటి విద్యార్థిని బెదిరించడంతో విషయం తెలిసింది. ‘ఇంట్లో గన్‌ ఎందుకుంది?’… ఆందోళనతో భర్తను నిలదీసింది ఆర్య. ఆమె అనుమానానికి ఒకరోజు సమాధానం దొరికింది. భర్తను ఎవరో పట్టపగలే షూట్‌ చేశారు. ఆ హత్య మరెన్నో ప్రశ్నలను ఆమె ముందుంచింది.
భర్త డ్రగ్స్‌ వ్యాపారంలో ఉన్నాడు. అంతర్జాతీయ డ్రగ్స్‌ మాఫియా ఆమె వెంట పడింది. ‘నీ ముగ్గురు పిల్లల్ని కిడ్నాప్‌ చేస్తాం’ అంటూ హెచ్చరించింది. ఒక ఆడది… తల్లి కోడిలా తన బిడ్డల్ని రెక్కల కింద దాచుకుని ఎంత దూరం పరుగెడుతుంది… భయంతో పరుగెత్తి పరుగెత్తి అలసిపోయింది. మరో మార్గం లేదు… ‘ఆడపులిలా మారాల్సిందే’… ఎదురు తిరగాల్సిందే… ‘నా ఫ్యామిలీని కాపాడుకునేందుకు ఏదైనా చేయడానికి సిద్ధం’ అంటూ గన్‌ చేతిలోకి తీసుకుంది. ఒకవైపు డ్రగ్స్‌ మాఫియా… మరోవైపు పోలీసుల ఇన్వెస్టిగేషన్‌… ఆర్య పోరాటం ఏ దిశగా అనేది ఆసక్తికరం.