`సైరా నరసింహారెడ్డి`ని ఎంతో గౌర‌వంతో చేశాం!

`సైరా నరసింహారెడ్డి`..మెగాస్టార్ చిరంజీవి భారీ హిస్టారికల్ మూవీ. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్‌చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను పూర్తి చేసుకుని అక్టోబ‌ర్ 2న తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుద‌ల‌వుతుంది. ఈ సినిమా థియేట్రికల్ ట్రైల‌ర్‌ విడుద‌ల కార్య‌క్ర‌మంలో ప్ర‌సాద్ ల్యాబ్స్ అధినేత ర‌మేశ్ ప్ర‌సాద్‌, నిర్మాత రామ్‌చర‌ణ్‌, డైరెక్ట‌ర్ సురేందర్ రెడ్డి పాల్గొన్నారు…
 
దర్శకుడు సురేంద‌ర్ రెడ్డి మాట్లాడుతూ…
దొరికిన ఆధారాల‌ను బ‌ట్టి సైరా న‌ర‌సింహారెడ్డి చేశాం. ఆరు నెల‌లు పాటు రీసెర్చ్ చేశాను. నంద్యాల ఎంపీ బ్ర‌హ్మానంద‌రెడ్డి ‘రేనాటి సూర్య‌చంద్రులు’ ట్ర‌స్ట్‌కి అధ్య‌క్షుడు.వారిని క‌లిసి చాలా విష‌యాలు తెలుసుకున్నాను. మ‌ద్రాస్‌కెళ్లి గెజిట్స్ చూశాం. వాటిని ఆధారంగా చేసుకుని సినిమా చేశాను.
ఈ సినిమా డైరెక్ట్ చేస్తానని నేను నిజంగా ఊహించ‌లేదు. ఇంత భారీ బ‌డ్జెట్‌లో చిరంజీవిగారితో ఈ మూవీ చేయ‌గ‌ల‌నా అని ఆలోచించుకోవ‌డానికి 15 రోజుల స‌మ‌యం తీసుకున్నాను. అప్పుడు నాకు చిరంజీవిగారు..’ఆయ‌నెంత క‌ష్ట‌ప‌డి, ఇంత ఎత్తుకు ఎదిగార‌నే’ది క‌న‌ప‌డింది. ఆయ‌న ఇన్‌స్పిరేష‌న్‌తో, చ‌ర‌ణ్‌గారు వెన‌క ఉన్నార‌నే ధైర్యంతోనే ముందుకెళ్ళాను.
 
న‌ర‌సింహారెడ్డి జీవితం.. ఆయ‌న చేసిన పోరాటం.. ఆయ‌న చేసిన త్యాగం చాలా గొప్ప‌ది. ఆయ‌న్ని ఉరి తీసి .. త‌ల న‌రికి 30 ఏళ్ల పాటు ఆయ‌న త‌ల‌ను కోట గుమ్మానికి వేలాడ‌దీశారంటే న‌ర‌సింహారెడ్డిగారు బ్రిటిష్ వారిని ఎంత భ‌య‌పెట్టి ఉంటారో క‌దా. అంత‌క‌న్నా క‌మ‌ర్షియ‌ల్ ఏముంది. స్టార్టింగ్‌లో ఏ స్టార్స్‌ను తీసుకురావాలని మేం అనుకోలేదు.క‌థ‌లో భాగంగానే అమితాబ్‌, సుదీప్‌, విజ‌య్ సేతుప‌తిని తీసుకున్నాం. స్క్రిప్ట్ డిమాండ్ చేసింది. న‌ర‌సింహారెడ్డి పాత్ర చేసిన చిరంజీవిగారికి గురువు గా మాకు అమితాబ్‌ త‌ప్ప ఎవ‌రూ క‌న‌ప‌డ‌లేదు. ఆ విష‌యాన్ని చిరంజీవిగారికి చెబితే ఆయ‌న కోసం అమితాబ్‌ చేశారు. అలాగే ఇత‌ర స్టార్స్ కూడా చిరంజీవిగారితో చేయాలనుకుని ప‌నిచేశారు. క్యారెక్ట‌ర్ డిమాండ్ మేర‌కే ప్ర‌తి ఒక్క‌రినీ తీసుకున్నాం.
 
చ‌ర‌ణ్‌ న‌న్ను ఒక‌టే అడిగారు…`మా డాడీకి నేనొక పెద్ద గిఫ్ట్ ఇవ్వాల‌నుకుంటున్నాను. ఆయ‌న చేసిన150 సినిమాల్లో నెంబ‌ర్ వ‌న్ మూవీ ‘సైరా న‌ర‌సింహారెడ్డి’ కావాల‌ని, చరిత్రలో ఆయ‌న పేరు ఉండిపోవాలి` అనే చెప్పి సినిమాను ప్రారంభించారు.. మంచి సంక‌ల్పంతో చేసిన సినిమా కాబ‌ట్టి సినిమా పెద్ద రేంజ్‌కు వెళుతుంద‌నుకుంటున్నాను.
 
రామ్‌చ‌ర‌ణ్‌ మాట్లాడుతూ…
నాన్న‌ పదేళ్ల నుండి చేయాల‌నుకుంటున్న సినిమా ఇది . సరైన స‌మ‌యంలో, తగిన బ‌డ్జెట్‌తో చేసిన సినిమా. సురేంద‌ర్ రెడ్డిగారి సినిమాల్లో ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ పార్ట్ బాగా ఉంటుంది. అయితే ‘ధృవ’ చేసిన త‌ర్వాత ఆయ‌న ఇన్‌టెన్స్ సినిమా కూడా చేయ‌గ‌ల‌ర‌ని అర్థ‌మైంది. అదే న‌మ్మ‌కంతో ముందుకెళ్లాం.
 
నాన్న‌గారికి కావాల్సిన సినిమానే కాదు.. క‌థ‌కు కావాల్సిన సినిమా చేయాల్సిన అవ‌స‌రం కూడా ఉంది. చాలా క‌ష్ట‌మ‌నిపించింది.నాన్న‌గారు, ప‌రుచూరిగారు క‌లిసి చేసిన ఆలోచ‌న‌ తెర‌పైకి రావాలంటే.. డ‌బ్బులో, ద‌ర్శ‌కుడో ఉంటే స‌రిపోదు. చాలా రెస్పెక్ట్‌తో ..చాలా ప్యాష‌న్‌తో చేయాలి. అదే గౌర‌వంతో సినిమా చేశాం. న‌ర‌సింహారెడ్డి దేశం కోసం పోరాడారు.అతన్ని ఓ కుటుంబానికి ప‌రిమితం చేయడం నాకు న‌చ్చ‌లేదు. అలా చేసి ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి స్థాయిని నేను త‌గ్గించ‌లేను. ఇది చ‌రిత్ర‌.. న‌ర‌సింహారెడ్డిగారు త‌న జీవితాన్ని త్యాగం చేసి విజ‌యం సాధించారు. ఈ సినిమాకు ప్ల‌స్ పాయింట్ అదే. ఈ సినిమాకు అదే విక్ట‌రీ.
 
 ఈ సినిమాకు నిర్మాత‌గా అవ‌కాశం ద‌క్క‌డ‌మే ఎక్కువ‌. నిజంగా నేను అన్నీ ఆలోచించి ఖ‌ర్చు పెట్టి ఈ సినిమా చేయ‌లేదు. చిరంజీవిగారు, సూరిగారు ఏద‌డిగితే అది తెర‌పై క‌న‌ప‌డాల‌ని ఖ‌ర్చు పెట్టాను. ఆ డ‌బ్బు వ‌స్తుందా? రాదా? అని ఆలోచించ‌లేదు. చాలా ప్యాష‌నేట్‌గా సినిమా చేశాను. ఓ నిర్మాత‌గా అక్టోబ‌ర్ 2 ఎప్పుడొస్తుందా? అని ఎదురుచూస్తున్నాను.