మెగాస్టార్ ‘సైరా’ అనేది దసరాకా? సంక్రాంతికా ?

చిరంజీవి కెరీర్‌లోనే అత్యంత భారీ బ‌డ్జెట్‌తో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న చిత్రం సైరా న‌ర‌సింహారెడ్డి. ఆంగ్లేయులను ఎదిరించిన మొదటి తరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న సినిమా కావడంతో దీన్ని టీమ్‌ అంతా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. ఇక నిర్మాత రామ్‌చరణ్‌ దీన్నొక డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా, తండ్రికి ఇచ్చే గిఫ్ట్‌గానూ భావిస్తున్నారు. అందుకే రాజీపడకుండా గ్రాండియర్‌గా తెరకెక్కిస్తున్నారు. మే నెలాఖరులోగా చిత్రీకరణ పూర్తిచేసే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్లు సమాచారం. అమిత్‌త్రివేది స్వరకర్త. సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం కేరళలో ఫైనల్‌ షెడ్యూల్‌ జరుపుకుంటోంది. చేలకుడిలో చిత్రీకరణ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది.దట్టమైన అడవిలో పలు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
 
ఇందులో భారీ స్థాయిలో విజువల్‌ ఎఫెక్ట్స్‌కి స్కోప్‌ ఉంది. వాటికి చాలా సమయం పట్టే ఛాన్స్‌ ఉంది. సినిమాని దసరాకి విడుదల చేయాలనుకుంటున్నట్టు గతంలో నిర్మాత రామ్‌చరణ్‌ ప్రకటించారు. కాని అనుకున్న సమయంలో పూర్తయ్యే అవకాశం కనిపించకపోవడంతో విడుదల తేదీని మార్చాలనుకుంటున్నారట. సంక్రాంతి బరిలో ‘సైరా’ని దించాలని యూనిట్‌ భావిస్తోంది. సంక్రాంతి టార్గెట్‌గా సినిమాని రాజీపడకుండా పూర్తి చేయాలనుకుంటున్నారు. మహేష్‌ నెక్ట్స్‌ సినిమా, రజనీకాంత్‌ ‘దర్బార్‌’ సైతం వచ్చే సంక్రాంతినే టార్గెట్‌ చేశాయి. ‘సైరా’ ఇప్పుడు వాయిదా పడితే వచ్చే సంక్రాంతి పోటీ మామూలుగా ఉండదని వేరే చెప్పక్కర్లేదు.
 
ఇందులో అమితాబ్ బ‌చ్చ‌న్ .. నరసింహారెడ్డి రాజగురువు గోసాయి వెంకన్న పాత్రలో క‌నిపించ‌నుండ‌గా, జ‌గ‌ప‌తి బాబు పోరాటయోధుడు వీరారెడ్డి పాత్ర‌లో క‌నువిందు చేయ‌నున్నారు. సుదీప్, విజ‌య్ సేతుప‌తి, న‌య‌న‌తార‌, త‌మ‌న్నావంటి స్టార్స్ చిత్రంలో న‌టిస్తుండే స‌రికి ఈ మూవీపై భారీ అంచ‌నాలు పెరిగాయి. ‘సైరా’ తర్వాత కొరటాల శివ, త్రివిక్రమ్‌ దర్శకత్వంలో చిరంజీవి సినిమాలు చేయనున్నారు. మరోవైపు శంకర్‌తోనూ ఓ సినిమా ఉంటుందనే వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న విషయం విదితమే.