ఈ ఒక్క జీవితంలోనే ఎన్నో చేయాలని ఉంది !

సినిమాల్లోకి రావాలని, నటించాలని ఎప్పుడూ అనుకోలేదు. సినిమాల్లోకి రావడం యాదృచ్ఛికంగా జరిగింది. ‘ఇదేదో కొత్తగా ఉంది. ప్రయత్నించి చూద్దాం’ అని ప్రయత్నించాను… అని అంటోంది ఇటీవల ‘బద్లా’, ‘గేమ్ ఓవర్’ తో సక్సెస్ సాధించిన తాప్సి. ‘అలా ప్రయత్నించినప్పుడు బాగుంది అనిపించింది. అంతేకాని ‘నా తుదిశ్వాస వరకు నటించాలని ఉంది’ అనే స్థాయి కోరిక అయితే నాకు లేదు.’ప్రపంచస్థాయి నటి కావాలి’ అని కూడా ఎప్పుడూ కల కనలేదు.ఈ ఒక్క జీవితంలోనే ఎన్నో చేయాలని ఉంది. అందులో నటన కూడా ఒకటి అనుకుంటాను తప్ప… నా యావజ్జీవితాన్ని నటనకే అంకితం చేయాలని అనుకోను. నా జీవితంలో ఏ రోజైనా నటించాలని అనిపించకపోతే…మరో పని చేసే సామర్థ్యం నాకుంది’
సక్సెస్‌ను ‘బోనస్‌’ అనుకుంటా !
నన్ను మార్చేంత శక్తి సక్సెస్‌కు లేదు. అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడూ అలాగే ఉన్నాను. ఆ మాటకొస్తే నా కెరీర్‌ మొదట్లో చేసిన ఒక తమిళ చిత్రానికి ఆరు నేషనల్‌ అవార్డులు వచ్చాయి! ఇంతకంటే గొప్ప విషయం ఏముంటుంది? బాలీవుడ్‌లో అడుగు పెట్టడానికి ముందు సక్సెస్, ఫెయిల్యూర్‌లను సమానంగా చూశాను. అందుకే సక్సెస్ వచ్చినప్పుడు మేఘాల్లో తేలిపోను. ఫెయిల్యూర్‌ ఎదురైనప్పుడు పాతాళానికి కుంగిపోను.సక్సెస్‌ను ‘బోనస్‌’ అనుకుంటానే తప్ప తలకు ఎక్కించుకోను. నిత్యం జీవితంలో ఎలా ఉంటానో అలాగే ఉండడానికి ప్రయత్నిస్తున్నా… సామాజిక మాధ్యమాల్లో అంత క్రియాశీలకంగా ఉండను. సినిమా విజయం గురించి, వ్యాపార ఒడిదుడుకుల గురించి పెద్దగా పట్టించుకోను.చేస్తున్న పనిని తప్ప… సక్సెస్,ఫెయిల్యూర్‌లను సీరియస్‌గా తీసుకునే రకం కాదు నేను. ఒకేరకమైన పాత్రలు చేస్తే ప్రేక్షకులకు మొహం మొత్తుతుంది. అందుకే 20 నిమిషాల పాత్ర అయినా సరే… నచ్చితే చేస్తాను.మనం ఎప్పుడైతే మంచి సినిమా చేస్తామో.. అప్పుడే భారీ విజయం చేకూరుతుంది” అని పేర్కొంది తాప్సి.