నేను అనుభవించిన బాధ మాటల్లో చెప్పలేను!

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ ఆత్మహత్య ఘటన తరువాత ఇప్పుడు బాలీవుడ్ లో నెపోటిజం అనే పదం చర్చనీయాంశంగా ట్రోల్‌ అవుతోంది. దాంతో, తామూ నెపోటిజం బాధితులమే! అని చెప్పుకొని.. పలువురు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ‘నేనూ బాధితురాలినే’ అంటోంది తాప్సీ. దక్షిణాదిలో మొదట కథానాయికగా పేరు తెచ్చుకుంది ఉత్తరాది భామ తాప్సీ. ముఖ్యంగా తమిళంలో మొదటగా ‘ఆడుగళం’ చిత్రంలో ధనుష్‌కు జంటగా పరిచయమైంది. ఆ చిత్రం విజయం తర్వాత తమిళంలో,తెలుగులోనూ కొన్ని చిత్రాల్లో నటించినా.. పెద్దగా పేరు సంపాదించుకోలేక పోయింది. దీంతో బాలీవుడ్‌ కు మారిపోయిన తాప్సీ.. అక్కడ నటించిన కొన్ని చిత్రాలు సక్సెస్‌ అవడంతో బాలీవుడ్లో కథానాయికగా రాణిస్తోంది. నటనకు అవకాశం ఉన్న పాత్రలు ఆమెను వరించడం విశేషం.తాప్సీ కూడా నెపోటిజం బాధితురాలినే నని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొంది. దీని గురించి చెబుతూ …
“సినీ పరిశ్రమలో ప్రముఖుల వారసులుగా రంగప్రవేశం చేసిన వారికి పరిచయాలు ఎక్కువగా ఉంటాయని.. వారికి సినిమాల్లో అవకాశాలు చాలా సులభంగా వస్తాయని అంది. అయితే ఏలాంటి సినీ నేపథ్యం లేని వాళ్లు ప్రముఖులతో పరిచయాలు అవడానికి చాలా కాలం పడుతుందని చెప్పింది. దర్శకులు కూడా బయటి నుంచి వచ్చే వారికి అవకాశాలు కల్పించడం కంటే… ప్రముఖుల వారసులతో చిత్రాలు చేయడానికే ఎక్కువగా ఆసక్తి చూపుతారని చెప్పింది. అలా మొదట్లో తాను పలు అవకాశాలను కోల్పోయినట్టు .. అప్పుడు తాను అనుభవించిన బాధ మాటల్లో చెప్పలేనని పేర్కొంది. ఇలాంటి బాధాకరమైన సంఘటనలకు ప్రేక్షకులు కూడా ఒక కారణమని ఆరోపించింది. సినిమా వారసులకు నటించిన చిత్రాలను చూడడానికి ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారని..ఇతరులు వారి చిత్రాలను పట్టించుకోకపోవడం ఇందుకు కారణమని తాప్సీ చెప్పింది..
 
మంచిలో కూడా చెడునే చూస్తారు!
“కొందరు మనుషులు మంచిలో కూడా ఎప్పుడూ చెడునే చూస్తారని కథానాయిక తాప్సీ పేర్కొంది. తనను విమర్శించిన బాలీవుడ్ హీరోయిన్ కంగనా‌రనౌత్‌కు తాప్సీ పరోక్షంగా చురక అంటించింది. తాప్సీపై ఇటీవల కంగన డిజిటల్ టీమ్ విమర్శలు చేసింది…”సినీ నేపథ్యం లేకుండా వచ్చిన కొందరు మూవీ మాఫియా దృష్టిలో మంచిగా ఉండాలనుకుంటున్నారు. తాప్సీ.. నిన్ను చూసి సిగ్గుపడుతున్నాం” అంటూ కంగన టీమ్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది..
 
ఈ పోస్ట్‌పై తాజాగా తాప్సీ పరోక్షంగా స్పందించింది. `కొందరు వ్యక్తులు మంచిలోనూ చెడునే చూస్తారు. అలాంటి వ్యక్తులను కూడా దేవుడు మంచిగానే చూస్తాడు. అలాంటి వారి గురించి మనం ప్రార్థనలు చేయాలి. వారు చెడ్డవారిని తెలిసినా.. వారితో మనం చెడుగా ప్రవర్తించకూడదు. వారు కూడా ఎదగాలని ప్రార్థనలు చేయాలి. మన ప్రవర్తన ఎలా ఉండకూడదో వారిని చూసి తెలుసుకోవాల”ని తాప్సీ పోస్ట్ చేసింది.