ఆన్ లైన్ టిక్కెట్ పోర్ట‌ల్ …సింగిల్ విండో అనుమ‌తులు ప్రారంభం !

రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత సినీప‌రిశ్ర‌మ భ‌విత‌వ్యంపై సినీప‌రిశ్ర‌మ ప్ర‌ముఖులు టి-ప్ర‌భుత్వంతో ముచ్చ‌టించిన సంగతి తెలిసిందే. ఆ క్ర‌మంలోనే తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌రిశ్ర‌మ పెద్ద‌ల‌కు కొన్ని హామీలు ఇచ్చింది. అందులో ముఖ్యంగా సింగిల్ విండో ప‌ద్ధ‌తిలో షూటింగుల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా సునాయాసంగా అనుమ‌తులు ల‌భించేలా చేస్తామ‌ని ప్ర‌భుత్వం ప్రామిస్ చేసింది. తాజాగా ఆ ప్రామిస్‌ని నెర‌వేర్చింది టి-ప్ర‌భుత్వం. నేడు సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస యాద‌వ్ స్వ‌యంగా సింగిల్ విండో షూటింగ్ ప‌ర్మిష‌న్స్ వింగ్‌ను, ఆన్ లైన్ టిక్కెట్ పోర్ట‌ల్ ను ప్రారంభించారు. హైద‌రాబాద్‌ సెక్ర‌టేరియ‌ట్ లో నేటి ఉద‌యం 11 గంట‌ల‌కు డి-బ్లాక్ లోని గ్రౌండ్ ఫ్లోర్‌లో కాన్ఫ‌రెన్స్ హాల్‌లో లాంచింగ్ కార్య‌క్ర‌మం చేశారు.
ఇక నుంచి సునాయాసంగా ఎలాంటి స‌మ‌స్య‌లు లేకుండా సింగిల్ విండో విధానంలో నిర్మాత‌లు షూటింగు అనుమ‌తులు పొంద‌వ‌చ్చ‌ని త‌ల‌సాని తెలిపారు. షూటింగ్ ల‌కు అనుమ‌తుల విష‌య‌మై టీ.ఎఫ్.డి.సికీ ఆన్ లైన్ లో ద‌ర‌ఖాస్తు చేసుకుంటే 7 రోజుల్లో అనుమ‌తులు ల‌భిస్తాయ‌న్నారు. ఒక‌వేళ అనుమ‌తి రాక‌పోతే అనుమ‌తి వ‌చ్చిన‌ట్లుగా  ప‌రిగ‌ణంచి షూటింగ్ చేసుకోవ‌చ్చ‌ని త‌ల‌సాని తెలిపారు. అలాగే బ‌స్టాండ్ల‌లో మినీ థియేట‌ర్స్ నిర్మాణారికి టెండ‌ర్లు పిలిచామ‌ని, అంత‌ర్జాతీయ ఫిలిం స్టూడియో నిర్మాణానికి  సంబంధిచి స్థ‌లం ఎంపిక‌పై దీపావ‌ళి త‌ర్వాత ప‌ర్య‌టిస్తామని, అలాగే ఐద‌వ ఆట‌కు సంబంధించి రెండు మూడు రోజుల్లో జీవో జారీ చేయ‌నున్నామ‌య‌ని త‌ల‌సాని తెలిపారు.
ఈ స‌మావేశంలో ప్ర‌భుత్వ స‌ల‌హ‌దారి కె.వి ర‌మ‌ణాచారి,  ఎఫ్.డి.సీ చైర్మ‌న్ రామ్మోహ‌న‌రావు, ఎఫ్.డి.సి ఎండీ న‌వీన్ మిట్ట‌ల్,  జె.ఎం.డి కిషోర్ బాబు, హైద‌రాబాద్ అడిష‌న‌ల్ క‌మీష‌న‌ర్ టి.ముర‌ళీ కృష్ణ‌, సైబ‌రాబాద్ జాయింట్ క‌మీష‌న‌ర్  షాన్ వాజ్ ఖాసీమ్, నిర్మాత‌లు దిల్ రాజు, జెమిని క‌ర‌ణ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.
త‌ల‌సానిగారికి `మా` త‌రుపున కృత‌జ్ఞ‌త‌లు! : `మా` అధ్య‌క్షుడు శివాజీ రాజా
సింగిల్ విండో విధానంలో షూటింగ్ ల‌కు అనుమ‌తులు… ఆన్ లైన్ టికెంటింగ్ ప్ర‌భుత్వం పోర్ట‌ల్ ను లాంచ్ చేసిన సంద‌ర్భంగా `మా` మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు శివాజీ రాజా హ‌ర్షం వ్య‌క్తం చేశారు.
`ఇక‌పై షూటింగ్ అనుమ‌తుల‌కు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా..అలాగే బ్లాక్ టికెట్ల దందా నిలువ‌రించేందుకు తెలంగాణ రాష్ర ప్ర‌భుత్వం తీసుకున్న ఈ చ‌ర్య‌లు టాలీవుడ్ ఇండ‌స్ర్టీకి ఎంతో ఉప‌యుక్తంగా ఉంటాయి. మంత్రి త‌ల‌సాని శ్రీనివాస యాద‌వ్ గారు ప‌రిశ్రమ లో ఉన్న స‌మ‌స్య‌ల గురించి తెలుసుకుని స్వ‌యంగా ఆయ‌న మ‌న అభివృద్ది కోసం ఎంతో ప్ర‌త్యేకంగా శ్ర‌ద్ద తీసుకుని ప‌నిచేస్తున్నారు. ఆయ‌న సినీ ప‌రిశ్ర‌మ ప‌క్ష‌పాతి. అందుకు త‌ల‌సాని గారికి `మా` త‌రుపున `మా` అధ్య‌క్షుడు శివాజీ రాజా కృత‌జ్ఞ‌త‌లు` తెలిపారు.